వెన్నెల్లో గోదారి పార్ట్ #4

పదో తరగతి పాసయ్యాక నేను చిన్న ఉద్యోగంలో చేరాను. ఒక కార్ల కంపెనీ ఫిట్టర్ గా! అమ్మకు అది ఇష్టంలేదు. కానీ నేనన్నాను. "ఈ చదువులు చదవటానికి పగలంతా కాలేజీ, సాయంత్రాలు స్నేహితులు, రాత్రిళ్ళు సినిమాలు అనవసరం అమ్మా! చివరి రెండూ వదిలేస్తే, రోజుకి రెండు గంటలు చాలు" అని. అమ్మ కళ్ళల్లో ఎంత దాచినా దాగని సంతోషం కనపడింది. బహుశా తన పట్టుదహాల జీవితం పట్లవున్న కమాండ్ లో కొద్దిగానైనా  కొడుకులో కనపడుతున్నందుకేమో అమ్మదాచిన డబ్బాలో అప్పట్నుంచి నేను కూడా డబ్బు వేయడం ప్రారంభించాను. ప్రైవేటుగా చదువు కొనసాగించాను.
    
    నేను బి.కామ్. పాసయినరోజు ఇద్దరం కలసి దాన్ని ఓపెన్ చేసాం. ఆ ఆనందం చెప్తే అర్ధంకాదు. అనుభవించి తీరాల్సిందే. బ్యాంకులో వేసుకున్నా రాదు. ఇరవై సంవత్సరాల కృషి అది. అమ్మ ఒక్కొక్కటే లెక్క పెడుతూ వుంటే చూస్తూ కూర్చున్నాను. దాదాపు గంట పట్టింది. ఆ చిల్లరా, నోట్లు, పదులూ వందలూ అన్నీ లెక్కపెట్టేసరికి, మొత్తం పాతికవేల దాకా తేలింది.
    
    అప్పుడేడ్చింది అమ్మ....ఆనందంతో....చెప్పానుగా కొన్ని ఫీలింగ్స్ కి రీజనింగ్ వుండదని.
    
    ఆ పాతిక వేలతో ముగ్గురితో భాగస్వామిగా చేరి సెకండ్ హాండ్ కార్లు కొనడం- అమ్మటం షాప్ పెట్టాం. ఇందిరాగాంధీ పుణ్యమా అంటూ కారు ధరల్లో విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో మేము పట్టిందల్లా బంగారమయింది. అందులోనూ నాకు ఈ నరకంలో చిన్నప్పటినుంచీ అనుభవం వుండటం మేలు చేసింది. నాలుగు సంవత్సరాలు తిరిగేసరికల్లా నా ఎమ్.బి.ఎ పూర్తయింది. మరోవైపు ప్రమదా ఇండస్ట్రీస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది.
    
    అన్నట్టు మా అమ్మ పేరు మీకు చెప్పలేదు కదూ.
    
    ప్రమద్వర.
    
    ప్రతీ పురుషుడి విజయం వెనకా ఒక స్త్రీ వుంటుందంటారు. ఆ స్త్రీ ప్రేయసి అయితే విజయం యవ్వనం నుంచీ స్టార్టఉతుంది. తల్లయితే బాల్యం నుంచీ మొదలవుతుంది.
    
                                     * * *
    
    ఆ రోజు సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికి వస్తూంటే మధ్యలో కారు ట్రబులిచ్చింది. ఇల్లు దగ్గిరే అవటంతో నడిచి వచ్చేశాను. నా రాక వాళ్ళకి తెలీదు. ముందు హాల్లో కూర్చుని వున్నాడతను. అమ్మ అటు తిరిగి మాట్లాడుతుంది.
    
