ఇల్లాలు

 




ఎల్వీ ప్రసాద్‌ ద్విభాషా చిత్రం ‘ఇల్లాలు’🌹


‘‘నవ్విన ఊళ్లే పట్నాలవుతాయన్న నానుడి నీరసించిపోతున్నప్పుడల్లా ఎవరో ఒక ప్రజ్ఞాశాలి వచ్చి, దాన్ని ఆదుకొని, ఆ మాట నిలబెట్టి ‘ఇది ఉట్టి సామెతే’నని నిస్పృహ చెందేవారికి ధైర్యం చెబుతూ వుంటాడు. అటువంటి ‘దర్శకులపతి’ ఎల్వీప్రసాద్‌’’ అని అరవై దశకంలోనే ముళ్లపూడి వెంకటరమణ చెప్పారు. ఆయన జీవితాన్ని తరచి చూసిన వారికి ఎల్వీ ప్రసాద్‌ ప్రతిభేమిటో అర్థమవుతుంది’ ‘‘నేను కంటి ఆసుపత్రి ఎందుకు పెట్టానో తెలుసా? ప్రజలకు కళ్లు బాగా వుండి, ఎక్కువ సినిమాలు చూడాలని’’ అంటూ చమత్కరించిన ప్రసాద్‌ ఒక మంచి నటుడు, నిర్మాత, దర్శకుడు, అన్నిటికీ మించి గొప్ప దార్శనికుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ‘మనోహర’ (1954), ‘మిస్సమ్మ’ (1955) సినిమాలు చాలు ఆయన ప్రతిభ చాటేందుకు. ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను నెలకొల్పి నిర్మాతగా తన తొలి తెలుగు సినిమా ‘ఇల్లాలు’ను సమాంతరంగా తమిళంలో ‘ఇధయ కమలం’గా నిర్మించి విజయం సాధించిన ‘‘దొడ్డ’’ మనిషి ఎల్వీప్రసాద్‌. ‘ఇల్లాలు’ సినిమా 29, అక్టోబర్‌ 1965న విడుదలైంది. ఆ సినిమా విశేషాలు కొన్ని పాఠకుల కోసం...


‘ఇల్లాలు’ నేపథ్యం..


భారతీయ తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ ‘కాళీదాసు’ సినిమాలన్నిటిలోనూ నటించిన ఘనత తెలుగు ఎల్వీ ప్రసాద్‌కే దక్కుతుంది. హెచ్‌.యం.రెడ్డి సలహాపై మద్రాసు వచ్చిన ఎల్వీప్రసాద్‌ అటు సినిమాల్లో నటిస్తూ, ఇటు దర్శకత్వ ప్రతిభను ప్రదర్శిస్తూ అంచెలంచలుగా ఎదిగారు. ఆయన నిర్మాతగా మారి 1955లో లక్ష్మీ పిక్చర్స్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి యోగానంద్‌ దర్శకత్వంలో ‘ఇలవేలుపు’ సినిమాను నిర్మించి విజయం సాధించారు. ఆ తర్వాత 1956లో ‘ప్రసాద్‌ పొడక్షన్స్‌’ సంస్థను నెలకొల్పి హిందీలో ‘శారద’, ‘చోటి బెహన్‌’, ‘బేటి బేటే’ చిత్రాలకు దర్శక-నిర్మాతగా, ‘ససురాల్‌’, ‘హమ్‌ రాహి’ సినిమాలకు నిర్మాతగా, తెలుగులో ‘మిస్సమ్మ’, ‘అప్పుచేసి పప్పుకూడు’ వంటి చిత్రాలకు, తమిళంలో ‘భాగ్యవతి’ ‘ఇరువర్‌ ఉళ్లం’ వంటి మరెన్నో చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. 1965లో ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద నిర్మాతగా ‘ఇల్లాలు’ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాతగానే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహిస్తూ సిద్ధహస్తుడైన ఎడిటర్‌గా పేరుతెచ్చుకున్న తన తమ్ముడు అక్కినేని సంజీవరావు (సంజీవి)కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. సంజీవికి దర్శకునిగా ఇదే మొదటి చిత్రం. ఇక సినిమా కథ విషయానికి వస్తే... 1964లో రాజా పరాంజపే దర్శకత్వంలో ‘పాఠలాగ్‌’ పేరుగో ఒక మరాఠీ సినిమా వచ్చింది. కాశీనాథ్‌ ఘనేకర్‌ పేరుతో ఒక మరాఠీ సినిమా వచ్చింది. కాశీనాథ్‌ ఘనేకర్‌, భావన అందులో నాయకానాయికలు. దత్తా దవజేకర్‌ సంగీత దర్శకత్వం నిర్వహించిన ఈ మరాఠీ చిత్రానికి జయంత్‌ దాహ్లె కథను సమకూర్చారు. ‘పాఠలాగ్‌’ సినిమా బాగా ఆడటమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి, మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తమచిత్ర బహుమతి కూడా అందుకుంది. అదే సినిమా కథను స్ఫూర్తిగా తీసుకొని ముళ్లపూడి వెంకటరమణ చేత కథ, మాటలు రాయించి ‘ఇల్లాలు’ పేరుతో ఎల్వీప్రసాద్‌ సినిమాగా తీశారు.


