నందమూరి తారక రామారావు

నందమూరి తారకరాముని కి జయంతి నివాళి


వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. అభిమానులు షార్ట్ అండ్ స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు. నేడు ఆయన జయంతి. నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా...రాజకీయ వేత్తగా....ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలుపించుకున్న మహానటుడు ఎన్టీఆర్.


తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, వెండితెర వేలుపు నందమూరి తారక రాముడు. పేరు లొనే దైవత్వాన్ని 'తార' ని నింపుకుని వెండితెర మీద కృష్ణుడు, రాముడు ఒకటేమిటి యుగపురుషుల్లోని ప్రతి పాత్రకి ప్రాణం పోసిన ఘనత విశ్వవిఖ్యాత నట సార్వభౌములు తారక రామునిదే. ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే.. కృష్ణుడు ఆయనే.

అందమైన రూపం ఆకర్షణీయమైన వాక్చాతుర్యం ఆయన సొంతం. రైతు కుటుంబం లో పుట్టి పాలు అమ్ముకుని స్థాయి నుంచి ప్రజల్ని పాలించే స్థాయి దాకా కష్టే ఫలి అనే నానుడిని నిజం చేసే విధంగా సాగింది ఆయన ప్రస్థానం. సినీ రంగం లో అందం తో పాటు అభినయం కలగలిపి ఆనాటి సినీ రంగాన్ని తనదైన శైలిలో ఏలిన నట చక్రవర్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ నుంచి ఆడపడుచులు మా ఎన్టీవోడు అనే స్థాయికి ఎదిగిన అభిమానం ఆయన. తెలుగు వారిని మదరాసి నుంచి ఆంధ్రుడు అని ప్రపంచానికి చాటిన తెలుగింటి రాముడు. దేవుని పాత్రలే కాదు నెగిటివ్ రోల్స్ అయిన దుర్యోధనుడు రావణుడు పాత్రలకు గౌరవం తెచ్చిన ఏకైక హీరో ఎన్టీఆర్.

జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో నటించటం కాదు జీవించిన నటులు వారు. ఆయా పాత్రల్లో అద్భుతంగా నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు యుగపురుషుడు ఆ తారక రాముడు.

మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్‌టిఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి. మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత ఎన్‌టిరామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.

మనవరాలు గా నటించిన శ్రీదేవి ఆయన జత కడితే ఇలాంటి పెయిర్ ఇంకోటి వస్తుందా అని హిట్ మీద హిట్ చేసి నీరాజనాలర్పించారు. ఎప్పటికీ తరగని వర్ఛస్సు ఆ దైవంశ సంభూతుడికి మాత్రమే సాధ్యం. హీరోయిన్ గా అంజలి గారు, వాణిశ్రీ, సావిత్రి గారు ఆయన పక్కన అహో అనిపిస్తే జయసుధ, జయప్రద, లత వంటి వారి పక్కన ఈయన సూపర్ అనిపించారు. బొద్దుగా, అందంగా గంభీరమైన వర్ఛస్సు, సింహం లాంటి నడక ఎటువంటి వారిని అయినా థియేటర్ కి రప్పించేదంటే అతిశయోక్తి కాదు. రాజసం, రూపం తేజో స్వరూపం, మాట గంభీరం ఇదే కదా ఎన్టీవోడు అంటే.

అన్న’ ఎన్టీఆర్. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్.
ఆయన ఈ భూమి మీద లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు.




నాటకాలతో అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందారు రామారావు.  అతనిలోని నటుడ్ని గుర్తించిన  ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు ‘పల్లెటూరిపిల్ల’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో  ‘మనదేశం’ సినిమా లో అవకాశం రావడంతో దానిలో నటించారు. అలా.. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం ‘మనదేశం’ అయ్యింది. 1949లో వచ్చిన ఆ మూవీలో ఒక పోలీస్ ఇన్స్ స్పెక్టర్ పాత్ర పోషించారు. ఆ తర్వాత  1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే ఏడాది విజయా ప్రొడక్షన్ సంస్థ ఎన్టీఆర్, జానకి హీరోహీరోయిన్లుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘షావుకారు’ నిర్మించారు. ఎన్టీఆర్ తొలి ఇరవై ఏళ్లలోనే 200 సినిమాలు చేసారు. యేడాదికి సగటున 10 చిత్రాలు ఆయనవి విడుదలయ్యేవి.




