శ్రీ కృష్ణ పాండవీయం(1966)




దర్శకుడు గా పనిచేస్తూ రెండు పరస్పర విరుద్ధ మైన పాత్రలను అత్యుత్తమంగా ధరించిన
సినిమా శ్రీ కృష్ణ పాండవీయం (13-01-1966)

కథ కొంత కల్పన. మహాభారతాన్ని పూర్తిగా అనుసరించలేదు. అయితే ఇక్కడా దుర్యోధనుడు ఉద్ధతుడే గాని ఉదాత్తుడు కాడు. ఔచిత్యం చెడలేదు. శ్రీ కృష్ణుడి కీ దుర్యోధనుడి కీ ఆహార్యం ఎంత వైచిత్రి తో, వైరుధ్యం తో- ఉండగలదో అంతా ఉంటుంది. ఆ విషయం లో రామారావు కు ప్రత్యేక శ్రద్ధ. చిత్రకళలో ప్రవేశం ఉండటం ఒక కారణం. సౌమ్యత్వం, ప్రసన్నత, అభిజాత్యం, దురభిమానం - పాత్ర లను చూడగానే అన్నీ స్ఫురిస్తాయి. స్ఫురించాలని రామారావు పట్టుదల.
కృష్ణ పాండవీయం లో రుక్మిణీ కల్యాణాన్ని రమ్యాతిరమ్యంగా తీశారు.రుక్మిణీదేవి విదర్భ రాకుమారి గనుక మహారాష్ట్ర వధువు అలంకారం లో దర్శనమివ్వటం ఒక మెరుపు. పోతన్న పద్యాలను దాదాపు యథాతథం గా పాడించటం అతులిత మాధురీ మహిమ. ఆ లోకోత్తర ప్రణయానుభూతి కి లోను కాకుండా ఉండటం అవదు - కృష్ణుడు రుక్మిణి నడుము పట్టుకుని ఒక్క తృటిలో రథం మీదికి ఎత్తి నప్పుడు అక్కడ పాత్రధారులుండరు , లక్ష్మీ నారాయణులు తప్ప. ఆ. పోతన్న అంటేనే అది, ముంచెత్తటం.

శ్రీ కృష్ణ పాండవీయం సినిమా ను చూసి " బాగా తీశావురా " అని విశ్వనాథ అంటే " మీరు నేర్పినదే మాస్టారూ " అని రామారావు జవాబు చెప్పడం. ఇది ఒక గాథే అయి ఉండనూ వచ్చు, వాళ్ళుఆ స్థాయి మనుషులు గనుక.

రచన: పోతన
గానం : ఘంటసాల
సంగీతం : టీ వీ రాజు
తెరపై : ఎన్ టి ఆర్, కె ఆర్ విజయ, గీతాంజలి మున్నగువారు
దర్శకత్వం : ఎన్ టి ఆర్
కెమెరా : రవికాంత్ నగాయిచ్

కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదే
హు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.
రుక్మిణీదేవి కృష్ణుణ్ణి కనుగొంది. అప్పుడు కృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణం, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు. పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు. విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వ లోక మనోహరంగా ఉన్నాడు.
కనియెన్ = చూసెను; రుక్మిణి = రుక్మిణీదేవి; చంద్రమండల = చంద్రబింబము వంటి; ముఖున్ = ముఖము కలవానిని; కంఠీరవ = సింహ; ఇంద్ర = శ్రేష్ఠము వంటి; అవలగ్నున్ = నడుము కలవానిని; నవ = సరికొత్త; అంభోజ = తామర; దళ = రేకులవంటి; అక్షున్ = కన్నులు కలవానిని; చారుతర = మిక్కిలి అందమైన; వక్షున్ = వక్షస్థలము కలవానిని; మేఘ = మేఘములను; సంకాశ = పోలిన; దేహున్ = దేహము కలవానిని; నగారాతిగజేంద్ర = ఐరావతము యొక్క ; హస్త = తొండము; నిభ = వంటి; బాహున్ = చేతులు కలవానిని; చక్రిన్ = చక్రాయుధుని, కృష్ణుని; పీతాంబరున్ = పసుపు వన్నె వస్త్రము వాని; ఘన = గొప్ప; భూష = ఆభరణములు; ఆన్వితున్ = కూడినవానిని; కంబు = శంఖము వంటి; కంఠున్ = మెడ కలవానిని; విజయ = జయించుట యందు; ఉత్కంఠున్ = ఉత్కంఠము కలవానిని; జగత్ = లోకములను; మోహనున్ = మోహింపజేయువానిని

1966 లో 32 తెలుగు చిత్రాలు విడుదల కాగా, ఎన్ టి ఆర్ 12 చిత్రాల్లోనూ, ఏయన్నార్ నాలుగు చిత్రాల్లోనూ నటించారు.

