జగదేకవీరుడు అతిలోకసుందరి


---సేకరణ 

మద్రాసులోని వాహిని స్టూడియోలోని ఎనిమిదో ఫ్లోరుకు ఒక చరిత్ర ఉంది, విజయా స్టూడియోస్ వాళ్ళు భారీ చిత్రాలకు సెట్టింగులు వేయటానికి వీలుగా నిర్మించిన అతిపెద్ద ఫ్లోర్ అది. 'ప్రేమ్ నగర్' వంటి చిత్రాలకు ఆ ఎనిమిదవ ఫ్లోరులోనే సెట్టింగులు వేశారు. ఒక రోజు ఉదయం ఆరు గంటల సమయంలో విజయా వాహిని స్టూడియోస్ యజమాని బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారు స్టూడియో ముందు నడిచి వెళ్తున్నారు. చాలా కాలం తర్వాత ఆ ఫ్లోర్లో హడావుడిని గమనించి ఆ సెట్టింగులు చూశారు, వెంటనే తనను కలవాల్సిందిగా అశ్వనీదత్తుకు కబురు పంపారు. అంత పెద్ద నిర్మాత నుంచి కబురు రాగానే దత్తు వెంటనే బయల్దేరి వెళ్ళారు. ఖర్చులో ఏ మాత్రం రాజీ పడకుండా అంత అందమైన, భారీ సెట్టింగులు వేయించి, సినిమా తీస్తున్నందుకు దత్తును అభినందించారు. తను ఎలాగూ కాళీగా ఉన్నానని, దత్తుకు అభ్యంతరం లేకపోతే ఈ సెట్టింగుల్లో షూటింగ్ జరిగినన్ని రోజులు ఆ పనులన్నీ సూపర్వైజ్ చేస్తానని నాగిరెడ్డి స్వయంగా కోరారు. అంత పెద్ద నిర్మాత అలా కోరటం తమ సంస్థకే లభించిన ఒక పెద్ద గౌరవంగా అశ్వనీదత్ భావించి అందుకు సరేనన్నారు.

ఎస్ !!

అది "జగదేకవీరుడు అతిలోకసుందరి" ..
తెలుగింటి 'దత్త'పుత్రిక !!
తెలుగు తెరపై 'దర్శకేంద్రుడు' చేసిన 'ఇంద్రజా'లం,
తెలుగు నేలపై 'చిరంజీవి'గా నిలిచిపోయిన చిత్ర'రాజం'

ఈ చిత్ర విశేషాల్లోకి వెళితే ...

ఒక ఆలోచన నుంచి ఒక పిట్ట కథ వచ్చింది - శ్రీనివాస చక్రవర్తి అనే ఒక కథకుడికి. దానిని ఒక కాయితం మీద పెట్టి వదిలేసుంటే ఒక చిన్న కథ అయ్యుండేది ... ఇంకొన్ని ఊహల్ని జోడించి ఒక చిన్న కథగా మార్చి ఉంటే బహుశా అది 'చందమామ' కథల పుస్తకంలో రెండు పుటల చిన్నపిల్లల కథ అయ్యుండేదేమో ! కానీ అదే పిట్టకథ ఒక అనుభవజ్ఞుడి దృష్టికి వచ్చింది.. అక్కడ నుంచి మరి కొందరు కథకుల మేధస్సుకు ఒక పరీక్షగా మారింది..వారి ప్రతిభాపాటవాలతో అది ఒక చక్కని కథగా మారింది..మరింత సానబెట్టటంతో అది ఒక సినిమా స్క్రిప్టుగా రూపందాల్చింది.. అది ఒక ఇంద్రజాలికుడి చేతిలో పడింది.. ఆ ఇంద్రజాలికుడు దానిని తెలుగుతెరపై ఆవిష్కరిస్తే ఒక వెండితెర కావ్యం అయింది..

ఆ పిట్టకథ ఆలోచన వచ్చింది శ్రీనివాస్ చక్రవర్తికే అయినా దానిని ఏ స్థాయికి తీసుకెళ్ళచ్చో ఊహించిన అనుభవజ్ఞుడు అశ్వనీదత్. దానికి కథా రూపం ఇవ్వటంలో ప్రముఖ పాత్ర పోషించిన మరికొందరు కథకులు యండమూరి, సత్యానంద్, సత్యమూర్తి, జంధ్యాల ఇంకొందరు రచయితలు - వీరితో పాటు కథా చర్చల్లో కూర్చుని తనకు తోచిన సలహాలు ఇచ్చిన చిరంజీవి..

నాగార్జున 'అగ్ని', చిరంజీవి 'రుద్రనేత్ర', వెంకటేష్ 'ఒంటరి పోరాటం' - వరుసగా మూడు ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకుడు అంటే పెదవి విరిచిన వాళ్లూ లేకపోలేదు. కానీ ఆ సోషియో ఫాంటసీ కథను తెర మీద చూపించగల ఏకైక దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రమే అని నిర్మాతకు; ఈ సినిమాకు ముందు అయిన రాఘవేంద్రరావు మూడు ఫ్లాపుల్లో తన సినిమా ఒకటి ఉన్నా కూడా ఈ కథకు ఆయన తప్ప వేరెవరూ న్యాయం చేయలేరని చిరంజీవి నమ్మకం - ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మరపురాని కావ్యంగా నిలిచిపోవటానికి కారణం అయింది.

