చిట్టి చెల్లెలు (29-07-1970)
1970 సంవత్సరంలో 49 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. సగటున వారానికి ఒక సినిమా చొప్పున. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కాంతారావు, హరనాధ్, కృష్ణం రాజు, చంద్రమోహన్ హీరోలుగా వాణిశ్రీ, రాజశ్రీ, విజయ నిర్మల మొదలైన వారు హీరోయిన్లగా నటించారు. అక్కినేని 5 చిత్రాలలో, ఎన్ టి ఆర్ 10 చిత్రాలలో నటించారు. అక్కా చెల్లెలు , ధర్మదాత , ఇద్దరు అమ్మాయిలు , తల్లా పెళ్ళామా , పెత్తందార్లు , చిట్టి చెల్లెలు, కోడలు దిద్దిన కాపురం , ఒకే కుటుంబం శత దినోత్సవాలు జరుపుకున్నాయి. కోడలు దిద్దిన కాపురం రజతోత్సవం కూడా జరుపుకుంది. లక్ష్మీ కటాక్షం, ఆలీబాబా 40 దొంగలు, విజయం మనదే, మాయని మమత, మారిన మనిషి, జై జవాన్, మరో ప్రపంచం యావరేజ్ గా నడిచాయి.
29-07-1970 న విడుదలైన చిట్టి చెల్లెలు సినిమా విశేషాలు:-
అప్పట్లో (1970) ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ. తల్లీ కొడుకు, అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఈ మూడు సెంటిమెంట్లతో రూపు దిద్దుకున్న చిత్రాలు ఘన విజయం సాధించేవి. "రక్త సంబంధం" (1962) , ఆడ పడుచు (1967) చిత్రాల తర్వాత అన్నా చెల్లెళ్ళ మధ్య సెంటిమెంటు అపురూపమైనదిగా భావించారు. మళ్ళీ అటువంటి చిత్రం తీయాలన్న ఆరాటం మురుగన్ సోదరులది. ఇది కార్య రూపం దాల్చేందుకు వి సి గుహనాధన్ ను పిలిపించారు. ఆ రోజుల్లో తమిళనాట ఏ నోట విన్నా గుహనాధన్ పేరు వినిపించేది. ప్రముఖ సంస్థలన్నిటికీ గుహనాధన్ త్వరితగతిన కధలు తయారు చేసేవారు. చిట్టి చెల్లెలు కధ రాయడం పూర్తి చేశాక స్క్రిప్ట్ డైరెక్టర్ ఎం కృష్ణన్ చేతిలో కధను పెట్టారు. కృష్ణన్ కు ధైర్యం చాల లేదు. కధ బలంగా లేదు. అప్పటికే పేరున్న ఎన్ టి ఆర్ తో పాటు రైజింగ్ స్టార్ లా దూసుకు వస్తున్న వాణిశ్రీ, రాజశ్రీ, హరనాధ్ లతో పాటు గుమ్మడి ఇటువంటివారు తారాగణంగా ఫిక్స్ అయ్యారు. ఎలా ఈ కధను మెరుగుపరచడం? అందుకోసం ఎవరి చేతుల్లో పెట్టాలి? అనే మీమాస లో ఉండగా ప్రొడక్షన్ మేనేజర్ కాకినాడ రామారావు డి వి నరసరాజుగారి పేరు సూచించారు. కాకినాడ రామారావు హీరో కావాలని వచ్చి ప్రొడక్షన్ విభాగంలో ఫిక్స్ అయ్యారు. పట్టిన పట్టు విడువరు. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన వ్యక్తి రామారావు. నరసరాజు గారు అంతకుముందు భక్త ప్రహ్లాద, రాము చిత్రాలకు ఏ వి ఎం కి పని చేశారు కూడా.