1966 సంవత్సరంలో సంక్రాంతికి నాయక, ప్రతినాయక పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో ఎన్ టి ఆర్ రూపొందించిన 'శ్రీకృష్ణ పాండవీయం', ఫిబ్రవరిలో రామినీడు దర్శకత్వంలో పల్నాటి యుద్ధం, మార్చిలో రాజ్యం పిక్చర్స్ శకుంతల, ఏప్రిల్ లో సి పుల్లయ్యగారి దర్శకత్వంలో ఆ ఏడాది సూపర్ హిట్ సినిమా పరమానందయ్య శిష్యుల కధ, మే లో శ్రీకాకుళాంధ్ర మహా విష్ణు కధ, జూన్ నెలలో ఎన్ టి ఆర్, విఠలాచార్య కలయికలో రూపొందిన 'అగ్గిబరాటా', జూలై నెలలో సంగీత లక్ష్మి, ఆగస్టులో శ్రీ కృష్ణ తులాభారం , సెప్టెంబర్ నెలలో అడుగుజాడలు, పిడుగు రాముడు , అక్టోబరులో డాక్టర్ ఆనంద్ విడుదలయ్యాయి.

ఇవి కాక చైల్డ్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన 'లేత మనసులు' , మొనగాళ్ళకు మొనగాడు, పొట్టి ప్లీడర్, 'గూఢచారి 116' 'చిలకా-గోరింక', కె.ఎస్.ఆర్.దాస్ 'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక' అక్కినేని నటించిన 4 సాంఘిక చిత్రాలు ఆత్మ గౌరవం, నవరాత్రి, ఆస్థిపరులు, మనసే మందిరం విడుదలయ్యాయి.
1966 సంవత్సరం జనవరి 13వ తేదీ విడుదలైన శ్రీ కృష్ణ పాండవీయం సినిమా విశేషాలు:-
నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ (ఎస్‌.ఏ.టి) అనగానే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి నటరత్న ఎన్‌.టి.రామారావు. అరవై ఏళ్ళుగా ఈ సంస్థ చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది. చిత్రరంగంలో నిలదొక్కుకున్న తొలి రోజులలోనే ప్రజారంజకమైన సినిమాలు నిర్మించాలనే సదుద్దేశంతో ఎన్టీఆర్‌ 1952లోనే నేషనల్‌ ఆర్ట్స్‌ సంస్థను నెలకొల్పారు. చిత్ర పరిశ్రమకు రాకముందు ఆ సంస్థ పేరు మీదే నాటకాలు వేసేవారు. తొలి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. ‘‘సీతారామ కళ్యాణం’ సొంత చిత్రంలో రాముడి వేషం కాకుండా ప్రతినాయకుడైన రావణుని పాత్ర పోషించి మెప్పించారు. అదే స్ఫూర్తితో ‘శ్రీక్రిృష్ణ పాండవీయం’ సినిమాలో ఎన్టీఆర్‌ అటు కృష్ణుడుగా, ఇటు సుయోధనుడుగా రెండు విభిన్న పాత్రలలో నటించి, ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించారు. చిత్రానువాదంతోపాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి, ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్నారు. గతంలో ‘‘సీతారామ కళ్యాణం’, ‘గులేబకావళి కథ’ సినిమాలకు ఎన్టీఆరే దర్శకత్వం వహించినా తన పేరు మాత్రం క్రెడిట్స్‌లో వేసుకోలేదు. అయితే రామకృష్ణ: ఎస్‌.ఏ.టి. కంబైన్‌ పతాకంపై నిర్మించిన ఈ ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలోనే ఆయన పేరు దర్శకునిగా మొదటిసారి వెండితెరమీద దర్శనమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 1966న విడుదలైన ఈ చిత్రం తొమ్మిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.

‘‘సీతారామకల్యాణం’ సినిమాకు రావణబ్రాహ్మ పాత్రను విలక్షణంగా ఆవిష్కరించిన సముద్రాల రాఘవాచార్య ‘శ్రీక్రిృష్ణ పాండవీయం’ సినిమా కోసం భారత భాగవతాది గ్రంధాలలో వుండే ఉపాఖ్యానాలను నేపధ్యంగా తీసుకుని కథ అల్లి సంభాషణలు సమకూర్చారు. ఎన్టీఆర్‌ చిత్రానువాదాన్ని సొంతంగా రూపొందించుకున్నారు. సుయోధునుడి స్వాభిమాన ప్రవృత్తిని, రుక్మిణీదేవి - శ్రీకృష్ణుల ప్రణయ గాథను, భీమసేనుని సాహస కృత్యాలను ప్రముఖంగా చూపి ఈ సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్‌దే. శ్రీకృష్ణునిగా, సుయోధునునిగా ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌ ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. విజయవారి ‘‘మాయాబజార్‌’’ గొప్పతనానికి సరితూగిన సత్తా కలిగిన సినిమా ‘శ్రీక్రిష్ణ పాండవీయం’’.

