🌹🌹ముక్కోణపు ప్రేమకథ ఆడబ్రతుకు🌹🌹
చలనచిత్ర చరిత్రలోనే అపూర్వ కళాఖండంగా నిలిచిపోయిన ‘చంద్రలేఖ’ హిందీ సినిమా ద్వారా అద్భుత సంచలనం సృష్టించిన చిత్ర నిర్మాణ సంస్థ ‘జెమినీ’. ఆ చిత్రంలో కథానాయికగా నటించిన టి.ఆర్.రాజకుమారి ఆనాటి ప్రేక్షకులకు వెండితెరపై సాక్షాత్కరించిన స్వప్నసుందరిగా నిలిచింది. జెమినీ స్టూడియోతో బాటు జెమినీ వారి సినిమాలు కూడా అగ్రశ్రేణిలో వెలుగొందుతున్న రోజుల్లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో జెమినీ అధిపతి యస్.యస్.వాసన్ నిర్మించిన ప్రేమ కావ్యం ‘ఆడబ్రతుకు’ సినిమా. ఆత్రేయ, సినారెల పా(మా)ట విరుపులకు సుస్వర రాగాలల్లిన స్వరమాధురీ ధురీణులు విశ్వనాథన్− రామ్మూర్తిల గాన కావ్యం ఈ సినిమా. ఎన్టీఆర్ చలనచిత్ర జీవితంలో ‘ఆడబ్రతుకు’ విజయం ఒక గొప్ప రజతోత్సవ మైలురాయి. నవంబరు 11, 1965న విడుదలైన ఈ సినిమా విశేషాలు కొన్ని...
సినిమా కథ ..
సీత (దేవిక) కలిగిన కుటుంబంలో పుట్టినా, అనుకోని పేదరికం వలన ఒక నాటక కంపెనీలో చేరుతుంది. ఆ కంపెనీ డైరెక్టరు గోపాలరావు (కాంతారావు) సీతకు మంచి అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఆమెను మనసారా ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. కానీ, సీతకు అతడు తనను ప్రేమిస్తున్నట్టు తెలియదు. ఆ కంపెనీ యజమాని గంగరాజు (రాజనాల) సీతపై కన్నువేస్తాడు. ఒకరోజు గంగరాజు రౌడీలు సీతను బలవంతంగా అతని వద్దకు తీసుకొని వెళ్తుండగా రావుబహద్దూర్ రంగనాథం (యస్వీ రంగారావు) కొడుకు రాజా (ఎన్టీఆర్) ఆమెను కాపాడుతాడు. మనసులు కలిసి ఇద్దరూ ప్రేమించుకుంటారు. రాజా సీతను పెళ్లిచేసుకుంటానని తండ్రితో చెప్పడంతో అతడు హతాశుడవుతాడు. నాటకాల కంపెనీలో నర్తించే అమ్మాయిని కోడలిగా పొందడం రంగనాథానికి ఇష్టం ఉండదు. రాజు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వారిద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. గోపాలరావును చూడరాదని, కలుసుకోరాదని సీతకు షరతు విధిస్తాడు. ఒకరోజు రాత్రి రాజు−సీత ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా గంగరాజు వద్ద వుండే రౌడీ జోగులు (సత్యనారాయణ) వలపన్ని ఇద్దరినీ వేరుచేస్తాడు. ఒంటరిగా చిక్కిన సీతను వెంబడిస్తాడు. అతని బారి నుండి రక్షించుకోడానికి సీత ఒకరింట్లో దాక్కుంటుంది. ఆ ఇల్లు గోపాలరావుది. ఆ సమయంలో విప్లవకారులు చెలరేగి దోపిడీలు, లూఠీలు చేస్తుండటంతో పోలీసులు ఆ ప్రదేశంలో కర్ఫూ¬్య విధిస్తారు. సీత ఆ రాత్రి గోపాలరావు ఇంట్లో తలదాచుకోవలసి వస్తుంది. అదేరాత్రి గంగరాజును జోగులు హత్య చేస్తాడు. మరునాటి ఉదయం పోలీసులు అనుమానంపై గోపాలరావును అదుపులోకి తీసుకుంటారు. సీత సాక్ష్యం మీద తన నిర్దోషిత్వం నిరూపించుకొనే అవకాశం గోపాలరావుకు ఉంటుంది. కానీ, ఏ పాపమూ ఎరుగని సీత బతుకు చీకటైపోతుందని ఆ విషయాన్ని గోపాలరావు బయటపెట్టడు. కానీ తన సాక్ష్యంతో ఒక నిరపరాధికి