    అతడి గెడ్డం పెరిగివుంది. బుగ్గలు లోపలికి పోయాయి. నా మొదటి అనుమానం నా తండ్రి మీదకు వెళ్ళింది. కానీ అతడు తండ్రి కాదు. అతడు అంటున్నాడు-
    
    "నిన్న నువ్విచ్చిన పదివేలు చాలా సాయం చేశాయి పెద్దమ్మా ఇంకొక పదివేలియ్యి భైరవమూర్తి కివ్వాలి".
    
    కొంచెంసేపు  అతడు అడుగుతున్నది నాకు అర్ధంకాలేదు. భైరవమూర్తి అన్న పేరు నా ఆలోచన్లని స్థంభింపచేసింది.
    
    నా తండ్రి జైల్లో వుండి ఇతడిని పంపాడు అన్నది అర్ధమైంది. ఇన్నాళ్ళూ లేదనుకున్న పీడ తిరిగి మొదలైంది.
    
    పక్క కిటికీ ఊచల మధ్యనుంచి నా తల్లి మొహం అస్పష్టంగా కనిపిస్తూంది. ఆమె మొహం భావరహితంగా, ఒక తెల్ల కాగితంవలె వున్నది. వివాహం జరిగిన మరుక్షణం నుంచీ బాధలు పెట్టి, మొత్తం జీవితంలో నాల్గయిదుసార్లు కన్నా ఎక్కువ కలుసుకోకుండా, కలుసుకున్న ప్రతీసారీ డబ్బుక్సోం బాధపెట్టే అతనిమీద ఆమెకి గౌరవంగానీ, ప్రేమగానీ ఏముంటాయి? కానీ ఇంతవరకూ జరిగింది వేరు. తాగుడుకోసం భార్యను పీడించటం సామాన్యవిషయం కానీ జైలునుంచే ఎవడో చెమ్చాగాడిని పంపించటం సహించలేని విషయం! ఇలాంటి రాయబారాలు ఇంకోసారి తేకుండా వాడికి బుద్ది చెప్పటం కోసం అడుగు లోపలికి వెయ్యబోతూ వుంటే తిరిగి వాడి కంఠం వినిపించింది.
    
    "ఇవ్వక తప్పదు పెద్దమ్మా నీ కొడుకు భైరవమూర్తికి పుట్టినోడుకాదు, నీ మొగుడి రక్తం ఆడిలో ప్రవహించటంలేదు- అని ఎవరికీ చెప్పకుండా వుండాలంటే పదివేలు ఇయ్యాల్సిందే-"
    
    భూమి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. తలుపు రెక్క పట్టుకుని నిలదొక్కుకున్నాను. నా తల్లి, నన్ను పెంచి పెద్దచేసిన మాతృమూర్తి... ఆమె జీవితం వెనుక నీడలు పరిహసిస్తున్నట్టు కనిపించాయి. వికృతంగా నవ్వుతున్నట్టు కనిపించాయి. ఒక నల్లటి మేఘం నన్ను కమ్మేస్తున్నట్టు కదిలిపోయాను.
    
    ముందుకురికి "అమ్మా-ఏమిటిది? వీడు చెపుతున్నది నిజమేనా?" అని నిలదీద్దామని అనిపించింది. కానీ ఏదో తెలియని వివేకం నన్ను వెన్ను తట్టి ఆపుచేసింది.... ఆమె నా తల్లి!!
    
    "నా దగ్గిర డబ్బులేదు. నేనివ్వలేను" అంటూంది అమ్మ.
    