అన్నా చెల్లెళ్ళ పై కధను పండించటమంటే కత్తిమీద సాము చేయడం వంటిది. ఏమాత్రం డోసు ఎక్కువైనా అభాసుపాలవుతుంది. గతంలో ఎన్ టి ఆర్ "రక్త సంబంధం", "ఆడపడుచు" చిత్రాలలో అద్భుతం గా నటించి మెప్పించారు. ప్రేక్షకులు అన్నను ఆ సినిమాల పాత్రతో పోల్చుకుంటారు. పైగా అప్పటికే ఎన్ టి ఆర్ ఆంధ్రుల అన్నగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఇమేజ్ ఏమాత్రం తగ్గకూడదు. సాధారణంగా నటులు తమకు ఎంతోగొప్ప పేరు తెచ్చిన పాత్రను మళ్ళీ వేయరు. వారి జీవితకాలం ఆ పాత్రకోసం తామెంత కష్టపడినదీ, ఎలా పరకాయ ప్రవేశం చేసారో, ఆ పాత్ర నుండి బయటకు రాలేకపోయామనీ, ఇంకా ఆ పాత్ర అంత రక్తి కట్టడానికి దర్శకుడు, సంగీతం, సహ నటీ నటుల సహకారాలు కారణాలనీ, మళ్ళీ అటువంటి పాత్ర తాము కాని, ఇతరులు కానీ వేసి మెప్పించలేమని చెబుతూంటారు. ఎన్ టి ఆర్ ఇందుకు భిన్నం. అసలైన కళాకారుడిగా , తాను జీవించిన పాత్రలలో మరింత మెరుగులు దిద్దడానికి (ఉదాహరణ - రావణ బ్రహ్మ, సుయోధనుడు, కృష్ణుడు, అన్నగా, విప్లవ నాయకుడిగా) తహ తహలాడేవారు.
నరసరాజుగారు పర్ఫెక్షనిస్ట్. తను ఏ పని తలపెట్టినా దానికి సంపూర్ణ న్యాయం చేస్తారు. శక్తివంచనలేకుండా కష్ట పడతారు. చిట్టి చెల్లెలు విషయంలో అదే చేశారు. ప్రతి పాత్రా పండించారు. సినిమాను మనకు తెలిసిన నిండైన జీవితంలా తీర్చి దిద్దారు. కధను తెలివిగా చిన్న పిల్లల దగ్గరనుంచే ప్రారంభించారు. తండ్రి దూరమై, తల్లి మరణించిన తర్వాత అన్నీ తానై పెంచిన అన్నను ఎస్టాబిల్ష్ చేయాలంటే ఒక పాట కావాలి. దాశరది రాసిన సెంటిమెంట్ సాంగ్ తో సినిమా ప్రారంభమవుతుంది. అందాల పసి పాప, అన్నయ్యకు కను పాప, బజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీకొరకే, నీకన్నా వేరెవరే, కధలో ప్రాణ ధాతువులాంటి మాటలన్నీ పాట పల్లవిలోనే వచ్చేసాయి. ఈ పాట తర్వాత మనం ఇప్పుడు చెప్పుకునే ఇంటర్వల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఫిక్స్ అయ్యింది. తెలుగు వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుందనే భరోసా కలిగింది. నరస రాజుగారిలో ఉన్న సుగుణం స్క్రిప్ట్ పూర్తి అయ్యాకా దర్శక నిర్మాతలను కూచోబెట్టి చదివి వినిపిస్తారు. ఎవరికి ఏ సందేహం కలిగినా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అందరికీ తృప్తికరంగా అనిపించిన తర్వాతే సినిమా సెల్యులాయిడ్ మీదకు వెడుతుంది. నరసరాజుగారు అంత పర్ఫెక్షనిస్ట్ కనుకనే అన్ని విజయవంతమైన సినిమాలు చేయగలిగారు.
డి వి నరసరాజుగారు కధకు ఎంత గొప్ప ట్రీట్మెంటు ఇచ్చారంటే ప్రతి సన్నివేశం మనసును పట్టుకుంటుంది. గుండె బరువెక్కుతుంది. తియ్యని బాధ, తీరని బాధలా దృశ్యాలు మారుతుంటాయి.
