ఎన్టీఆర్ ప్రయోగం...‘పిచ్చి పుల్లయ్య’
చదువు, సంపద, సంఘ గౌరవంలాంటివి మాత్రమే జీవితానికి ముఖ్యం కావు. సహృదయంతో సాటివారికి సాయపడడం మానవునికి ఉండాల్సి ఉత్తమ గుణం అనే అభ్యుదయ సూక్తి నేపథ్యంగా తీసుకొని ఎన్.టి.రామారావు నటించిన చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’. తన సొంత సంస్థ ‘ఎన్.ఎ.టి’ ద్వారా సమర్పించిన తొలి చిత్రమిదే. ఈ సూక్తిని పాటించేవాళ్లు మనలో ఎందరో ఉన్నారు. వారు ఎవరికైనా కష్టం వస్తే, తమ ప్రాణం ధారపోసైనా ఆపదలో వున్న వారిని ఆదుకుంటారు. కొంతమంది వీరిని అజ్ఞానులుగా వర్గీకరించి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ హేళన చేయడం కద్దు. ఎన్.ఎ.టి. చిత్ర నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ చిత్రం 17−07−1953న విడుదలై నేటికీ 67 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఎన్.టి.ఆర్ విద్యార్థి దశలోనే
ఎన్.ఎ.టి సంస్థకి శ్రీకారం చుట్టారు. ఎన్నో నాటకాలు ఆ సంస్థ ద్వారా ప్రదర్శించారు. 1951లో ఎన్.టి.ఆర్ చిత్రసీమ ప్రవేశం జరిగింది. తన బంధువు, బాల్య స్నేహితుడైన పుండరీకాక్షయ్య సహకారంతో 1952లో ఎన్.టి.ఆర్ ఆంధ్రప్రాంతమంతా పర్యటించి ‘బుచ్చిబాబు’, ‘ఆత్మవంచన’, ‘కరువు రోజులు’ నాటకాలను ఎన్.ఎ.టి పతాకంపై ప్రదర్శించి దాదాపు లక్షన్నర రూపాయలు రాయలసీమ కరువు నివారణ కోసం ముఖ్యమంత్రి నిధికి విరాళమిచ్చారు. ఎన్.ఎ.టి. నాటక సంస్థ పేరిట సినిమా నిర్మాణం చేద్దామని, ఆ చిత్ర నిర్మాణ ప్రొడక్షన్ బాధ్యత పుండరీకాక్షయ్యను స్వీకరించవలసిందిగా ఎన్.టి.ఆర్ ప్రతిపాదించడంతో చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్ సొదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా మొదటి ప్రయత్నంగా ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రం నిర్మితమైంది. పుండరీకాక్షయ్యకు నటన మీద ఆసక్తి ఉండడం చేత ఈ చిత్రంలో ఆయన ఎన్.టి.ఆర్ స్నేహితునిగా నటించడమే కాకుండా ‘బస్తీకి పోయేటి ఓ పల్లెటూరి వాడా’ అనే నేపథ్య గీతాన్ని కూడా పాడారు. ఈ చిత్రానికి తాతినేని ప్రకాశరావు కథ, స్క్రీప్లే సమకూర్చి దర్శకత్వం వహించారు. ఎం.ఎ.రెహమాన్ ఛాయాగ్రహణం నిర్వహించారు. ఈ చిత్రంలో పది పాటలున్నాయి. అన్ని పాటల్నీ, మాటల్ని అనిశెట్టి సుబ్బారావు సమకూర్చారు. తొలిరోజుల్లో ఎన్.టి.ఆర్ రూమ్మేట్గా, ప్రాణ స్నేహితునిగా మెలగిన టి.వి.రాజు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
కథేంటి?