వి‘చిత్ర’ కథ..


ప్రేమించుకుని పెళ్లాడిన వేణుగోపాలరావు (కె.వి.నాగేశ్వరరావు), రాధారాణి (గీతాంజలి)లది అనుకూల దాంపత్యం. వేణుగోపాలరావుకు ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదువుకునే అవకాశం వస్తుంది. ఒక సంవత్సరం ఎడబాటు భరిస్తే తన భర్తకు న్యాయవాదిగా మంచి పేరుప్రతిష్టలు వస్తాయని రాధారాణి భర్తను ప్రోత్సహించి ఇంగ్లాండుకు పంపుతుంది. భార్యకు జబ్బుచేసి ప్రాణాపాయ స్థితిలో ఉందని వేణుగోపాలరావుకు టెలిగ్రాం రాగానే అతడు విదేశాల నుండి తిరిగి వస్తాడు. అతని చేతులలోనే భార్య మరణిస్తుంది. అంత్యక్రియలన్నీ అతడే స్వయంగా జరిపిస్తాడు. ఆ వూరి శివార్లలో స్థావరం ఏర్పరచుకున్న బందిపోటు ముఠానాయకుడు సింగన్న (సి.హెచ్‌.కృష్ణమూర్తి)ను పట్టుకోవటానికి పోలీసులు దాడిచేస్తాడు. సింగన్న గాయపడి తప్పించుకుంటాడు. అతని భార్య సుధారాణి (గీతాంజలి) పోలీసులకు పట్టుబడుతుంది. ఎన్నో దోపిడీలకు, హత్యలకు ఆమెను కారకురాలుగా భావించిన పోలీసులకు తను దొంగరాణిని కాననీ, తనపేరు రాధారాణి అనీ, లాయరు వేణుగోపాలరావు ‘‘ఇల్లాలు’’ననీ వాంగ్మూలం ఇస్తుంది. వేణుగోపాలరావు ఇంటి ఆనవాళ్లు, కుటుంబం గురించి ఎన్నో వివరాలు పూసగుచ్చినట్లు చెబుతుంది. ఆమె రూపురేఖలు అచ్చుగుద్దినట్లు రాధారాణివిలాగే వుంటాయి. సమస్య కోర్టు పరిధిలోకి వస్తుంది. కోర్టులో తన మొదటి సాక్షిగా వేణుగోపాలరావునే ఎంచుకుంటుంది. భర్త నడము మీద పుట్టుమచ్చతో సహా ఎన్నో దాంపత్య రహస్యాలను దొంగలరాణిగా పిలువబడే సుధారణి కోర్టుకు వెల్లడిస్తుంది. అయితే వేణుగోపాలరావు మాత్రం ఆమె తన భార్య కాదని వాదిస్తాడు. చివరికి ఆమెకు మతి భ్రమించిందని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. భర్తతో ఏకాంతంగా మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొంది ఆమె భర్త ఇంటికి వెళ్తుంది. చనిపోయినది తన సోదరి సుధారాణి అని, తామిద్దరమూ కవలపిల్లలమని చెప్పి దాఖాలాలు చూపిస్తుంది. దురదుదృష్టవశాత్తు తన భార్య దోపిడీ ముఠాకు దొరికిందని వేణుగోపాలరావు గ్రహిస్తాడు. రాధారాణి పోలీసులకు పట్టుబడినప్పటి నుంచి ఆమెను మారువేషంలో వెన్నంటి వస్తున్న సింగన్న, చనిపోయింది తన భార్య సుధారాణి అని గ్రహించి, పశ్చాత్తాపపడి, పోలీసులకు లొంగిపోతాడు. కోర్టులో రాధారాణిని భార్యగా స్వీకరించడంతో సినిమా ముగుస్తుంది. సహయక పాత్రలలో న్యాయమూర్తిగా ధూళిపాళ్ల, ప్రభుత్వ వకీలుగా ప్రభాకర్‌రెడ్డి, పోలీసు అధికారిగా రామకృష్ణ, గుమాస్తాగా అల్లు రామలింగయ్య, ఇంటి నౌకరుగా చదలవాడ కుటుంబరావు నటించగా చలం, రామన్న పంతులు హాస్యాన్ని పండించారు.


