Showing posts with label ఆడపడుచు. Show all posts
Showing posts with label ఆడపడుచు. Show all posts

ఆడపడుచు

 ఆడపడుచు







1967 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలలో సూపర్ హిట్ సినిమా ఎన్ ఏ టి వారి "ఉమ్మడి కుటుంబం". 15 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని రజతోత్సవం కూడా జరుపుకుంది. విజయవాడ దుర్గా కళా మందిరం లో ఏకం గా 197 రోజులు ప్రదర్శించబడింది.
జానపద చిత్రాలలో ఉత్కంఠను కలిగించే సస్పెన్స్ చిత్రంగా విడుదలైన కంచు కోట శతదినోత్సవాలు జరుపుకుని, రిపీట్ రన్ గా 1975 లో హైదరాబాద్ రెగ్యులర్ షోలతో 105 రోజులు ప్రదర్శించబడటం అప్పట్లో ఓ సంచలనం గా చెప్పుకున్నారు.
పౌరాణిక చిత్రం శ్రీ కృష్ణావతారం రజతోత్సవం జరుపుకుంది.
అలాగే నిండు మనసులు, భామా విజయం, ఆడపడుచు, భక్త ప్రహ్లాద, మరపురాని కధ చిత్రాలు కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.
అక్కినేని నటించిన ప్రాణ మిత్రులు, గృహలక్ష్మి, వసంతసేన, రహస్యం నిరాశ కలిగించగా ఆ సంవత్సరం చివర విడుదలైన అన్నపూర్ణా వారి పూల రంగడు శత దినోత్సవం జరుపుకుంది.
అన్నపూర్ణావారి పూలరంగడుకు పోటీగా సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ కె హేమాబరధరరావు దర్శకత్వంలోనిర్మించిన "ఆడపడుచు" సంచలన విజయం సాధించింది. చిత్రమయిన విశేషమేమిటంటే అన్నగా ఎన్ టి ఆర్ చేసిన చెల్లెలి సెంటిమెంట్ చిత్రాలన్నీ సూపర్ హిట్లే. ఈ ట్రాక్ రికార్డు మరే హీరోకు లేకపోవడం గమనించదగ్గ విషయం. అన్నా చెల్లెళ్ల అనుబంధంతో నిర్మించిన ఈ చిత్రం 5 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. ఆ చిత్ర విశేషాలు:-
ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది లేదంటారు. కానీ ఆ తల్లి ప్రేమకన్నా అన్న ప్రేమ ఏమీ తక్కువేమీ కాదని చాటి చెప్పిన చిత్రాలు రక్త సంబంధం (01-11-1962), ఆడ పడుచు (30-11-1967) , చిట్టి చెల్లెలు (29-07-1970). ఈ మూడు చిత్రాలలో నాయకుడు ఆంధ్రుల అందాల నటుడు ఎన్ టి ఆర్.
హీరో హీరోయిన్ల మధ్య ద్వంద్వార్ధాల పాటలు కాదు అసలు డ్యూయెట్లే లేవు. విచిత్రాలు లేవు అపహాస్యాలు లేవు. బాగా డబ్బున్న హీరో ప్లే బోయ్ లా ఎందరో అమ్మాయిల వెంటబడడం, తాగి తందనాలాడడం, బీదరికంలో ఉంటూ ఆత్మాభిమానం (?) మెండు గా ఉన్న అమ్మాయి ఆ హీరో దగ్గర పని చేయడం, తరవాత వారిద్దరి మధ్య "తనను తననుగా ప్రేమించే" ప్రేమ , ఆ పై అపార్ధాలు, హీరో మళ్ళీ తాగుడు, మూడు గంటలు మనల్ని హింస పెట్టి చివరకు శుభం కార్డ్ వేసే సినిమాలనుండి నిజమైన ఆటవిడుపు ఈ సినిమా.
ప్రఖ్యాత దర్శకుడు, నిర్మాత కొల్లి ప్రత్యగాత్మ సోదరులు కె.హేమాంబరధరరావు, దర్శకులు రజనీకాంత్, సముద్రాల రాఘవాచార్య వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసారు. మిత్రులతో కలిసి రఘురామా ఫిలిమ్స్ బ్యానర్పై ‘తండ్రులు-కొడుకులు’ నిర్మించారు. నటుడు పద్మనాభం నిర్మించిన దేవత, పొట్టి ప్లీడరు, శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రాలకు దర్శకత్వం వహించారు. సుభాషిణి ప్రివ్యూ థియేటర్ అధినేత కూడా అయిన హేమాంబరధరరావు, ఆ పేరుతో సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన చిత్రం ‘ఆడపడుచు’ 30-11-1967న విడుదలైంది.
1953లో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ‘నా చెల్లెలు’ చిత్రం రూపొందింది. అమర్నాథ్, శ్రీరంజని, రామశర్మ, జి.వరలక్ష్మి, చలం, సూర్యకళ నటించారు. ఈ చిత్రం ఆధారంగా దర్శక నిర్మాత ఎల్.వి ప్రసాద్ తమ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ‘చోటీ బెహెన్’గా హిందీలో నిర్మించారు. బలరాజ్ సహానీ, రహమాన్, నందా, ష్యామా, మహమూద్ నటించిన ఈ చిత్రానికి సంగీతం శంకర్ జైకిషన్, దర్శకత్వం-ఎల్.వి.ప్రసాద్.