    అతడు లేచాడు. "-ఆలోచించుకో పెద్దమ్మా రేపీ వేళకే వస్తాను. నువ్వు డబ్బు ఇవ్వలేదనుకో, నీ కొడుకు ఇప్పుడు పెద్ద పొజిషన్లో వున్నాడు. ఆడు జైల్లో వున్నోడి కొడుకు అని బైటపెపంచానికి తెలియటం అంత బాగోదు. ఆ తరువాత కొన్ని రోజులకి- ఈడసలు ఆడి కొడుకు కాదు, మెళ్ళో మంగళసూత్రం కట్టినోడు మాత్రమే మా భైరవమూర్తి! కడుపు నింపినోడు ఇంకోడు ఏరే వున్నాడు. కడుపుతో వున్నదాన్ని జాలిపడి మా భైరవమూర్తి చేసుకున్నాడని ఇంకో ఫీలరు వదుల్తాను. దానికి పల్లెపల్లెంతా వచ్చి సాక్షమిస్తది. నువ్వంటే పారిపోయి వచ్చావుగానీ, గోదారి పక్కన ఆ పల్లె అట్లాగే వుందిగా ఆళ్ళ అందరికీ నీ సంగతి తెలుసు. ఆళ్ళకి నువ్విక్కడున్నావని తెలిస్తే అప్పుడు నీ గతి ఎట్టా వుంటదో ఆలోచించుకో- ఈ రహస్యం నాకూ, భైరవమూర్తికి తప్ప ఇంకెవరికీ తెలీదు. నన్ను మంచి చేసుకున్నావా ఇంకసలు బైటపడదు. ఎల్లొస్తా- మళ్ళీ రేపొస్తా డబ్బు రెడీగా వుంచు-"
    
    నేను పక్కకి తప్పుకున్నాను. వాడు ఛాతీ విరుచుకుంటూ వెళ్ళిపోయాడు. లోపల అమ్మ చిత్తరువులా నిలబడి వుంది. రక్తం ఇంకిపోయిన మొహంతో పాలరాయిలా.
    
    వాడిని కాస్త బయటికి వెళ్ళనిచ్చి, నేనూ మెట్లు దిగాను. వాడు గేటుదాటి వెళ్తున్నాడు. క్రింద మెకానిక్ వచ్చి నిలబడి వున్నాడు. కారు తాళాలు అందించి, "బాగైంది సార్" అన్నాడు.
    
    కారు తీసుకొని బయటకొచ్చాను. వాడిని రెండుసందులు నడవనిచ్చి వెనకనుంచి కారు పక్కగా తీసుకెళ్ళి ఆపుచేశాను.
    
    "కారెక్కు".
    
    "ఎవర్నువ్వు?"
    
    "కారెక్కు చెపుతాను!"
    
    "ఎవరంటే చెప్పవేం?"
    
    కారు దిగి, చుట్టూ తిరిగి, వాడి దగ్గిరగా వెళ్ళి ఫ్రంట్ డోర్ తీసి పట్టుకుని "ఎక్కు చెపుతాను" అన్నాను.
    
    "ఎందుకో చెప్తేగానీ ఎక్కను. ఎవరు నువ్వు?"
    
    పిడికిలి బిగించి వాడి గెడ్డం పక్కకి తిరిగిపోయేలా కొట్టాను. కార్లు రిపేర్లు చేసిన చేతులవి. వాడి తల వెళ్ళి కారుకు కొట్టుకుంది. వీధిలో వెళ్ళేవాళ్ళు ఆశ్చర్యంగా ఆగి చూశారు. బుద్దుడు పుట్టిన దేశంలోని ప్రజలు సాధారణంగా ఎవరి గొడవల్లోనూ జోక్యం చేసుకోరు. పక్కన మర్డర్లు జరుగుతున్నా పట్టించుకోరు.

వాడ్ని కాలరు పట్టుకుని లేపి కార్లో కూలేసి, నా సీట్లో కూర్చుని తాపీగా డ్రైవ్ చేయటం మొదలు పెట్టాను.
    
    "ఏమిటి దౌర్జన్యం" అని వాడు గింజుకుంటున్నాడు. వాడి నోట్లోంచి రక్తం కారుతూంది.
    
    కారు ఊరి చివరికి తీసుకెళ్ళి నిర్మానుష్యమైన తోపులమధ్య ఆపుచేశాను. కార్లోంచి వాడిని క్రిందికి దిగమన్నాను.
    