చిత్ర విశేషాలు..


‘ఇల్లాలు’ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకే బ్యానర్‌ మీద ఎల్వీప్రసాద్‌ నిర్మించారు. అయితే తెలుగులో నిర్మించిన చిత్రంలో కొన్ని ప్రయోగాలు చేశారు. మొదటిది సినిమా దర్శకుని నియామకం. అక్కినేని సంజీవరావు ఎల్వీ ప్రసాద్‌కు స్వయానా తమ్ముడు. ఎన్నో తమిళ, తెలుగు ఒరియా చిత్రాలకు సమర్ధవంతమైన ఎడిటర్‌గా పనిచేసిన ప్రతిభావంతుడు. ‘‘సంజీవి’’గా పిలిపించుకునే సంజీవరావు ఎంతటి ప్రజ్ఞావంతుడంటే, సినిమాలకు సబ్‌-టైటిళ్లు వేసే పరికరం మన దేశంలోకి రాని కాలంలోనే సొంత ప్రతిభతో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందకు, సాక్షి వంటి తెలుగు సినిమాలకు సబ్‌-టైటిళ్లు జోడించి అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలకు పంపిన ప్రయోగశాలి. ఈ సంజీవి కుమారుడే పదిహేను భాషల్లో సినిమాలకు ఎడిగింగ్‌ చేసిన వ్యక్తిగా ‘లిమ్కా’ రికార్డులకెక్కి అనేక జాతీయ పురస్కారాలను అందుకున్న శ్రీకర ప్రసాద్‌. ఇక హీరో విషయానికొస్తే, స్ఫురద్రూపి అయిన కర్రి వెంకట నాగేశ్వరరావు (కె.వి. నాగేశ్వరరావు) అనే నూతన నటుణ్ని ఎంపిక చేశారు. ఇతడు ఖరగ్‌పూర్‌ రైల్వే లోకోషెడ్‌లో చార్జ్‌మన్‌గా పనిచేస్తూ ఎన్నో నాటకాల్లో నటించాడు. తొలి చిత్రంలోనే గంభీరమైన పాత్రను పోషించి ఆకర్షించుకోగలిగాడు. అప్పటి వరకు అనేక సినిమాల్లో నర్తకిగా, వ్యాంప్‌గా నటించిన గీతాంజలికి హీరోయిన్‌ పాత్రను కట్టబెట్టడం కూడా ఒక సాహసమని చెప్పాలి. అది కూడా ద్విపాత్రాభినయంలో, ఇక బందిపోటు విలన్‌గా విశేష నాటకానుభావం, చక్కని వాచికం వున్న సి.హెచ్‌. కృష్ణమూర్తిని ఎంపిక చేసుకున్నారు. సంజీవి కథను నడిపించిన తీరు వైవిధ్యంగా ఉంటుంది. సగం కథ ప్రత్యక్షంగాను, మిగతా భాగం ‘ప్లాష్‌- బ్యాక్‌’లోను నడుస్తుంది. ప్లాష్‌-బ్యాక్‌ కథను విడదీసి సమన్వయ పరచుకుంటూ వీక్షించే అవకాశం ప్రేక్షకుడికి కలిగింది. ముళ్లపూడి మాటలు సరళంగా ఉండి కథనాన్ని సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్లేందుకు ఉపకరించాయి. అవుట్‌ డోర్‌ దృశ్యాలను నైనిటాల్‌లో చిత్రీకరరించారు. ఒక రకంగా చెప్పాలంటే పాత-కొత్తల మేలు కలయికతో ‘తేనెమనసులు’ సినిమాను మరపిస్తూ సంజీవి ఈ సినిమాను మలచారని చెప్పవచ్చు. ‘ఇల్లాలు’ సినిమాను సమాంతరంగా తమిళంలో నిర్మించిన ‘ఇధయ కమలం’ సినిమాకు శ్రీకాంత్‌ దర్శకుడు కాగా సంగీత దర్శకత్వం రెండు వెర్షన్లలో కె.వి.మహదేవన్‌ నిర్వహించారు. ‘కాదలిక్క నేరమిల్లై’లో శ్రీధర్‌ హీరోగా పరిచయం చేసిన రవిచంద్రన్‌, ‘కర్పగం’లో కె.యస్‌.గోపాలకృష్ణన్‌ పరిచయం చేసిన కె.ఆర్‌.విజయ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇదే చిత్ర కథను హిందీ చిత్ర నిర్మాత ప్రేమ్‌ జీ, రాజఖోస్లా దర్శకత్వంలో ‘మేరాసాయా’ (1966) పేరుతో సినిమాగా నిర్మించారు. సునీల్‌దత్‌, సాధన నటించిన ఈ సినిమా సిల్వర్‌ జూబిలీ జరుపుకోవడమే కాకుండా, 1966 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. సహాయక పాత్రల్లో కె.యన్‌.సింగ్‌, అన్వర్‌హుస్సేన్‌, ప్రేమ్‌ చోప్రా నటించారు. తమిళ, హిందీ భాషల్లో రికార్డులు సృష్టించిన ‘ఇల్లాలు’ సినిమా తెలుగులో డెభ్బై రోజులకు పైగానే ఆడింది. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే రవిచంద్రన్‌ ఇందులో నటించిన షీలాను పెళ్లి చేసుకున్నాడు. సంజీవి తదనంతరం కాలంలో మంచి దర్శకుడుగా ‘అత్తగారు- కొత్త కోడలు’, ‘నాటకాల రాయుడు’, ‘అక్కా- చెల్లెలు’, ‘ధర్మదాత’, ‘సిసింద్రీ చిట్టి బాబు’ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు.