మీర్జాపురం రాజావారు జయా ఫిలింస్ బ్యానర్పై 1938లో నిర్మించిన ‘శ్రీకృష్ణ జరాసంధ’ (వేమూరి గగ్గయ్య, ఎంవి రాజమ్మ కాంబినేషన్) చిత్రం కొంత ప్రేరణగా, భారత భాగవత గ్రంథాల్లోని, ఉప కథలను జోడించి సముద్రాలతో రచన చేయించి చిత్రకథను ఎన్ టి ఆర్ సిద్ధం చేసుకున్నారు. నెగెటివ్ పాత్రను పోజిటివ్ గా మలచి మెప్పించగల మేటి ఎన్ టి ఆర్ పురాణాలను శోధించి సుయోధనుని పాత్రను మరింతగా తీర్చిదిద్ది శ్రీకృష్ణునిగా, తొలిసారి సుయోధనునిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది.

రచన: సీనియర్ సముద్రాల
పాటలు: కొసరాజు, సి నారాయణరెడ్డి
నృత్యం: వెంపటి సత్యం
కళ: టివియస్ శర్మ
ఛాయాగ్రహణం: రవికాంత్ నగాయిచ్,
ఎడిటింగ్: జిడి జోషి
సంగీతం: టివి రాజు
స్టంట్లు: సాంబశివరావు, స్వామినాథన్
నిర్మాత: త్రివిక్రమరావు
చిత్రానువాదం, దర్శకత్వం: ఎన్ టి రామారావు

కుంతీదేవి (ఎస్ వరలక్ష్మి) శ్రీకృష్ణుని (ఎన్ టి ఆర్) తన కుమారులకు ఎల్లవేళలా అండగా ఉండమని కోరటం చిత్ర ప్రారంభం. పాండవుల ప్రజ్ఞను ఓర్వలేని సుయోధనుడు (ఎన్ టి ఆర్) మనోగతం, శకుని వృత్తాంతం, వారణాసిలో పాండవుల లక్షాగృహ దహనయత్నం, శ్రీకృష్ణుని సాయంతో భీముడు కుటుంబాన్ని రక్షించుకోవటం, హిడింబి ప్రేమ, భీముడు హిడింబాసురుని సంహరించటం, భీమునికి హిడింబికి వివాహం, కుంతీదేవి కోరికపై శ్రీకృష్ణుడు రుక్మిణీ కల్యాణ ఘట్టం, ఏకచక్రపురవాసులైన పాండవులు, భీముడు బకాసురుని సంహారం, అర్జునుడు (శోభన్ బాబు) మత్స్యయంత్రం ఛేదించి ద్రౌపదిని చేపట్టటం, తల్లిమాటపై ఆమె వారందరికీ పత్ని కావటం, ఇంద్రప్రస్తానికి వచ్చిన పాండవులు, మరల భీముడు జరాసంధుని (ముక్కామల)తో పోరాడి సంహరించటం, పాండవులు రాజసూయ యాగం నిర్వహణ, సుయోధనుడు మయసభలో భంగపడటం, పాండవ ద్వేషం హెచ్చటం, యాగానంతరం శ్రీకృష్ణునికి అగ్రపూజ నిర్వహిస్తున్నందుకు పాండవులనూ, శ్రీకృష్ణునీ నిందించిన శిశుపాలుడు (రాజనాల) సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుని చేత మరణించటం, విశ్వరూప సందర్శనంతో చిత్రం ముగుస్తుంది.
కొన్ని ముఖ్యపాత్రల్లో ధర్మరాజు (బాలయ్య), శకుని (ధూళిపాళ), నారదుడు (కాంతారావు), రుక్మి (సత్యనారాయణ), రుక్మిణి తండ్రి భీష్మకుడు (నాగయ్య), రుక్మిణి (కెఆర్ విజయ), చెలికత్తె మాలతి (గీతాంజలి), హిడింబి (నాగరత్నం), ధృతరాష్ట్రుడు (మల్లాది), భీష్ముడు (మిక్కిలినేని), ద్రోణుడు (కెవియస్ శర్మ), కర్ణుడు (ప్రభాకరరెడ్డి), దుశ్శాసనుడు (జగ్గారావు), అగ్నిద్యోతనుడు (వంగర) నర్తకీమణులు భారతి, తిలకం.