కథగా కొత్తదేం కాదు. పుల్లయ్య (ఎన్.టి.ఆర్) పల్లెటూరి యువకుడు. బస్తీలో జమిందారిణి మనోరమాదేవి (ఛాయాదేవి) ఇంట్లో పనికి కుదురుతాడు. జమిందారిణి సవతి కొడుకు చినబాబు (అమరనాథ్), భార్య వసంత (జానకి), ఇంటి దాసి కాంతం (కృష్ణకుమారి) ఆ బంగళాలో ఉంటారు. ఎస్టేట్ వ్యవహారాలు నిర్వహించే భూపాలరావు (గుమ్మడి) జమిందారిణితో అక్రమ సంబంధం సాగిస్తూ అకృత్యాలకు అలవాటుపడి ఉంటాడు. ఆ ఇంట్లో పుల్లయ్యని అందరూ అభిమానిస్తూ ఉంటారు.. ఒక్క భూపాలరావు తప్ప. వసంత అంటే గిట్టని భూపాలరావు పుల్లయ్యకు, వసంతకు అక్రమ సంబంధం అంటగట్టి సవతి తల్లి ప్రోద్భలంతో చినబాబు చేతుల మీదుగా ఇంట్లోంచి వెళ్లగొట్టిస్తాడు. గర్భిణిగా ఉన్న వసంతను పుల్లయ్య తన ఊరు తీసుకెళ్లి ఆశ్రయమిస్తాడు. వసంత అక్కడే పురుడు పోసుకుంటుంది. భూపాలరావు అకృత్యాలు తెలుసుకొని అతనికి ఎదురుతిరుగుతుంది జమిందారిణి. అది సహించలేని భూపాలరావు ఆమెపై విషప్రయోగం చేస్తాడు. పని మనిషి కాంతం ఉపాయంతో జమిందారిణిని అపాయం నుంచి బయటపడుతుంది. తను చేసిన నేరాలన్నీ పుల్లయ్య మీదికి నెట్టాలని చూస్తాడు భూపాలరావు. అప్పటికి చినబాబుకి నిజాలన్నీ తెలుస్తాయి. భూపాలరావు నేరాలు రుజువై శిక్ష ఖరారవుతుంది. చినబాబు, వసంతలు తిరిగి కలుసుకుంటారు. పుల్లయ్యకి కాంతంతో పెళ్లవుతుంది. స్థూలంగా ఇదీ కథ.
అమాయకంగా ఎన్టీఆర్..
సాధారణంగా హుందాగా ఉండే పాత్రలు ధరించే ఎన్.టి.ఆర్ అమాయకపు పాత్ర వైపు మొగ్గు చూపడంతో ఈ చిత్రానికి కొత్తదనం వచ్చింది. ‘ఆలపించినా అనురాగముతో’ (ఘంటసాల), ‘ఎల్లవేళలందు నీ చక్కని చిరనవ్వులకై’ (ఘంటసాల, బాలసరస్వతి) పాటలు రేడియోలో ప్రసారమైనట్టు చిత్రీకరించారు. ‘అవమానాలకు బలియౌతున్నా’, ‘శోకపు తుపాను చెలరేగిందా’ (ఎం.ఎస్.రామారావు) పాటలు నేపథ్యంలో వస్తాయి. అవి హృదయాన్ని హత్తుకొంటాయి. మాధవపెద్ది చేత రెండు తత్వాలు (‘శాంతిని గనుమన్నా’ ఏలానోయీ ఈ విషాదమూ’) పాడించారు టి.వి.రాజు. పాటలన్నీ మధుర దరహాస చంద్రికల్లా సున్నితంగా, శ్రావ్యంగా ఉంటాయి. ఎన్.టి.ఆర్ వెంట ఒక పొట్టేలు (గొర్రెపోతు) ఉంటుంది. దాన్ని ఎంతో అభిమానించే పుల్లయ్యపై కసితో భూపాలరావు ఆ జీవాన్ని విందు పేరిట నరికిస్తాడు. అప్పుడు ఎన్.టి.ఆర్ ఆవేదన చెందే దృశ్యం చాలా హృద్యంగమంగా ఉంటుంది. నోరులేని అమాయక జీవిని చంపడం పాపమని ఈ చిత్రంలో చాటే ప్రయత్నం చేశారు ఎన్.టి.ఆర్. ఆ పొట్టేలు (గొర్రెపోతు), పుల్లయ్య ఇద్దరూ అమాయకత్వానికి, పదిమందికి సాయపడే గుణానికి ప్రతీకలుగా చిత్రంలో చూపారు. ఎవరైనా, అమాయకులు కనిపిస్తే ‘వీడు పిచ్చి పుల్లయ్యలా అమాయకుడురా’ అని చెప్పుకోవడం ఈ సినిమా ద్వారానే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఎన్.టి.ఆర్ ఆ తర్వాతి కాలంలో చేసిన ‘తోడుదొంగలు’ (1954), ‘జయసింహ’ (1955), ‘పాండురంగ మహాత్మ్యం’ (1957), ‘సీతారామకల్యాణం’ (1961), ‘గులేబకావళి కథ’ (1962) చిత్రాలన్నీ ఎన్.ఎ.టి. సంస్థ నిర్మించినవే.
− ఆచారం షణ్ముఖాచారి

No comments:
Post a Comment