    "నిండు బజార్లో నిన్ను కొట్టడం బట్టి నా మనస్తత్వం నీకు అర్ధమై వుంటుంది. నా కెక్కువ టైమ్ లేదు. మొత్తం నీకు తెలిసినదంతా చెప్పు-"
    
    "ఏం చెప్పాలి? ఎవర్నువ్వు?"    

    "నువ్విప్పుడు బ్లాక్ మెయిల్ చెయ్యటానికి వచ్చావే. ఆవిడ కొడుకుని".  

    "ఓహో దాని కొడుకువా".    
    
    ఈసారి కొట్టిన దెబ్బ చెంప ఎముక్కి కాస్త క్రింద తగిలింది. రక్తంతో తడిసిన రెండు తెల్లటి దంతాలు వూడిపడ్డాయి.
    
    "చెప్పు, భైరవమూర్తికి నీకూ ఏమిటి సంబంధం? నా తండ్రి ఎవరు?"    
    "నే చెప్పను. అంతేకాదు. మీ తల్లీ, కొడుకుల సంగతి పెపంచమంతా చాటుతాను".
    
    నేను కారు వెనక్కి వెళ్ళి డిక్కీ తీశాను. నేనటు వెళ్ళటం చూసి వాడు పరుగెత్తబోయి, దాన్ని ముందే వూహించైనా నేను కాలు అడ్డు పెట్టటంతో ముందు బోర్లాపడ్డాడు. కార్లోంచి డబ్బాతీసి పెట్రోలు వాడిమీద పోశాను.
    
    "మా అమ్మలాగా నాకు సహనం- ఓర్పు-భయం-ఇవేమీ లేవు. నిముషం టైమిస్తున్నాను. మొత్తం నీకూ, నీ గురువుకీ తెలిసినదంతా చెప్పాలి.
    
    వాడిని పూర్తిగా పెట్రోలుతో తడిపి, జేబులోంచి లైటర్ తీశాను. గట్టిగా అరవబోయిన వాడి నోటిని బూటకాలు మూసింది.
    
    "ప్రపంచమంతా చాటుతానన్నావుగా అరుస్తావేం? ఎలా చాటుతావో చాటు. ముందు నిన్ను చంపుతాను. తరువాత జైల్లో వాడిని చంపుతాను. చాలు, ఈ రహస్యం ఇక బైటకి రాదు". లైటర్ టప్ మన్న శబ్దంతో వెలిగింది.
    
    ముందుకు వంగాను. పెట్రోలు గాలికి మంట మరింత ప్రకాశవంతమైంది.
    
    "చెప్తాను, నన్ను చంపకు" అరిచాడు.
    
    లైటార్పి, లేచి నిలబడుతూ, "చెప్పు" అన్నాను.
    
    "నువ్వు భైరవమూర్తి కొడుకువి కావు. నీ తల్లి మెళ్ళో మంగళసూత్రం మాత్రం ఆడు కట్టాడు. నీ తండ్రి ఏరే ఉన్నాడు. ఆడు నీ తల్లిని మోసం చేస్తే మా గురువు పాపం కదా అని ఏలుకున్నాడు".
    
    "ఇదంతా నీ కెవరు చెప్పారు?"
    
    "జైల్లో మా గురువే".
    
    "పద, ఆడి దగ్గర కెళ్దాం".    
    
    "ఆడింకెక్కడున్నాడు? సచ్చి పదిరోజులైంది".    

    నేను నిటారుగా అయ్యాను. భైరవమూర్తి చచ్చి పోయాడు. నా తల్లి భర్త చనిపోయాడు.
    