దుర్యోధనుని వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో వినూత్న కోణంలో చూపించారు. దుర్యోధనునికి సమకూర్చిన సంభాషణలు విలక్షణంగా ఉంటాయి. రుక్మిణిగా నటించిన కె.ఆర్‌.విజయ ముగ్ధ మనోహరంగా ఉంటుంది. భీముడిగా కన్నడ ఉదయ్‌కుమార్‌ నటన అద్భుతంగా కుదిరింది.
కథాపరంగా భీముని పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో దానికి ప్రముఖ కన్నడ నటుడు ఉదయకుమార్ ను ఎన్నుకోవటంలో ఎన్టీఆర్ విజ్ఞత గోచరిస్తుంది. భీమునిగా ఉదయకుమార్ ఆవేశకావేశాలను, కొంత చతురతను, శౌర్య, ప్రతాపాలను సన్నివేశానుగుణంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులంతా తమ ప్రజ్ఞాపాటవాలను, నటకౌశలాన్ని పాత్రలకు తగినట్టు అభినయించారు. వారిలో నయవంచక శకునిగా ధూళిపాళ, అందాలతార కెఆర్ విజయ రుక్మిణిగా తన ముగ్ధమోహన సౌందర్యంతో, లలిత శృంగారాభినయంతో మురిపించటం ఎన్నదగిన అంశాలు.

ఇక సుయోధనునిగా ఎన్ టి ఆర్ పాత్ర ప్రవేశంలోనే ఒక గాంభీర్యాన్ని ఆహార్యంలో తలపై పెద్ద కిరీటం, వెనుకవేలాడే చేలాంచలం, పాండవులను తలచుకుంటూ పలికే మాటలు ‘దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై, నవఖండ భూమండల పరివ్యాప్తమైన ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించు రారాజును’ అని ఒక పర్యాయము, మరోసారి మయసభలో భంగపడి ద్రౌపదిని తలచుకుంటూ ‘పాంచాలి పంచభర్తృక, నీవా నన్ను పరిహసించునది? సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును నేడొక అబల బంధకీ అపహసించుటయా’ అంటూ సన్నివేశంలో కిరీటం లేకుండా అటుఇటూ తిరుగుతూ, ద్రౌపది మంటపాల మధ్యలో ముగ్గురిగా పలువురిగా కన్పించటం, దుర్యోధనుని తలచుట్టూ వందలకొద్ది గిర్రున తిరగడం, శకుని మాటలు ఆలకించి కొంత యోచన, కొంత ఆనందం రారాజు ముఖంలో ప్రతిఫలించటం ఆకట్టుకునేలా చిత్రీకరించి అబ్బురమనిపించారు.

ఇక రెండోవైపు స్వాతికాభినయంతో కూడిన శ్రీకృష్ణునిగా చల్లని, చక్కని చిరునవ్వుతో శాంత, అభయముద్రను చేపట్టి, ఆపన్నులనాదుకోవటం, భీమునిలో పౌరుషం రేకెత్తించడంలో సుయోధనుని చెయ్యగలిగింది లేనపుడు చేయి కలపటం మంచిది అని అనునయించటం, శిశుపాలుని నిందలు చిరునవ్వుతో సహించి చివరకు ఆగ్రహంతో చక్రం ప్రయోగించటం, రెండు పాత్రలను ఎంతో కఠోర దీక్షా దక్షతలతో వైవిధ్యభరితంగా మెప్పించటం ఆ నట సార్వభౌమునికే చెల్లింది. దర్శకునిగా సన్నివేశాలను తీర్చిదిద్దటంలో చిత్రీకరణలో వైవిధ్యాన్ని చూపటం విశేషం.
వాహిని స్టూడియోలో నిర్మించిన మయసభ సెట్టింగుని చూసేందుకు నిర్మాత త్రివిక్రమరావు ఎవ్వరినీ అనుమతించేవారు కాదట. చివరికి ఆ స్టూడియో నిర్మాత నాగిరెడ్డికి కూడా ఆ సెట్టింగు చూసేందుకు అనుమతి లభించకపోతే, విషయం తెలుసుకున్న నందమూరి సోదరులు నాగిరెడ్డిని సగౌరవంగా ఆహ్వానించి మయసభ సెట్‌ చూపించారట.
ఛాయాగ్రాహకులు రవికాంత్ నగాయిచ్, కళాదర్శకులు టివియస్ శర్మ రూపొందించిన అద్భుతమైన మయసభ సెట్టింగ్స్, దుర్యోధనుని సభ, లాక్షాగృహం, హిడింబి నృత్య సన్నివేశం సెట్, రుక్మిణి మందిరం, బకాసురుని వద్ద ఎముకల గుట్టలు, జరాసంధుని భవనం ముందువైపు, హిడింబాసురుడు చెట్లనుండి పడిన కాయలన్నీ తినటం, భీముని దెబ్బకు అవి నోటినుంచి కింద పడడం, మత్స్యయంత్రం దానికి కృష్ణుని మురళీ అడ్డుపడడం, ఇంకా పలు సభా భవనాలు, శిల్పసుందరులు, ముఖ్యంగా మయసభలో ఓ పుష్పం శిల్పంపై తుమ్మెదలు నిజమైన పుష్పం అని భ్రమపడి తిరుగాడ్డం అద్భుతంగా చిత్రీకరించారు.