ఉరి శిక్ష తప్పుతుందని తెలుసుకున్న సీత, కోర్టులో సాక్ష్యం చెప్పి గోపాలరావు విడుదలకు సహకరిస్తుంది. దాంతో రాజా ఆమెను ఇంటి నుంచి గెంటి వేస్తాడు. అప్పుడు సీత గర్భవతి. తల్లితో కలిసి ఊరు విడిచి వెళుతూ మైకం కమ్మి పడిపోతే, పొరుగూరులో ఉండే భాగ్యవంతుడైన షేర్‌ఖాన్ (ముక్కామల) ఆమెను ఆశ్రయమిస్తాడు. అతడు రంగనాథానికి మిత్రుడు. సీత మగబిడ్డను ప్రసవిస్తుంది. తండ్రి మనోవేదన చూసి భరించలేక రాజా మరోపెళ్లికి సిద్ధపడతాడు. విషయం తెలుసుకున్న షేర్‌ఖాన్ పెళ్లి ఆపేందుకు కారులో రంగనాథం ఊరికి వెళుతుండగా పోలీసులతో పాటు గోపాలరావు కూడా జోగులను తరుముకుంటూ షేర్‌ఖాన్‌కు ఎదురవుతారు. పోలీసుల కాల్పుల్లో జోగులు మరణిస్తూ సీత నిర్దోషిత్వాన్ని వెల్లడిస్తాడు. సీతను వెదికేందుకు వెళ్లిన రాజా భూకంపంలో చిక్కుకోగా తన పెంపుడు కుక్క రాజాను రక్షిస్తుంది. చివరికి అంతా కలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో సహాయ పాత్రల్లో ఋష్యేంద్రమణి, యం.వి.రాజమ్మ, పుష్పవల్లి, గీతాంజలి, పద్మనాభం, మహంకాళి వెంకయ్య, అల్లు రామలింగయ్య, బేబీ ఫరీదా నటించారు.
విశ్వనాథ సమ్మోహనం..
ఈ సినిమాకు విశ్వనాథన్− రామ్మూర్తి సంగీతం అందించారు. పేరు ఇద్దరిదే అయినా స్వర రచనలో మాత్రం విశ్వనాథన్‌దే ప్రధాన భూమిక. ఆయన హార్మోనియం మీద పాటను కంపోజ్ చేస్తుంటే రామ్మూర్తి ఫిడేలుతో విశ్వనాథన్‌కు సరి జో(తో)డుగా ఉండేవారు. తెలుగు, తమిళ వర్షన్లలో కొన్ని పాటలకు రెండు వైవిధ్యమైన ట్యూనులు సమకూర్చడం కూడా విశ్వనాథన్ ప్రత్యేకత. ఈ సినిమాలో తమిళంతోపాటు ఎన్టీఆర్‌కు కూడా అన్నిపాటలూ పి.బి.శ్రీనివాసే పాడారు. శ్రీనివాస్ పాడిన ‘కనులు పలకరించెను పెదవులు పులకరించెను బుగ్గలపై లేతలేత సిగ్గులు చిగురించెను’ పాటను శంకరాభరణ రాగంలో స్వరపరిచారు. పాట చిత్రీకరణ కర్ణాటకలోని హొగేనికల్ జలపాతం వద్ద జరిగింది. అందుకు అనుగుణంగా సినారె ‘అందమైన ఆ జలపాతం ఆలపించె తీయని రాగం.. కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం’ అంటూ రాశారు. అభేరి రాగంలో వినిపించే ‘పిలిచే నా మదిలో వలపే నీదే సుమా.. రారాజు ఎవరైనా నారాజు నీవే సుమా’ పాట అటు హ్యాపీగా ఇటు పాథోస్‌గా వస్తుంది. ఈ పాటలో దేవిక ‘అనార్కలి’గా చక్కగా నర్తించి నటించింది. ప్రేమను ఏ విఘాతాలు ఆపలేవని అర్థం వచ్చేలా ‘చుక్కలే తెగిపోనీ సూర్యుడే దిగిô¦నీ.. ఈ ప్రేమ మారదులే ఈ జ్యోతి ఆరదులే.. ఎన్ని జన్మలకైనా ఈ బంధముండునులే’ అంటూ ముక్తాయించారు. ఇక అందరూ మెచ్చే గీతం ఆత్రేయ రాయగా శ్రీనివాస్ అద్భుతంగా పాడిన ‘బుజ్జిబుజ్జి పాపాయీ బుల్లి బుల్లి పాపాయీ.. