ఆకాశం నీ హద్దు రా(2020)

Soorarai Potru- ఆకాశం నీ హద్దు రా

మానవ చరిత్రనంతటిని పరికించి చూస్తే కొన్ని విజయాల వెనుక అసమాన్యంగా కనిపించేది వారి 'సంకల్పం' మాత్రమే. ఆ సంకల్పమే వారిని అన్ని ప్రతికూలతల నుండి మునుముందుకు నడిపిస్తుంది.కొన్నిసార్లు ఆ సంకల్పం మన చుట్టూ ఉన్నవారికి హేళనగాను, ఉదాసీనంగాను కూడా ఉండొచ్చు. ప్రతి ప్రతికూలత, సమస్య మనిషికి 3 విషయాలు నేర్పుతుంది. ఒకటి ఎదురెళ్లడం, రెండు సర్దుకుపోవడం,మూడు వెనుతిరగడం. అయినా ప్రతికూలతలు అనేవి పోరాడే వారికే వస్తాయి తప్ప,తీరం అంచున నుంచొని చోద్యం చూస్తూ, నది లోతుల గురించి తాత్వికతలు బోధించేవారికి కాదు. ఎదురెళ్లడం ఎప్పుడు రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే కనుక చాలా మంది ఆ చివరి రెండు విషయాలు దగ్గరే ఆగిపోతారు.దాన్ని అధిగమించినవాడే విజేత, కానీ దాని వెనుక ఎన్నో అవహేళలు, ఉదాసీనతలు, sacrifice పర్వాలను అధిగమించేందుకు సన్నద్ధం కావాలి.

ఉన్నవాళ్ళ దగ్గర comfort, లేనివాళ్ళ మధ్య లోలోపల ఓ అగ్ని నిత్యం రగులుతోంది. ఆ అగ్నితో రగిలేవాళ్ల మధ్య పోరాడే లక్షణంతో పాటు ఓ తీవ్రమైన కాంక్ష, సంకల్పం ఉంటుంది అని ఓ గౌరవించే వ్యక్తి మాటల్లో ఓ సారి విన్నాను. 

మధ్యతరగతి జీవితాల్లో కలలకు ప్రతిబంధకాలు అంటే అవి బాధ్యతలే. జీవితం ఎప్పుడు మన ఎదుట రెండు విషయాలు ముందుంచుతుంది. అందులో ఒకదానిని త్యాగం చేసుకునే వెసులుబాటు కూడా అదే కల్పిస్తుంది. సమస్యల్లా వదలుకోవాల్సింది కలనా, బాధ్యతలనా అనే. ఇక్కడ సర్దుకుపోవలసింది కలలతోనా, బాధ్యతలతోనా అనే ఛాయిస్ మన పరిధిలోనిదే. జీవితం ప్రాక్టికలిటీ పరిధులను దాటి కొన్నిసార్లు ముందుకు వెళుతుంది. Expected విషయాలు, మనుష్యుల కి ఆవల Unexpected వ్యక్తుల, విషయాల వలననే చాలా సార్లు ముందుకు సాగుతుంది జీవితం.

వీటన్నిటిని మీరి కొంతమంది అసుర సంకల్పంతో ముందుకు వెళతారు. అటువంటి ఓ వ్యక్తి కథనే ఇది.తన పరిధిని దాటి గ్రద్దలా ఎదిగిన ఓ మధ్యతరగతి ఊర పిచ్చుక కథ. ఈ సినిమా కథ గురించి నేను ఇక్కడ రాయడం లేదు. సినిమా చూసి దానిని  ఆస్వాదించండి. 

అమెజాన్ ప్రైమ్ లో లభ్యం.

No comments:

Post a Comment