సాంబశివరావు, స్వామినాథన్ లు ఈ చిత్రంలో భీమ, హిడింబాసుర, భీమబకాసుర, భీమ జరాసంధ యుద్ధాలను ఎంతో వివరంగా వైవిధ్యంగా రూపొందించటం మెచ్చతగినది.
శ్రీ కృష్ణ పాండవీయం చిత్రం ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలలో ఉత్తమ ద్వితీయ చిత్రంగా పురస్కారం పొందింది.
పిల్లలకు, పెద్దలకు మన పౌరాణికాలలో విశేషాలు ఎంతో అర్ధవంతంగా, పంచభీమ ప్రహసనం, గాంధార రాజసుతుల చెరసాల, వెన్నెముక నుంచి పావులు తయారుకావటం, శకుని దుర్బోధలకు కారణం ఇటువంటి సంగతులు అద్భుతమైన చిత్రీకరణతో వాటికి శాశ్వతత్వాన్ని ఈ చిత్రం ద్వారా కలుగచేయటం ఎంతో అభినందించదగ్గ విషయం. ఒక చరిత్రకు ఆధారంగా నిలిచిన విశిష్ట చిత్రం ‘శ్రీ కృష్ణ పాండవీయం. ఈ యాభై సంవత్సరాలుగా ఈ చిత్ర గీతాలు నేటికీ నిత్యనూతనంగా విరాజిల్లటం ఓ మధురానుభూతికి ఆలవాలం కావటం ప్రత్యేక విశేషం.
స్వీయ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న అపురూప రమణీయం శ్రీ కృష్ణ పాండవీయం. పౌరాణిక చిత్రాల వరుసలో మహాద్భుతం. ప్రేక్షక లోకాన్ని విస్మయ పరచి మరో లోకానికి తీసుకు పోయిన రస గంగా ప్రవాహం.

ద్విపాత్రల వైభవాన్ని కన్నుల పండుగ్గా చూపిన దిగ్దర్శక మహా నటుడు ఎన్ టి ఆర్. శ్రీ కృష్ణ, దుర్యోధనుల మధ్య అభినయ వైవిధ్యాన్ని అత్యంత మనోహరంగా, అపార వైభవంగా ఆవిష్కరించిన ఘనత ఎన్ టి ఆర్ దక్కించుకున్నారు. శ్రీ కృష్ణుని ఆపన్న హస్తాన్ని, దుర్యోధనుని అద్వితీయ వైభవాన్ని తెరకెక్కించిన ప్రజ్ఞా ప్రాభవం ప్రేక్షకులను మోకరిల్ల చేసింది.
మయ సభ మనోహరం, సుయోధనుని మతిభ్రంశం, అవమానాగ్నితో రగిలిన ఆగ్రహోదగ్ర హృదయం తెరపై రచించిన దర్శక నైపుణ్యం మహా మహిమాన్వితం. రుక్మిణీ కల్యాణ ఘట్టం రమణీయ మనోరంజకం, సర్వ పాప హరణం. ఏక చక్ర పుర ప్రహసనం సుశోభితం సర్వ జన రంజకం.