ఈ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించిన చిత్రం ఆడపడుచు.
ఈ చిత్రానికి సంగీతం- టి.చలపతిరావు,
గీత రచన: దాశరధి, ఆరుద్ర, సి నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ, కొసరాజు
గాయనీ గాయకులు: ఘంటసాల, మాధవపెద్ది, టీ ఆర్ జయదేవ్, సుశీల, వసంత
స్టూడియో : ప్రసాద్,
డిస్ట్రిబ్యూషన్ : పూర్ణా పిక్చర్స్;
కొరియోగ్రఫీ : ఖ్ శ్ రెడ్డి
నృత్యం-కె.ఎస్.రెడ్డి,
కళ-బి.ఎన్.కృష్ణ,
సంభాషణలు-కె.ప్రత్యగాత్మ,
ఫొటోగ్రఫీ-ఎం.జి.సింగ్, ఎం.సి.శేఖర్,
కూర్పు-బి.గోపాలరావు,
స్క్రీన్ప్లే-ఎల్.వి.ప్రసాద్,
నిర్మాత-దర్శకుడు: కె.హేమాంబరధరరావు,
సహకార దర్శకుడు-పి.గోపాలకృష్ణ.
తారాగణం: ఎన్ టి ఆర్, శోభన్ బాబు, రేలంగి, హరనాధ్, పద్మనాభం, చదలవాడ, నాగభూషణం, వాణిశ్రీ, కృష్ణ కుమారి, గీతానజలి, రాధా కుమారి మున్నగు వారు.
సామాన్య కుటుంబీకులైన అన్నదమ్ములు సత్యం (ఎన్.టి.రామారావు), శేఖర్ (శోభన్బాబు), చెల్లెలు శారద (చంద్రకళ).
తల్లిదండ్రులను కోల్పోయిన తమ్ముడు శేఖర్ని పట్నంలో చదివిస్తుంటాడు సత్యం. చెల్లెలు శారదను అన్నదమ్ములు అమితంగా, ఆప్యాయతతో చూసుకుంటారు.
వారి బాబాయి ధర్మన్న (రేలంగి) పేరుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. వారి కుమారుడు సదానందం (పద్మనాభం).
శేఖర్ పట్నంలో ధనవంతుడు లక్ష్మీపతి (నాగభూషణం) కుమార్తె లలిత (వాణిశ్రీ)తో ప్రేమలో పడతాడు.
లక్ష్మీపతి- లలిత, శేఖర్ల పెళ్లి జరగడం కోసం, మంచివాడు బుద్ధిమంతుడైన డా. రమేష్ (హరనాథ్)తో శారద పెళ్లి కట్నం లేకుండా నిశ్చయిస్తాడు.
పెళ్లి కుదిరిన ఆనందంలో స్నేహితురాళ్లతో, తోటలో వూయల వూగుతున్న శారద ప్రమాదవశాత్తు చూపు పోగొట్టుకుంటుంది. దాంతో ఆమె వివాహం ఆగిపోతుంది. శారద కోరిక మేరకు లలిత, శేఖర్ల పెళ్లి జరుగుతుంది.
తొలుత శారదను ఆదరంగా చూసినా పనిమనిషి రంగమ్మ (రాధకుమారి) మాటలు విని ఆమెను ద్వేషించి బాధలు పెడుతుంది.
భర్తతోపాటు, పట్నానికి తండ్రి వద్దకు వెళుతుంది. చూపులేని శారద పనులు చూడడంలో, సత్యం ఉదోగ్యం పోగొట్టుకుంటాడు. పట్నం వెళ్లిన శేఖర్ మామగారి గుర్రం పందేలకు, ఆ తరువాత మామగారు మరణించాక మద్యానికి బానిసగా మారతాడు.
ఏ దారి లేక శారదతో పట్నం చేసిన సత్యం- సదానందం ఆశ్రయం పొందటం, సత్యానికి జ్వరంగా వుందని డాక్టరు కోసం వెళ్లిన శారద డా. రమేష్ను కలుసుకోవడం, అన్న కోసం, చెల్లెలి కోసం వేదనపడుతున్న శేఖర్- శారద కోసం బయలుదేరగా, అతని కోసం వస్తున్న శారద, అన్న కారు కిందే పడడం. అందరూ హాస్పిటల్లో కలుసుకోవడం, డా. రమేష్కు శారదకు వివాహం జరగడం తిరిగి శారదకు చూపు తెప్పించడానికి రమేష్, శారదలు విదేశీయానానికి బయలుదేరటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో పద్మనాభం (సదానందం) జంటగా గీతాంజలి (హేమ) సత్యం ప్రేమించిన యువతి సుశీల (కృష్ణకుమారి) ధర్మన్న నౌకరుగా సుభాలు (చదలవాడ), రమేష్ తండ్రిగా జూ. ఎ.వి.సుబ్బారావు నటించారు. కృష్ణకుమారి, నాగభూషణం, హరనాథ్లు గెస్ట్లుగా నటించారు.