    నాలో మారుతున్న భావాలు పట్టించుకోకుండా వాడు చెప్పుకుపోతున్నాడు. "సచ్చేముందు నన్ను దగ్గిరకు పిల్చి ఆడు చెప్పాడు. 'ఇంకో వారం రోజుల్లో బైట కెళ్తున్నావు. నీకేమైనా డబ్బు అవసరం కావొల్సివస్తే నా పెళ్ళాన్నడుగు. మంచి పొజిషన్ లో వుంది. దాని కొడుకు రహస్యం నీకు తెలుసునని చెప్పు చాలు, డబ్బిచ్చేస్తుంది' అన్నాడు. పాపం సచ్చేముందు కూడా శిష్యుడిని గుర్తుంచుకున్నాడు".
    
    వాడిని మెడ పట్టుకుని పైకి లేపాను.
    
    "నే నెవరి కొడుకుని?"
    
    "నాకు తెల్వదు".
    
    "తెలుసు. ఈ విషయం కూడా అతడు నీకు చెప్పే వుంటాడు. చెప్పు, నా తల్లిని మోసం చేసిందెవరు?"
    
    "సత్తె పెమాణికంగా చెప్తున్నాను. 'పేరు చెప్తే చాలు డబ్బిచ్చేస్తాది' అని చెప్పాడు. మిగతా వివరాలు ఆడికి కూడా తెలియవని నా నమ్మకం. నీ తండ్రెక్కడున్నాడో ఆడిక్కూడా తెలీదు".
    
    పెదవులు బిగించి కటువుగా అడిగాను. "ఏం పేరు చెప్పాడు?"
    
    ..........
    
    "పెళ్ళికి ముందు నా తల్లిని మోసం చేసినవాడి పేరు ఏమని చెప్పాడు వాడు?" అరుపుకి సరుగుడు చెట్లు కదిలిపోయాయి.
    
    "అయినంపూడి ఆనందరావు".    
                                          6
    
    భూమి, గాలి, చెట్లు నా తల్లిని మోసం చేసినవాడి పేరు వున్నాయి. రేపు వాడి చావుకి అవే సాక్ష్యాలుగా మిగుల్తాయి.
    
    ఆ పేరు నాల్గయిదుసార్లు మనసులో మననం చేసుకున్నాను. అయినంపూడి ఆనందరావు.
    
    ఎదురుగా నిలబడ్డ మనిషిలోంచి పెట్రోలు వాసనగాలితో పాటు వస్తూంది. నోట్లోంచి రక్తం ఇంకా కారుతూంది. వాడు పూర్తిగా బెదిరిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఇక వాడి గురించి ఏ ప్రమాదమూ వుండనట్టే తోస్తూంది.
    
    "ఈ పేరు నీకు తప్ప ఇంకెవరికీ తెలీదు కదూ?"
    
    "తెలీదు".
    
    "చెపుతావా?"
    
    "చెప్పను".
    
    "మళ్ళీ మా ఇంటివైపు వస్తావా?"
    
    "రాను".
    
    "నా తల్లిని కలుసుకోవటానికి ప్రయత్నిస్తావా?"
    
    "లేదు. అసలు ఈ వూళ్ళో వుండను. వెళ్ళిపోతాను".  

    "వెళ్ళు మళ్ళీ ఇంకొకసారి నిన్ను చూసానంటే, ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పావా లేదా నై అడగను. పెట్రోలుతోకూడా కాల్చను. ఒకే పోటు...గుండెల్లో-అర్ధమైందా?"
    
    వాడు తలూపాడు.
    
    "వేళ్ళు, నేను మనస్సు మార్చుకునేలోపులో పరుగెత్తు".
    
    వాడు వెనుదిరిగాడు.
    
    "ఇంకొక విషయం! భైరవమూర్తి చనిపోయినట్టు నా తల్లికి తెలియటానికి వీల్లేదు".
    