కన్నడ నటుడు ఉదయ కుమార్ ను భీమునిగా మలిచిన తీరుకు జనం పరవశం చెందారు. అతని నట జీవితంలో ఈ పాత్ర ప్రత్యేకతను చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.
ధూళిపాళను మంచి నటుడిగా అందరూ ఎరుగుదురు. అతనిలోని నివురుగప్పిన నిప్పులాంటి అసమాన నటనను రగిల్చి ఒడలు గగుర్పాటును కలిగించే శకుని సమయస్పూర్తిని, క్రూరత్వాన్ని జ్వాజ్యలమానంగా తెరపై చూపిన విధం అత్యద్భుతం.
శకుని వేషానికి ఈ సినిమాలో ఒక విశిష్టత వుంది. దుర్యోధనుని దురాలోచనకు ఆజ్యం పోసే శకుని కౌరవ వినాశానికి ఎందుకు కారకుడయ్యాడనే ప్రశ్నకు ఈ సినిమాలో సమాధానం దొరుకుతుంది. దుర్యోధనునికి దీటుగా శకుని సంభాషణలుంటాయి.
అలాగే శకుని రెండు అరచేతుల మధ్య పాచికలను రాపాడిస్తూ ‘పితుహూ’’ అని అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ ఎడమచేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ ప్రతాకారేచ్ఛతో నవ్వే నవ్వులో దూళిపాళ ప్రదిర్శంచిన నటన అపూర్వం!

ఇతర ప్రధానపాత్రల్లో కాంతారావు నారదుడుగా, యస్‌.వరలక్ష్మి కుంతీదేవిగా, బాలయ్య ధర్మరాజుగా, శోభన్‌ బాబు అర్జునుడుగా, రాజనాల శిశుపాలుడుగా, సత్యనారాయణ రుక్మిగా, రత్న హిడింబగా ఒదిగిపోయి నటించారు.
ఎన్ టి ఆర్ ప్రతిభ ప్రతి గ్రామాన్ని చర్చా నిలయం చేసింది. అక్షర రూపంలో అభినందనల పరంపర ఎన్ టి ఆర్ ఆఫీసును ఆక్రమించింది. ఈ చిత్రం 9 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుని 125 రోజుల రన్ ను సాధించింది. అటు పరిశ్రమనూ, ఇటు ప్రజలను, విమర్శకులను, పండిత పామరులను పులకాంకితం చేసిన అపురూప చిత్ర శ్రీ కృష్ణ పాండవీయం.
ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్ర బహుమతిగా రజత నందిని బహుకరించింది. 

తమిళంలో ఇదే సినిమాను ‘‘కన్నన్ కరుణై ’’ పేరుతో 1971 లో నిర్మించారు. ఎన్ టి ఆర్ కృష్ణుడిగా , కె ఆర్ విజయ రుక్మిణి గా నటించారు. ఉదయకుమార్ తమిళ్ లో కూడా భీముడిగా వేసారు. దుర్యోధనుడు మొదలైన మిగిలిన పాత్రలుఎన్ తమిళ్ నటులు పోషించారు. ఎన్  టి ఆర్ దర్శకత్వ భాద్యత కూడా వహించారు.
కె ఆర్ విజయ తెలుగులో ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. తమిళంలో ఇదే సినిమాను ‘‘కన్నన్ కరుణై ’’ పేరుతో 1971 లో నిర్మించారు. ఎన్ టి ఆర్ కృష్ణుడిగా , కె ఆర్ విజయ రుక్మిణి గా నటించారు. ఉదయకుమార్ తమిళ్ లో కూడా భీముడిగా వేసారు. దుర్యోధనుడు మొదలైన మిగిలిన పాత్రలుఎన్ తమిళ్ నటులు పోషించారు. ఎన్  టి ఆర్ దర్శకత్వ భాద్యత కూడా వహించారు.

కె ఆర్ విజయ తెలుగులో ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. 
ఈ చిత్ర నిర్మాణ వ్యయం సుమారు ఏడు లక్షలు. రెండేళ్ల తరువాత మరలా విడుదలచేసినప్పుడు, ఈ సినిమా యాభై రోజులకుపైగా ఆడింది. 1986లో ఈ సినిమా హక్కులను ఆంధ్రా, సీడెడ్‌ ప్రాంతాలకు యాభై రోజులకు పైగానే ఆడింది. రిపీట్‌ రన్‌లో హైదరాబాద్‌ నగరంలో ఈ సినిమా శతదినోత్సవం చేసుకోవడం కూడా ఒక రికార్డే.
టివి రాజు, ఎన్ టి ఆర్ కాంబినేషన్లోని చిత్రాల గీతాలన్నీ అమృతానంద స్వరాలతో అలరిస్తాయి. అదే కోవలోనే ఈ చిత్రంలోని గీతాలు మనకు వినిపిస్తాయి.
పాటలు, పద్యాలు, అద్భుత రసానుభూతితో వీనుల విందుగా మురిపించాయి.