ఆడపడుచు చిత్రానికి స్క్రీన్ప్లే ఎల్.వి.ప్రసాద్ వ్రాయటం, హిందీ చిత్రం ‘చోటీ బెహెన్’ సన్నివేశాలు చాలావరకు యధాతథంగా అనుసరించినా, కొన్ని సన్నివేశాలు ధర్మన్న వడ్డీలకోసం పేదవారిని బాధించడం కట్నం కోసం ఆశపడి కొడుకును ఇష్టపడిన అమ్మాయి నుంచి, నాటకీయంగా దూరం చేయటం, వంటివి తెలుగు నేటివిటీకి దగ్గరగా, అలరించేలా మార్పులు చేసారు దర్శకులు.
హిందీలో ‘రక్షాబంధన్’ పండుగ, దానికి సంబంధించి చెల్లెలు రాఖీ కడుతూ అన్నల వద్ద పాటపాడడం,
తెలుగులో దాన్ని చెల్లెలు శారద పుట్టినరోజు వేడుకగా మార్చటం- ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ (పి.సుశీల-దాశరథి) రాబో యే కథాంశాన్ని సూచిస్తూ అన్నలు మీరే నా కన్నులుగా నన్నే నడిపించాలి’.
ఊరు వదిలి వెళుతూ సత్యం కూలి పనులు చేసి చెల్లిని పోషించడం, చెల్లెలి కోరికపై శేఖర్ ఇంటికి వెళ్లటం. అన్నకు, చెల్లికి దూరమై తాను తాగుడు వ్యసనానికి బానిసైనందుకు శేఖర్ పరోక్షంగా అన్నను నిందిస్తూ తాను విచారించటం. చెల్లెలు గురించి మంచి చెడ్డలు విచారించలేదని సత్యం కుమిలిపోవటం. జ్వరంతో బాధపడుతున్న అన్నగారి కోసం డాక్టరు వద్దకు వెళ్లిన శారద, ఆయన ఆశ్రయం పొందటం, అతడు తనను వెళ్లాడ వచ్చిన రమేష్ అని తెలియకయే వారిని మెచ్చుకోవటం, డాక్టరు రమేష్ చేత సుశీల వదినకు ఉత్తరం వ్రాయించటం వీటిని ఎంతో ఆర్ధతతో, అర్థవంతంగా ఆకట్టుకునేలా చిత్రీకరించారు.
ఈ చిత్రంలోని నటీనటులందరూ పాత్రల పరిధి మేరకు, పరిణితితో నటించి మెప్పించారు.
సత్యంగా ఎన్.టి.రామారావు, శేఖర్కి సంబంధం గూర్చి చర్చించేటప్పుడు, దృష్టి కోల్పోయిన శారద పెండ్లి ఆగిపోయినప్పుడు ఆమె మంచి చెడ్డలు విచారించటంలో, ఎంతగానో ప్రేమించినా సుశీలను వివాహం చేసుకోలేని పరిస్థితిలో, చిన్నాన్న ధర్మన్న ఇల్లు జప్తు అని చెప్పినప్పుడు ఆవేశంతో కూడిన ఆవేదన, చివరలో తమ్ముని తిరస్కారం సోదరికై వెతుకులాట, సన్నివేశాలను నిండైన శాంతియుతమైన నటనతో మెప్పించారు.
ఇక శారదగా చంద్రకళ తొలుత, చలాకీగా హుషారుగా అమాయక చూపు, ప్రవర్తనలతో, ఆ తరువాత దృష్టి కోల్పోయినా ఎంతో నిబ్బరం, నిండుతనం గల యువతిగా అలరించింది.
ఈ చిత్రంలోని ఇతర గీతాలు వాణిశ్రీ, శోభన్బాబులపై యుగళగీతం ‘‘గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకని’’ (టి.ఆర్.జయదేవ్, పి.సుశీల- రచన దాశరథి)
పద్మనాభం-గీతాంజలిపై ‘ప్రేమ పక్షులం మనం’ (మాధవపెద్ది, బి.వసంత- కొసరాజు),
రిక్షా లాగుతూ పద్మనాభం పాడే పాట ‘రిక్షా వాలాను నేను పక్షిలాగ పోతాను’- ఘంటసాల-సినారె)
ఎన్.టి.రామారావు, చంద్రకళ ఊరు విడిచి వెళ్లేటపుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్- ‘ఇదేనా ఇదేనా దయలేని లోకాన న్యాయం ఇదేనా’ (పి.సుశీల-రచన- శ్రీశ్రీ),
తోటలో పెళ్లి కాకముందు స్నేహితురాళ్లతో కలిసి చంద్రకళ పాడే గీతం ‘మది తుళ్లి తుళ్లి ఎగిరింది’ (పి.సుశీల బృందం- ఆరుద్ర).
ఆడపడుచు’ చిత్రం మహిళా ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది. 5 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో వందరోజులకు పైగా ప్రదర్శించబడింది.