విజయా సంస్థ తో కుదిరిన ఒప్పందంతో  ఎన్టీఆర్ ఆ బ్యానర్ కు ఆస్థాన నటుడయ్యారు.  1951లో కె.వి.రెడ్డి డైరెక్షన్ లో విజయా వారు నిర్మించిన ‘పాతాళ భైరవి’ నటుడిగా ఎన్టీఆర్‌కు తిరుగులేని స్టార్ డమ్ తీసుకొచ్చింది. 1956లో విడుదలైన ‘మాయాబజార్’లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికాడు.  వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేసారు. ఈ తరువాత ఎన్టీఆర్ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించి మురిపించాడు. అంతర్నాటకాల్లో కలపి మొత్తంగా 30కి పైగా చిత్రాల్లో కనిపించారు.




రామారావు తొలిసారిగా రాముని గెటప్‌లో 'చరణదాసి' అనే సాంఘిక చిత్రంలో కనిపించాడు. రామారావు శ్రీరాముని గెటప్‌లో పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు... తమిళంలో  తీసిన 'సంపూర్ణరామాయణం’లో.  ఆ తర్వాత 1963లో విడుదలైన ‘లవకుశ’ సినిమా.. రాముడిగా ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టింది.




1959లో ఎవియమ్ వారు నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు జీవం పోసారు రామారావు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ ఎన్ఎటి పై నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు. అందులో రావణుడిగా నటించి మెప్పించాడు. ఈ తర్వాత ‘వేంకటేశ్వర స్వామి మహత్యం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో వేంకటేశ్వరుడిగా మెప్పించాడు. ఆయన నటంచిన చిత్రాల్లో దాదాపు 97 శాతం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం విశేషం. తెలుగులో ఇలాంటి రేర్ రికార్డు ఎవరికీ లేదు. అంతేకాదు ఆయన సినిమాలు మళ్లీ రిలీజైతే.. మళ్లీ మొత్తం పెట్టుబడి తిరిగి రాబట్టగలగడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.




పౌరాణికాలే కాదు జానపద సినిమా హీరోగా ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. 1977లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవిరాముడు’తో ఎన్టీఆర్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. అదే ఏడాది విడుదలైన ‘దాన వీర శూరకర్ణ’ ను ఎవరూ మరిచిపోలేరు. అందులో ఆయన పోషించిన  శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితర సాధ్యమనే చెప్పాలి. అంతేకాదు దాదాపు 4 గంటల నిడివి కలిగిన ఈ సినిమాను ఎలాంటి కోతలు పెట్టకుండా విడుదల చేసి అఖండ విజయం సాధించింది.




ఆ తర్వాత 1979 లో య‌న్టీఆర్ ‘శ్రీమద్విరాట్ విరాట్ పర్వం’లో 5 పాత్రలు పోషించి  మెప్పించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణ, , దుర్యోధన, కీచక, అర్జున, బృహన్నల పాత్రల్ని అవలీలగా పోషించి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు. అంతకు ముందు ‘జగదేకవీరుని కథ’లో శివ శంకరి పాటలో ఐదు పాత్రల్లో తొలిసారి కనిపించారు. అలాగే యన్టీఆర్ స్టార్‌గా వెలుగు తున్న దశలోనే  తాత, తండ్రి, మనవడు పాత్రల్లో ‘కులగౌరవం’ అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేసారు. పేకేటి శివరాం దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యన్టీఆర్ నటించిన అరుదైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాల్ని లెక్కలేనన్ని పోషించారు యన్టీఆర్.


‘మన దేశం’ చిత్రం యన్టీఆర్ నటించిన ఆఖరి మాస్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తరువాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతూ ఉండగానే యన్ఠీఆర్  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సమ్రాట్ అశోక’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ లాంటి  చారిత్రక ,పౌరాణిక  చిత్రాలు తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు.



యన్టీఆర్ తన 44 ఏళ్ళ సినీ జీవితంలో  13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెర పై చెరగని ముద్ర వేసారు. అంతేకాదు హిందీలో ‘నయా ఆద్మీ’ ‘చండీరాణి’ అనే రెండు సినిమాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించారు.ఇక  గతేడాది ఆయన జీవితంపై ఆయన తనయుడు ‘ఎన్టీఆర్ కథానాాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించాడు. ఇక ఆయన జీవిత చరమాంకంలో జరిగిన రాజకీయాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రూపొందించాడు. ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోలేదు.



No comments:

Post a Comment