పోతన రుక్మిణీ కల్యాణం - వెండి తెరపై అపురూప సృష్టి శ్రీ కృష్ణ పాండవీయం.
“నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయు మమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో
లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో?
భగ్నంబై చనునో? విరించికృత మెబ్బంగిం బ్రవర్తించునో?
ఆ యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; దప్పదు జాడ్యము లేల? నీవు నీ
తోయమువారుఁ గూడుకొని తోయరుహాననఁ దెత్రు గాని వి
చ్చేయుము; శత్రులన్నుఱుము జేయుము చేయుము శోభనం బిలన్
అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్.
వచ్చెద విదర్భభూమికిఁ;
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలం
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్.
కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదే
హు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,
ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.

1. రుక్మిణీ కల్యాణం

2. సుయోధనుడి పరిచయం

3. శకుని చెరసాల


4. తండ్రితో దుర్యోధనుడు...జనకా...

5. శ్రీ కృష్ణుడు, భీమునిపైన చిత్రీరించిన గీతం, దీనిలో శ్రీ కృష్ణుడు ఒకవైపు, మధ్యలో శయ్యపై నిద్రిస్తున్న భీముడు, మరోవైపు మారువేషంలో శ్రీకృష్ణుడు మూడు ఒకే ఫ్రేములో చూపటం, సందేశాత్మక గీతం -మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా’ (కొసరాజు- ఘంటసాల). శ్రీకృష్ణుడు మారువేషంలో వచ్చి లక్కయింటికి కాపలా కాస్తున్న భీమునికి జాగ్రత్తలు చెప్ప గీతమిది. ఇందులో ‘‘పవిత్రాయాణ సాధూనాం’’ అనే భగవద్గీత శ్లోకాన్ని ‘‘కర్తవ్యం నీవంతు, కాపాడుట నావంతు... చెప్పడమే నాధర్మం, వినకపోతే నీ ఖర్మం’’ అని ముందుగానే హెచ్చరించడం నచ్చే విషయం.

6. భీముని మోహించిన హిడింబి నాగరత్నంపై చిత్రీకరించిన గీతం -చాంగురే బంగారు రాజా గొప్పగా అలరిస్తుంది. ఈ గీతంలో -కైపున్న మచ్చకంటి చూపు/ అది చూపుకాదు పచ్చల పిడిబాకు, విచ్చిన పూరేకు..’ (సినారె -జిక్కి) అంటూ సాగే చరణానికి చేతిలో పిడిబాకు, మరో చేతిలో పూవుతో రత్నను చూపటం, మరోసారి పెద్ద శంఖంపై ఇద్దరు, ముగ్గురు, ఐదుగురిగా రత్న కన్పించటం ఉదయకుమార్ ను కవ్విస్తూ నృత్యభంగిమలలో ఆకట్టుకోవటం చక్కని చిత్రీకరణతో సాగుతుంది. సినారే రాసిన మరొక గీతం హిడింబ భీముని వరించి పాడే ‘‘ఛాంగురే బంగారు రాజా’’ అనే జిక్కిపాట. సినారే ఈ పాటను రాసేముందు ఎన్టీఆర్‌ కొన్ని నిబంధనలు విధించారు. హిడింబ రాక్షసాంగన. ఆమె మానవాంగనగా మారి భీముని వరించే పాట కనుక వాడుకలోలేని పదాలతో, ప్రౌఢసమాసాలతో, జానపద ధోరణిలో, ఉసిగొలిపేలా ఉండాలనేది ఆ నిబంధన. సినారె వాడుకలోలేని అచ్చతెలుగు పదాలతో ఆ పాటకు రూపమిచ్చారు. ‘‘మజ్జారే మగరేడా, మత్తైన వగకాడా - అయ్యారే నీకే మనసియ్యాలని వుందిరా’’ అంటూ పల్లవి సాగుతోంది. చరణాల్లో మొలకమీసం, సింగపు నడుము, అమ్మకచెల్ల, మచ్చెకంటి, కైదండ వంటి జాను తెలుగు పదాలతో సినారె పాటకు గుబాళింపు తెచ్చారు. టి.వి.రాజు అద్భుతమైన స్వరాలు అందించి ఈ పాటను హిట్‌ చేశారు.

7. ఎన్ టి ఆర్ , కెఆర్ విజయపై చిత్రీకరణ, పెళ్ళికిముందు రుక్మిణి అంతఃపురంలో వారిరువురూ బయట గీతాంజలి నృత్యం, సత్యనారాయణలపై చిత్రీకరణ -ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని చేరి (ఘంటశాల, పి సుశీల). చక్కని అలరింపుతో సాగిన పాట నేటికీ అలరించటం విశేషం. టి.వి.రాజు రాగేశ్వరి రాగంలో ఆ గీతానికి బానీ కట్టారు. త్యాగరాజుస్వామి ‘‘సాధించనే మనసా’’ అనే కృతిలో వాడిన ‘‘సమయానికి తగు మాటలు’’ అనే పదాన్ని సముద్రాల ఇందులో వాడడం విశేషం.