తెలుగు చిత్ర పరిశ్రమను ఉన్నత స్థానం లో నిలబెట్టిన నిర్మాణ సంస్థల్లో ఏ వి ఎం సంస్థ ముందు వరుసల్లో ఉంటుంది. సినిమా మేకింగ్ పై వ్యామోహం పెంచుకున్న వ్యక్తి ఏ వి మెయ్యప్పన్ గారు. వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం వ్యవస్థగా ఎదిగి భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్థానంలో నిలిచింది. ఆయన సంతానం మురుగన్, శరవణన్ , కుమారన్ మెయ్యప్పన్. ఆయన వ్యాపార సూత్రం ఒకటే. వ్యాపారం ఏదైనా లాభం ఎంతో కొంత ఉండాలి. నిర్మాణ వ్యవహారాల్లో లాభం కలగాలంటే ఆచి తూచి అడుగేయాలి. ఒకవేళ నష్ట పోయినా అది సులువుగా భరించే విధంగా వుండాలి. ఉత్తరోత్తరా సినిమాల నిర్మాణానికి అంతరాయం కల్గించేలా ఉండకూడదు. అదే ప్రాధమిక అంశాన్ని అనుసరించిన ఆయన కుమారులు మురుగన్, శరవణన్, కుమరణ్ ల ద్వారా రూపు దిద్దుకున్న చిత్రమే "చిట్టి చెల్లెలు".
మాతృ ప్రేమను మించినది లోకంలో లేదని పెద్దలంటారు. కాని చెల్లెలిపట్ల అన్న ప్రేమానురాగాలు అంతకంటే తక్కువేమీ కాదని ఏ వి ఎం ప్రొడక్షన్స్ సమర్పించిన మురుగన్ బ్రదర్స్ వారి "చిట్టి చెల్లెలు" నిరూపించింది.
శాంత (వాణిశ్రీ) పుట్టగానే తల్లి మంచం ఎక్కి మరణించింది. అందుకే ఆ పసి పాప మీద తండ్రికి (గుమ్మడి) ఆగ్రహం, నిరాదరణ. కానీ కొడుకు రాజా (ఎన్ టి ఆర్) తన చెల్లెలిని కను రెప్పలా కాపాడుతుంటాడు. తండ్రి త్రాగుబోతు, జూదరి అయ్యాడు. అతను జైలుకు వెళ్ళినప్పుడు రాజా, శాంత లకు ఒక ధనవంతుల ఇంట ఆశ్రయం లభించింది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజా వ్యవసాయం పనులు చూస్తున్నాడు. ఆ ఇంటి యజమాని, యువకుడు అయిన రఘు (హరనాధ్) మద్రాసులో చదువు ముగించుకు వచ్చాడు. రఘుకు బ్యాంకులో ఉద్యోగం వస్తుంది. శాంతకు, రఘుకు రాజా వివాహం జరిపిస్తాడు. వారి అన్యొన్య దాంపత్యాన్ని చూసి మురిసిపోతాడు. రఘుకు ప్రమోషన్ మీద మద్రాసు వెళ్ళవలసి వస్తుంది.
రాజాను టీచరమ్మ జానకి (రాజశ్రీ) ప్రేమిస్తుంది. దొంగ నోట్లను ముద్రించే ముఠా నాయకుడు రఘు ని తమ అధీనంలో ఉంచుకునే ప్రయత్నంలో విఫలుడై అతని పై కత్తి విసరగా మరణావస్థలో రఘు ఆసుపత్రి చేరతాడు. దుండగుని ముఖం పోలీసుల ఫొటోల జాబితాలో గుర్తు పట్టి రఘు చనిపోతాడు. బ్యాంకు ఏజంటు రాజాను మద్రాసు రప్పించి రఘు శవాన్ని చూపిస్తాడు. రాజా మనసు వికలమైపోతుంది. గర్భవతిగా ఉన్న తన చెల్లెలు శాంత గతి ఏమి కావలి?
ఇంటికి వచ్చిన రాజా , చెల్లెలు శాంత తన పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని వ్రతం చేసుకోవడం చూస్తాడు. స్త్రీలు కొలిచే ఇలవేలుపు నీవు, కలగన్న ఆశా నెరవేర్చగలవు, మా జంటయే ఒక నూరేళ్ళ పంట, కలలో ఇలలో విడదీయకమ్మా అంటూ కోరుకుంటూ ఉంటుంది. ఆ దృశ్యం చూచి కుమిలిపోతాడు. శాంతకు తాత్కాలిక ఉపశమనంకోసం మద్రాసునుంచి రఘు వ్రాసినట్లుగా , రాజా ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాడు. అవి జానకి చదివి వినిపిస్తుంది. ఒకసారి సంతకం రఘు బదులు రాజా అని ఉండడం తో జానకి రాజాను నిలదీసి విషయం తెలుసుకుని నిర్ఘాంతపోతుంది.