    ... వాడు తలూపి, పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
    
    కార్లో కూర్చున్నాను. వెంటనే స్టార్ట్ చెయ్యలేదు. అప్పటి వరకూ వున్న మూడ్ పోయి నిస్సత్తువ ఆవరించింది. ణ ఆతల్లి ఎందుకింత ఆవేదన చెందుతూందో అర్ధమైంది. ఇన్నాళ్ళ గతం తనని నీడలా భయపెడుతూ వచ్చిందన్న సంగతి, ఆమె పట్ల కోపాన్నీ, అయిష్టాన్నీ కలుగచెయ్యలేదు. ఈ ప్రపంచంలో స్త్రీ నష్టపోవటం అనేది మొగవాడి మోసానికి ప్రతీక మాత్రమే. ఇన్నాళ్ళూ ఇన్ని అగ్నిపర్వతాల్ని మనసులో దాచుకుని ఒక కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడిన ఆ స్త్రీ, నాకు తల్లి కాకపోయినా ఈ కథ తెలిశాక నాకు ఆమెపై కోపం రాదు. నా కోపం అంతా అతడి మీదే.

అయినంపూడి ఆనందరావు! అతడెక్కడున్నాడో పట్టుకుంటాను. ప్రపంచంలో ఎక్కడున్నాసరే.
    
    ఇప్పుడిక భైరవమూర్తి మరణం సంగతి వెల్లడి చెయ్యాలా వద్దా అన్నది ప్రశ్న ఎందుకు ఆమెకు చెప్పటం? మొత్తం జీవితంలో పది, పన్నెండుసార్లు కలుసుకుని, కలుసుకున్నప్పుడల్లా డబ్బుకోసం వేధించి, ఇప్పుడామె జీవితం నుంచి నిష్క్రమించిన ఆ వ్యక్తికి, తాను వెళ్ళిపోతూ, నా తల్లి నుదుట కుంకుమ, గాజులు తీసుకెళ్ళే హక్కు ఏముంది? అమ్మ సుమంగళిగానే మరణిస్తుంది. బ్లాక్ మెయిల్ చెయ్యటానికి అతడింకా రాలేదేమిటా అని కొంతకాలం ఆశ్చర్యపోయినా, క్రమంగా మర్చిపోతుంది.... పోనీ, అంతకన్నా కావల్సింది ఏముంది? నా ఆలోచన కరెక్టు అనిపించింది.
    
    నాతల్లి భర్త మరణ విషయం ఆమెకి చెప్పదల్చుకోలేదు. నా తండ్రెవరో తెలిసిన మరుక్షణం నుంచి మాత్రం అనుక్షణం అతడిని మానసికంగా చంపుతాను.
    
    ఆ ఆలోచన వచ్చాక మనసు కొంత సర్దుకుంది.
    
    కారు స్టార్టు చేసి, ఇంటికి వచ్చేశాను. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. చీకటిపడినా ఇంట్లో లైట్లు లేవు. అమ్మ లాగే కూర్చుని వుంది. లైటు వేసి, అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన వాడిలాగా, "ఏమిటమ్మా అలా కూర్చున్నావు?" అని అడిగాను. దీర్ఘమైన ఆలోచనలోంచి బెదిరినట్టు ఆమె ఉలిక్కిపడి "ఏం లేదురా" అంది.
    
    "చాలా పెద్ద ఆక్సిడెంట్ అమ్మా వస్తూంటే చూశాను. వాడెవడో బాగా తాగి వున్నాడు. రోడ్డు కడ్డంగా వచ్చి బస్సు క్రింద పడ్డాడు".
    
    "పాపం ఎవడ్రా?"
    
    "గెడ్డం బాగా పెరిగి వుంది.  ఎర్రచొక్కా వేసుకున్నాడు. ఎవడో జైలుపక్షి అట. పోలీసులు అనుకుంటున్నారు".
    