8. ప్రాణేశ

9. కనియెన్ రుక్మిణి

10. రుక్మి గర్వ భంగం

11. రుక్మిణి, శ్రీకృష్ణుల తొలిరేయి చెలుల నృత్యగీతం -నల్లనివాడైనా ఓ చెలీ చల్లనివాడేలే’ (జిక్కి, ఎల్ఆర్ ఈశ్వరి బృందం).

12. భీముడు, బండినిండా ఆహారంతో వెళ్తూ పాడే పాట భళా భళీ నా బండి పరుగూతీసే బండి (కొసరాజు- మాధవపెద్ది).

13. ద్రౌపదీ స్వయంవరం

14. చిత్రం చివర మయసభలో సుయోధనుడు ఎన్ టి ఆర్, నర్తకీమణులు భారతి బృందం చక్కని నృత్యంతో సాగే అద్భుత గీతం -స్వాగతం సుస్వాగతం కురుసార్వభౌమా (సినారె -పి లీల, పి సుశీల). చక్కని సంగీతం సాహిత్యాలతో జోడుగుర్రాల్లా ఈ గీతం సాగుతుంది. ఎన్టీఆర్‌కి ‘దుర్యోధన’ అనే పదం కన్నా ‘సుయోధన’ అనే పేరంటే ఇష్టం. అందుకే సినారె ఈ స్వాగత గీతంతో సుయోధన అనే పదాన్ని వాడారు. అంతేకాదు ప్రతి చరణం చివర ఒక సంస్కృత ప్రౌఢసమాజాన్ని ఉపయోగించారు. ‘‘శతసోదర సంసేవిత సదనా, అభిమానధనా సుయోధనా’’ అంటూ పల్లవితో మొదలై ‘‘ధరణిపాల శిరోమకుట మణి తరుణకిరణ పరిరంజిత చరణా’’ అనే మొదటి చరణంతోనూ ‘‘కదనరంగ బహుదండధృత గదా ప్రకట పటు శౌర్యాభరణా’’ అనే రెండో చరణంతోనూ పాట సాగుతుంది. అర్ధంకాని సమాసాలున్నా, ప్రేక్షకులకు అర్ధంకాకున్నా ఈ పాటను గొప్పగా ఆదరించారు. సుశీల, లీల బృందం ఆలపించిన ఈ పాటను టివి రాజు హంసధ్వని రాగంలో స్వరపరిచారు. అంతేకాకుండా స్వాగత గీతం కనుక పాశ్చాత్య వాద్యాలను కూడా వాడి గంభీర ‘‘కాహళ’’ ధ్వనులతో అలరించారు.

15. మయ సభ -01

16. మయ సభ -02

17. మయ సభ -03

18. మయ సభా పరాభవం

19. జరాసంధుని శయ్యా గృహం

20. అగ్ర పూజ

21. శిశుపాల వధ -01

22. శిశుపాల వధ -02

23. పురుష సూక్తం

ఈ చిత్రంలో రారాజు ప్రవేశమే అత్యద్భుతం. సంస్కృత పదభూయిష్టమైన దీర్ఘసమాసాలతో కూడిన ముందు మాటలను ఎన్టీఆర్‌ పలికిన తీరు నభూతో న భవిష్యతి. ‘‘దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై, నవఖండ భూమండల పరివ్యాప్తమై, దశౌక్షౌహిణీ సేనావాహినీ పరిరక్షితమై, శాత్రవ భయంకరమైన, ఈ కురుమహా సామ్రాజ్యమును శాసించు రారాజును నేను’’ అంటూ స్వోత్కర్షతో సాగే మాటలు రారాజు అతిశయాన్ని, దర్పాన్ని, అహంకారాన్ని, వెరిసి పాండవుల మీది అసూయను ప్రతిబింబిస్తాయి. పాత్రప్రవేశంలోనే ఈ లక్షణాలను చూపించడం ఎన్టీఆర్‌ స్క్రీన్‌ప్లే రచనా సమర్ధతక, దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. 
‘‘అణోరణీయాన్‌ మహతో మహియాన్‌’’ అనే ఉపనిషత్‌ సూక్తికి నిదర్శనం ఎన్టీఆర్‌.

No comments:

Post a Comment