ఇళయరాజా సమకూర్చిన ఏడు పాటలు - ఒక ఎత్తైతే
ఆ పాటలకు తన పదాలతో వేటూరి చేసిన గారడీ - మరో ఎత్తు..
తన కెమెరాతో విన్సెన్ట్ చేసిన మాయాజాలం,
తన 'కళ'తో బీ చలం సృష్టించిన భూతల స్వర్గం ...

ఈ సినిమా ...

అది 1990 మే 9, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను, హోరున గాలి, వర్షం - పాల సరఫరా లేదు, రవాణా సౌకర్యం లేదు, ప్రజా జీవితం మొత్తం స్తంభించిపోయింది. అయినా కూడా ప్రేక్షకులు ఈ సినిమా విడుదలయిన థియేటర్ల దగ్గర గొడుగులు వేసుకుని ప్రింట్ల కోసం పడిగాపులు కాశారు. అశ్వనీదత్ కార్యదక్షతకు ఆ తుఫాను నాటి ఉదయం 'అందాలలో నవోదయం' అయింది. చెన్నపట్టణం నుంచి విజయవాడ దాకా రైల్లో వచ్చి వర్షాల కారణంగా ఆగిపోయిన బాక్సులు, అక్కడి నుంచి లారీల్లో ప్రయాణించి మరీ తెలుగు ప్రేక్షకులను 'ప్రియతమా...' అంటూ పలకరించాయి. అంతే - ఆ రోజు ప్రారంభమైన ఆ సినిమా ప్రభంజనం మూడు దశాబ్దాల తర్వాత కూడా విడుదల తేదీని జ్ఞాపకముంచుకునేలాగా తెలుగువారి మనసుల్లో నిలిచిపోయింది. ఈ సినిమా విడుదల అయిన ప్రతి ప్రింటూ వంద రోజులు ఆడింది, రెండొందల రోజులు ఆడిన సెంటర్లు కోకొల్లలు, వాటిలో ఒకటి విజయవాడ అప్సర థియేటర్. సంవత్సరం పాటు విశాఖపట్నం జిల్లాలో ఒక చోట ఆడింది. అలా ఈ సినిమా కొల్లగొట్టిన రికార్డులెన్నో - గ్రాఫిక్స్, యానిమేషన్, గ్రీన్ స్క్రీన్ అంటూ రకరకాల టెక్నాలజీలు ఏవీ లేని రోజుల్లో చేసిన సెల్యులాయిడ్ వండర్ ఈ సినిమా. చిరంజీవి గారు ఒక సందర్భంలో "ఈ సినిమా విజయం పని చేసిన ప్రతి ఒక్కరి సమష్టి కృషి, ఏ ఒక్కరికో ఆపాదించటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు" అన్నారు ... అలా ఈ సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికనిపుణులు ప్రతీ ఒక్కరు జగదేకవీరులే - అందుకే ముప్పై సంవత్సరాలైనా నేటికీ ఈ సినిమాను మర్చిపోలేకపోతున్నాం.

ఈ సినిమా గురించి ఎంత రాసినా అది కేవలం ఉపోద్ఘాతమే అవుతుంది !

నలుగురు అనాధ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండే టూరిస్ట్ గైడ్ రాజులా, ఊర్లో సారా కొట్టు పెట్టటానికి అడ్డంగా ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీయించే దుండగులను శిక్షించటానికి తానే ఆంజనేయస్వామి అవతారంలో; దేవకన్యను డ్రామా కంపెనీ అమ్మాయి అనుకుని, ఆమె గ్రాంధిక బాషను చూసి మతిస్థిమితం లేని అమ్మాయి అనుకుని 'టింగరబుచ్చి'గా నామకరణం చేసి హాస్యాన్ని పండించటంలో; మహాద్రష్ట నుంచి ఇంద్రజను కాపాడాటానికి చేసిన సాహసాలు, ఇంద్రజను దేవకన్య అని తెలుసుకున్న సందర్భంలో ఒకింత ఆశ్చర్యాన్ని, మనసులో ఇంద్రజ పట్ల ప్రేమని, తెలియని ఆరాధనాభావాన్ని, అప్పటి వరకు ఇంద్రజ పట్ల తన ప్రవర్తనకు పశ్చాత్తాపాన్ని ఒకే సారి కేవలం తన కళ్ళతో ప్రదర్శించిన మెగాస్టార్ అసమాన నటనకు తెలుగు ప్రేక్షకలోకం - " జై చిరంజీవా ... జగదేకవీరా" అని హారతులు పట్టింది.