తకతక తాళం తట్టిన పాటలు..


‘ఇల్లాలు’, సినిమాకు శ్రీశ్రీ, ఆత్రేయ, కొసరాజు పాటలు రాయగా, ‘ఇధయ కమలం’కు కణ్ణదాసన్‌ రాశారు. రెంటికీ సంగీత దర్శకుడు మహదేవన్‌. హిందీ సినిమా ‘మేరా సాయా’కు రాజా మెహదీ ఆలీఖాన్‌ పాటలు రాయగా మదన్‌ మోహన్‌ సంగీతం సమకూర్చారు. శ్రీశ్రీ రాయగా సుశీల ఆలపించిన ‘‘నీవు నా ఊహలందే నిలిచావు నేను నీ కళ్లలోనే వెలిశాను... వేయిజన్మాలకైనా విడలేనూ... నీ ఇల్లాలుగా నేనుంటాను’’ అనే టైటిల్‌ గీతాన్ని మహదేవన్‌ పహాడ్‌ రాగంలో స్వరపరచారు. సినిమా కథనంతా పాటలోనే అల్లడం శ్రీశ్రీ గొప్పతనం. జానకి పాడిన జనరంజమైన కొసరాజు హుషారు పాట ‘‘తకతకతక తాళం దట్టు మామా నీ దరువులు కలపవయా’’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆత్రేయ కలం విదిలించిన ‘‘నువుపోయిన చోటే నేనూ వున్నా పోపోపో’’ పాటను పి.బి. శ్రీనివాస్‌, సుశీల పాడారు. మరో ఆత్రేయ పాట ‘‘మల్లెపూవులు విరిసెరా మంచు తెరలు కరిగెరా... నల్లనయ్యా మేలుకో చల్లనయ్యా మేలుకో’’ని సుశీల ఆలపించారు. మరో అద్భుత యుగళగీతం ఫక్తు ఆత్రేయ మార్కు పాట ‘‘అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే... నువ్వంటే నువ్వే నీవంటిది నువ్వే నువ్వే’’ పి.బి. శ్రీనివాస్‌, సుశీల గళంలో అద్భుతంగా అమరింది. ‘‘మనసునేదో కవ్విస్తూంది తలచుకుంటే నవ్వొస్తూంది’’ కూడా మంచి పాటే. చివరి మాట... హిందీలో రజతోత్సవాన్ని, తమిళంలో శతదినోత్సవాన్ని జరుపుకొని మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ఇల్లాలు’ సినిమా బహుశా కొత్త నటులు కావడంతో తెలుగులో డెభ్బై రోజులకు మించి ఆడలేకపోయిందనుకోవాలి.


- ఆచారం షణ్ముఖాచారి

No comments:

Post a Comment