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే’ పాట. తెలుగు, తమిళంలో కూడా ఈ పాటకు ఒకటే ట్యూను. ‘పూవంటి మనసులో ముళ్లున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా.. నమ్ముకున్న నావాళ్లు నాకిదే నేర్పారూ, పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా’ వంటి మాటలు ఆత్రేయ ముద్రను గుర్తుచేస్తాయి. సినిమా మొదట్లోనే వచ్చే సినారె గీతం ‘ఆహా అందము చిందే హృదయకమలం అందుకొనే రాజొకడే.. వేల తారకల బృందములోనా వెలిగే చందురుడొకడే’ కేవలం ఒక నాట్యగీతమే కాకుండా హీరోపట్ల హీరోయిన్ తన ప్రేమను సూచన ప్రాయంగా వ్యక్తపరిచే సందర్భోచిత ప్రణయ గీతం కూడా. ఆత్రేయ రాసిన మనసు పాట ‘తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా.. మనసు కొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా’ను విశ్వనాథన్ శోకరసానికి ప్రతీకైన శుభాపంతువళి రాగంలో మట్లు కట్టారు. ‘ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడూ.. ఆడుకున్న పరవాలేదూ పగులగొట్టి పోతారెందుకు’ అని రాసిన ఆత్రేయకు మాత్రమే అలతి అలతి పదాలతో అనంతార్థాన్ని చూపగల సత్తా ఉందనిపిస్తుంది. సుశీల పాడిన ‘నిత్య సుమంగళి నీవమ్మా నీకు అమంగళమేదమ్మా.. ప్రేమకు మృత్యువు లేదమ్మా పెట్టినబొట్టూ పోదమ్మా’ పాట దేవికను రాజా బహిష్కరించి వెలుపలకు పంపించినప్పుడు వస్తుంది. ఇది కూడా ఆత్రేయ రచనే. ఇక సినారె కలం పండించిన ‘వస్తాడే వస్తాడే వన్నె కృష్ణుడూ.. తెస్తాడే తెస్తాడే తేనెజల్లులూ’, ‘కాలిమువ్వలు ఘల్లుఘల్లుమనె ఎందుకో’, ‘ఓరచూపులో ఏముందో దోరనవ్వులో ఏముందో’ పాటలు కూడా ఆకట్టుకునేవే. ప్రేమానురాగాలతో నిండిన ఒక ఆదర్శవంతమైన సినిమాగా పేరుతెచ్చుకున్న సినిమా ‘ఆడబ్రతుకు’.
సినిమా నేపథ్యం...
జెమినీ చిత్రనిర్మాణ సంస్థకు ఘనమైన చరిత్ర ఉంది. ఆ సంస్థ అధిపతి సుబ్రమణియం శ్రీనివాసన్ (యస్.యస్.వాసన్)కు అంతకంటే ఘనచరిత్రే ఉంది. తండ్రి మరణించాక తంజావూరు జిల్లా నుంచి మద్రాసుకు చేరుకొని, చదువుకు స్వస్తి చెప్పి వ్యాపార రంగంలో అడుగు పెట్టాడు. 1928లో మూతపడిన ‘ఆనంద బోధిని’ అనే పత్రికను సొంతం చేసుకొని ‘ఆనంద వికటన్’/ళి పేరుతో ఆ పత్రికకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టారు. 88 ఏళ్లుగా ఆ పత్రిక గౌరవప్రదంగా నడుస్తోంది. 1936లో చిత్రనిర్మాణ రంగంలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంగా సొంత నవల ‘సతిలీలావతి’ని సినిమాగా మలిచారు. తర్వాత ‘మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ కంబైన్స్’ అనే ఫిలిం స్టూడియోను కొనుగోలు చేసి దానికి ‘జెమిని’ అని నామకరణం చేశారు. ఈ సంస్థ ద్వారా పలు తమిళ, తెలుగు, హిందీ సినిమాలను నిర్మించి ఖ్యాతి గడించారు. జెమినీ ఫిలిం సర్కూ¬్యట్ వారు తెలుగులో నిర్మించిన మొదటి చిత్రం ‘జీవన్ముక్తి’ (1942). తరువాత తెలుగులో వరుసగా ‘బాలనాగమ్మ’, ‘అపూర్వ సహోదరులు’, ‘మంగళ’, ‘ముగ్గురు కొడుకులు’, ‘చిన్నమ్మకథ’, ‘రాజీ నా ప్రాణం’ వంటి సినిమాలు ఎన్నో నిర్మించారు. చిత్రరంగానికి ‘పరిశ్రమ’ గుర్తింపు తెచ్చిన తొలి రాజ్యసభ సభ్యుడిగా వాసన్‌కు పేరుంది. జెమినీ స్టూడియోలో వేపత్తూర్ కిట్టు అనే తమిళ జర్నలిస్టు వారి సినిమాలకు స్క్రీన్‌ప్లే సమకూరుస్తూ ఉండేవాడు. అతడు వాసన్‌కు అత్యంత సన్నిహితుడు. జెమినీ సినిమాలకు దర్శకత్వం వహించే టి.