అందాల నటి శ్రీదేవి - తన నడక నుంచి నటన దాకా, పలుకు నుంచి పరుగు దాకా - ప్రతి ఒక్క విషయంలో నిజంగా దేవకన్య అంటే ఇలాగే ఉంటుందా అనిపించేలా తన పాత్రలో జీవించి, ఇంద్రజ పాత్రకు ప్రాణం పోసింది. అప్పటికే అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ భారతదేశంలో తనకంటూ ఎంతో గొప్ప పేరు సాధించుకున్న శ్రీదేవి నిజంగా ఈ సినిమాకు బలం - తాను కాకపోతే ఈ సినిమా పేరులోని 'అతిలోకసుందరి'కి సార్ధకత వచ్చేది కాదు. ఇంద్రుడి కూతురిగా దేవకన్యలా, ప్యాంటు షర్టులో సాధారణ అమ్మాయిలా, స్కూలు యూనిఫారంలో చిన్న పిల్లలా - శ్రీదేవిని, శ్రీదేవి నటనను మరిచిపోలేని తెలుగు ప్రేక్షకులు ఉండరు అనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కానీ .. ఈ సందర్భంలో తన సొంత గూటికే చేరుకున్న 'అతిలోకసుందరి' మన మధ్యలో లేకపోవడం మాత్రం అత్యంత బాధాకరం..

ప్రతినాయకుడు అమ్రిష్ పురి - అప్పటికే 'వైజయంతీ మూవీస్' బ్యానర్, రాఘవేంద్ర రావు కలయికలో 'ఆఖరి పోరాటం' సినిమా చేశారు.. ఈ కాంబినేషన్లో రెండో సినిమా ఇది. అమ్రిష్ పురి బిజీ షెడ్యూల్ దృష్ట్యా కేవలం నాలుగు రోజుల కాల్షీట్ల కోసం అమ్రిష్ పురిని సంప్రదించారు. కథ, అందులో తన పాత్ర గురించి విన్న అమ్రిష్ పురి ఎనిమిది రోజుల కాల్షీట్లు ఇచ్చారు. తన సొంత గొంతుకతో డబ్బింగ్ చెప్పుకోవటం కోసం ఒకో సారి వేరే సినిమాల షూటింగ్ అయిపోగానే బాంబే నుంచి చెన్నైకు ప్రయాణమై వచ్చి అదే రోజు తిరిగి వెళ్ళేవారు. తమ సొంత గొంతుకలతో కన్నడ ప్రభాకర్, తమిళ జనకరాజ్ .. చిన్న పాత్రల్లో అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, అనంత్, సంగీత, రామిరెడ్డి, తనికెళ్ళ భరణి - ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు. అందుకే ఈ సినిమా కలకాలం చరిత్రలో నిలిచిపోయింది, ఎప్పటికీ నిలిచిపోతుంది.

అశ్వనీదత్ తన ప్రతి సినిమాలో పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.ఒక్కో పాటకు పదుల సంఖ్యలో పదాలు రాయించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి, నేపధ్యం గురించి చెప్పగానే ఇళయరాజా ఒకటే మాట అన్నారు - "ఈ సినిమాలో అన్నీ డ్యూయెట్లే ఉండాలి అని అడగకండి - దీనిని ఒక కావ్యంగా తయారు చేద్దాం" అని. ఇచ్చిన మాట ప్రకారమే ఈ సినిమాకు సంగీతం అందించారు. అదే సంవత్సరం ఈ చిత్రానికి అందించిన పాటలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'నంది' అవార్డు కూడా వచ్చింది.

ఒక్క మాటలో ఇంద్రధనుస్సులో రంగులు ఏడు ..
ఈ సినిమాలోని పాటలు ఏడు !!

చిరంజీవి ఇమేజ్ కోసం ప్రతి సినిమాలో ఉండి తీరాల్సిన మొదటి పాట, చిరంజీవి ఇళయరాజా కాంబినేషన్లో ఆల్ టైం బెస్ట్ 'ప్రియతమా..', శ్రీదేవి అందాలను పొగిడే 'యమహా నీ యమా యమా అందం', చిరంజీవిని కాపాడమని చిరంజీవులు వేడుకునే 'జై చిరంజీవా ... జగదేకవీరా', మానససరోవర 'అందాలలో నవోదయం' ... ఏదని మర్చిపోగలం ??

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో ...

ఒక అద్భుతమైన సినిమా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా జనం గుర్తుపెట్టుకుంటే, ఆ సందర్భంగా సాధారణంగా అయితే చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేయాలి ... కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ప్రతీ ఇంటి 'దత్త' పుత్రికగా నిలిచిన ఈ చిత్రాన్ని అందించిన నిర్మాతకు, దర్శకుడికి, నటీనటులకు, రచయితలకు, సంగీత దర్శకుడికి, ఎడిటర్, కెమెరా మ్యాన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రతీ ఒక్కరికి ... తెలుగు సినిమా అభిమానులు కృతజ్ఞతలు తెలియజేయాలి.. ...

Thanks to the entire unit of the classic 'Jagadekaveerudu Athilokasundari' on behalf of Punaadiraallu ...

#30YearsforJVAS #ThankyouAshwaniDutt #ThankyouKRaghavendraRao #ThankyouMegastar

- రావూరి

No comments:

Post a Comment