ఒకరోజు జైలునుండి పారిపోయి వచ్చిన దొంగ నోట్ల ముఠా నాయకుడు శాంత ఇంటికి వస్తాడు. అక్కడ రఘు ఫొటోను చూసి నిజం తెలుసుకుంటాడు, చేజేతులా తానే తన కూతురి పసుపు కుంకుమలు చెరిపేసేనని.
శాంత బిడ్డని ప్రసవించి చనిపోతుంది. ఆమెని ముత్తైదువుగా సాగనంపుతారు, అదే ఆమె కోరిక అని రాజా చెప్పడంతో. శాంత బిడ్డను రాజా, జానకిలు పెంచుతారు. ఇదీ కధ. మధ్యలో రేలంగి, పద్మనాభం, గీతాంజలి తొలకరి చినుకుల్లా హాస్యాన్ని కురిపిస్తూ సినిమాకు నిండుదనం కలిగించడం విశేషం. సినిమా ప్రారంభము నుండీ చివరవరకూ ప్రేక్షకులు కధలో లీనమైపోతారు.
రాజాగా ఎన్ టి ఆర్ సోదరిపట్ల వాత్సల్యాన్ని అత్యంత సహజం గా కదలించేలా ప్రదర్శించారు.
శాంతిగా వాణిశ్రీ పల్లెటూరి అమాయకత్వం, ప్రశంశించదగ్గ నటనను ప్రదర్శించారు. అన్నపట్ల అనురాగం, పెళ్ళి కాని పిల్ల గా ఒలకబోసిన సిగ్గు, వయ్యారం ఆమె నటనలో అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి.
రఘు ఊరినుండి వచ్చినప్పుడు శాంత కాళ్ళు కడుగుకోవడానికి నీళ్ళు తెచ్చి, అతనికి ఇచ్చి సిగ్గుతో వెనక్కి పరుగున వస్తుంది. అక్కడ ఎన్ టి ఆర్ వేగంగా తప్పుకుంటాడు. ఆ సీను, ఆ తరవాతి సన్నివేశాలలో ఎన్ టి ఆర్, హరనాధ్, వాణిశ్రీల నటన ఎంతో సహజంగా ఉంటుంది.
రాజా తండ్రిగా, దొంగ నోట్ల ముఠా నాయకుడిగా గుమ్మడి నటన మెప్పించింది. రఘుగా హరనాధ్ , జానకిగా రాజశ్రీ, జానకి తండ్రిగా రేలంగి, బ్యాంకు ఏజంటుగా డాక్టర్ రమేష్, బాల నటులుగా మాస్టర్ ఆదినారాయణ, బేబీ వెంకటేశ్వరి నటించారు.
పద్మనాభం, గీతాంజలి, బాల కృష్ణ, బాల సరస్వతి జంటల హాస్యం నవ్విస్తుంది. శ్రీ రామ వనవాసం నాటకం ఒక ఆకర్షణ.
చిట్టి చెల్లెలు సినిమాలో అన్ని పాటలూ ఆణి ముత్యాలే. ఎస్ రాజేశ్వర రావు ప్రాణం పోశారు.
మొదటి పాట "అందాలా పసి పాప" , దాశరధి రచన, చిన్నప్పటి రాజా, శాంతలపై చిత్రీకరణ, పి సుశీల గానం.
శాంత (వాణిశ్రీ), రఘు (హరనాధ్) ల పై తొలి రాత్రి సందర్భంగా చిత్రీకరించిన గీతం "ఈ రేయి తీయనిది. ఈ చిరు గాలి మనసైనది. ఈ హాయి తీరనిది. ఇంతకు మించి ఏమున్నది", సి నారాయణ రెడ్డి రచన. బాలు, సుశీల పాడిన యుగళ గీతమిది. తొలి రోజుల్లో తనకు గొప్ప పేరు తెచ్చిన పాట ఇది అని బాల సుబ్రమణ్యం గారు ఇప్పటికీ చెబుతుంటారు.