జి.రాఘవాచారి (ఆచార్య) కూడా అతనికి మిత్రుడే. ‘చంద్రలేఖ’, ‘మోటార్ సుందరం పిళ్లై’ వంటి సినిమాలకు అతడే కథా రచయిత. అతడు ఇంగ్లిషు నవలలు ఎక్కువగా చదివేవాడు. ఒకసారి ఇంగ్లిషులోకి అనువదించిన ఒక ఫ్రెంచ్ నవలను చదివి కథ అల్లాడు. ఆ కథనే హిందీలో ‘జిందగీ’ పేరుతో తొలుత సినిమాగా తీశారు. 1964లో విడుదలైన ఆ సినిమాకు రామానందసాగర్ దర్శకత్వం వహిచంగా, శంకర్− జైకిషన్ సంగీతం సమకూర్చారు. రాజేంద్రకుమార్, రాజ్‌కుమార్, పృథ్వీరాజ్Ëకపూర్, వైజయంతిమాల ప్రధాన భూమికలు నిర్వహించారు. ఆ సినిమా విజయవంతంగా ఆడింది. అదే సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించాలని వాసన్ నిర్ణయించి వేపత్తూర్ కిట్టు చేత కథను ప్రాంతీయ భాషకు అనుగుణంగా అల్లించారు. అదే తెలుగులో ‘ఆడబ్రతుకు’గా, తమిళంలో ‘మళఘై పడుగు’గా రూపుదిద్దుకుంది. తెలుగులో ఎన్టీఆర్, కాంతారావు పాత్రల్ని తమిళంలో జెమినీ గణేష్, ముత్తురామన్ పోషించగా, యస్వీరంగారావు, దేవిక తమ పాత్రల్ని రెండు భాషల్లోను పోషించారు. ‘దేవదాసు’ వంటి ప్రతిష్టాత్మక సినిమాకు దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య తెలుగు వర్షనుకు, యం.సి.శ్రీనివాసన్ (హాలీవుడ్ శ్రీనివాసన్) తమిళ వర్షనుకు నిర్దేశకత్వం వహించారు.
సినిమా విశేషాలు..
ఆడబ్రతుకు సినిమా రెండు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకోగా పది కేంద్రాల్లో వందరోజులు ఆడింది. తమిళంలో కూడా ఈ సినిమా సూపర్ హిట్టే! దేవిక (అసలు పేరు ప్రమీల)కు జెమినీ సంస్థలో నటించడం ఇదే ప్రథమం. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన దేవికకు ఈ రెండు భాషల్లోనే కాకుండా మలయాళంలో కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. హిందీలో రాజ్‌కుమార్ ధరించిన పాత్రను కాంతారావు ధరించారు. ఇది ప్రేక్షకుల సానుభూతిని పొందే ఒక భగ్న ప్రేమికుని ఉదాత్తమైన పాత్ర. ఈ చిత్రనిర్మాణానికి ఐదులక్షలు ఖర్చయింది. హిందీ ‘జిందగీ’ మాతృకకు ఎక్కువ మార్పులు చేయకుండా పాటలు, నృత్యాలతో సహా యథాతథంగా అనుకరిస్తూ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో పాటలను కణ్నదాసన్ రాయగా తెలుగులో వాటిని ఆత్రేయ, సినారె రాశారు. ఆత్రేయ ఆ సినిమాకు రాసిన పాటలు అలరించాయి. కవిసామ్రాట్ విశ్వనాథ వారి సమక్షంలో సినిమా శతదినోత్సవాన్ని విజయవాడలో నిర్వహించారు. ‘ఆడబ్రతుకు’ విడుదలయిన ఈ సంవత్సరం ఎన్టీఆర్ నటించిన 12 సినిమాలు కూడా యాభై రోజులకు పైగా ఆడగా, ఎనిమిది చిత్రాలు శతదినోత్సవం జరుపుకోవడం, ‘పాండవ వనవాసము’, ‘ఆడబ్రతుకు’ చిత్రాలు రజతోత్సవం జరుపుకోవడం విశేషం. విశ్వనాథన్− రామ్మూర్తిలు కలిసి సంగీత దర్శకత్వం నిర్వహించిన ఆఖరి సినిమాగా కూడా ‘ఆడబ్రతుకు’నే చెప్పుకోవాలి.
- ఆచారం షణ్ముఖాచారి
No comments:
Post a Comment