ఈ రేయి తీయనిది ఈ చిరు గాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఏవెవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ల కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ
చెలి కౌగిట జిలిబిలి నగవుల -ఈ రేయి తీయనిది
ఏవెవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
పరువాలు పల్లవి పాడగా , నయనాలు సయ్యట లాడగా
నిను చేరుకోగా నును మేను తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల - ఈ రేయి తీయనిది
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పున్యమో
నిన్ను నన్ను కలిపే నీ నీడ నిలిపే
అనురాగ సీమల అంచులు దొరికే - ఈ రేయి తీయనిది
మరో పాట రాజా (ఎన్ టి ఆర్), జానకి (రాజశ్రీ) ల పై చిత్రీకరించిన "ఝుం ఝుం ఝుం తుమ్మెద పాడింది. గులాబి ఘుం ఘుం ఘుమ ఘుమలాడింది", ఘంటసాల, సుశీలా పాడేరు. దాశరధి రచన.
హృదయానికి హత్తుకునే పాట "మంగళ గౌరీ, మము కన్న తల్లీ" . తన భర్త చనిపోయినట్లు శాంత (వాణిశ్రీ) కు తెలియదు. అమాయకంగా తన పసుపు కుంకుమలు పది కాలాలు ఉండాలని, కలలో కూడా విడదీయవద్దని కోరుకుంటూ పాడిన పాట. ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తుంది. ఆరుద్ర రచన. సుశీల గానం.
అందాలా పసి పాపా, వాణిశ్రీ పై చిత్రీకరణ, దాశరధి రచన, సుశీల గానం.
అందాల పసిపాప అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కధలెన్నో చెపుతాలే కలలన్ని నీవేలే...
మీ నాన్న వస్తున్నారు యేమేమో తెస్తున్నారు
వంశం నిలిపే తొలి కానుపు వని -2
గారాబాలే కురిపించేరు
మా ఇద్దరి ముద్దుల రాజా నా మదిలొ పూసిన రోజా
ఇంతై అంతై ఎంతో చదివి -2
నీ వన్నిట నాన్నను మించాలి
అల్లుడవని మీ మామయ్య పిల్లను కని నీకిస్తాడు
రవ్వలవంటి నీ పిల్లలను -2
అమ్మను నేనై ఆడిస్తాను
పట్టాలి అరక, ఎన్ టి ఆర్ పై చిత్రీకరణ, బాలు గానం, కొసరాజు రచన
ఆహాహ ఈ వనము చూడ చూడ మనోహరము ( శ్రీరామ వనవాసము ), ఘంటసాల, పిఠాపురం, తిలకం, మాధురి
ఒన్ టూ త్రీ ఇటు రావయ్యా అయ్యయ్య ఏమయ్యా, ఎల్ ఆర్ ఈశ్వరి
ఈ చిత్రం సినిమాలా అనిపించదు. నిండు జీవితంలా అనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మ రధం పట్టారు. రక్త సంబంధం చిత్రంలో ఎన్ టి ఆర్ సావిత్రిలను ఎంత ఆదరించారో, ఎన్ టి ఆర్ వాణిశ్రీలను చిట్టి చెల్లెలు చిత్రం లో అంతే ఆదరించారు. ఎన్ టి ఆర్ అన్నగా మరోసారి తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా ముద్ర వేసుకున్నారు.
1970 సంవత్సరంలో విడుదలైన ఎన్ టి ఆర్ చిత్రాలు తల్లా పెళ్ళామా (08-01-1970) , పెత్తందార్లు (30-04-1970), చిట్టి చెల్లెలు (29-07-1970) , కోడలు దిద్దిన కాపురం (21-10-1970), ఒకే కుటుంబం (25-12-1970) శత దినోత్సవాలు జరుపుకుని విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఆ ఏటి సూపర్ హిట్ సినిమా ఎన్ టి ఆర్ నటించిన 200 వ చిత్రం కోడలు దిద్దిన కాపురం 13 కేంద్రాలలో శత దినోత్సవాలు, రజతోత్సవం జరుపుకున్న చిత్రం.

No comments:
Post a Comment