    అమ్మ మొహం తెల్లగా పాలిపోయింది. కానీ ఏదో తెలియని రిలీఫ్ లాటి భావం ఆమెలో కనిపించింది. చాలు-
    
                                      * * *
    
    వరంగల్ కి, గోదావరికి మధ్య నున్న ప్రదేశంలో ఒక చిన్న పేపర్ మిల్లుని ప్రమదా ఇండస్ట్రీస్ తరఫున కొన్నాము. కాని సంవత్సరం అయింది. కానీ, కొన్న సంవత్సరం నుంచీ అక్కడ గొడవలే. రెండు నెలల కొకసారి లక్షల ఖరీదుచేసే వెదురు దొంగతనంగా రాత్రిళ్ళు  ఎవరో కాల్చేస్తున్నారు. లేబర్ స్ట్రయికు ఒకవైపు మేనేజర్ని హత్యచేశారు. మనుష్యులకి దూరంగా అడవిలో, ప్రతి నిముషమూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాలి అక్కడ. మా వాళ్ళెవరూ అక్కడికి మానేజరుగా వెళ్ళటానికి ఇష్టపడటంలేదు. అక్కడి గొడవలు తగ్గేవరకూ ఏదో ఒక సాకు పెట్టుకుని ఆగిపోయే ఆలోచనలో వున్నారు.
    
    కొత్తవాళ్ళని తీసుకుని కొందర్ని అక్కడికి పంపాలన్న ఆలోచన వుంది. దానికోసం ఇంటర్వ్యూలకి పిలిచాము.
    
    ఆ అప్లికేషన్స్ చూస్తూంటే మతిపోయింది. నాలుగు ఉద్యోగాలకి దాదాపు రెండువేల అప్లికేషన్స్ వచ్చాయి. అందరూ బాగా చదువుకున్నవారే నా తల్లి నన్నిలా తీర్చిదిద్దకపోతే నేను కూడా వారిలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు చదువులో గడిపి, ఎవరుద్యోగమిస్తారా అని అప్లికేషన్లు పూర్తిచేస్తూ గడిపి వుండేవాణ్ణి.
    
    "మీరు వస్తారా సార్ ఇంటర్వ్యూకి?" మానేజర్ వచ్చి అడిగాడు.
    
    "ఎంతమంది మిగిలారు?"
    
    "రిటెన్ టెస్ట్ లో వందమంది దాకా తేలారు సార్. అందులో ఇరవై మందిని ఫైనలైజ్ చేశాము."
    
    "సరే....ఇంతకీ ఎప్పుడు ఇంటర్వ్యూ?"
    
    "ఇంకో గంటలో".
    
    "కృష్ణమూర్తిని చెయ్యమను. మధ్యలో నేను వచ్చి చేస్తాను" అన్నాను. కృష్ణమూర్తి పార్టనరు.
    
    మానేజర్ వెళ్ళిపోయాడు. నేను మరికొంతసేపు పనులు చూసుకుని వెళ్ళేసరికి అప్పటికే సగంమంది ఇంటర్వ్యూలైపోయాయి. ఒక కుర్చీ లాక్కొని కూర్చున్నాను.

    "అర్జెంటైనా ముఖ్య పట్టణం ఏమిటి- హిమాలయాలెక్కుతూ జారిపడి చచ్చిన మొదటి కొరియా యువకుడి పేరేమిటి"-లాటి నాన్సెన్సికల్ ప్రశ్నలు వేస్తున్నాడు కృష్ణమూర్తి మా కార్లకి బ్రేక్ లైనెర్లు సప్లయ్ చేసే మరొక కంపెనీ డైరెక్టరు రికమెండ్ చేసిన ఒకతనికి ఈ ఉద్యోగం ముందుగానే రిజర్వ్ అయిపోయి వుండటంతో ఈ తతంగమంతా కళ్ళనీళ్ళు తుడవటానికే. నేను మౌనంగా కాగితాలు చేతిలోకి తీసుకుని పరిశీలిస్తూ కూర్చున్నాను. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ లిస్టు అది. దానికే అప్లికేషన్లు జతపర్చి వున్నాయి.
    
    ఒకచోట నా చూపు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఒక యువకుడి ఫోటో దానికి అతికించి వుంది. అదికాదు నేను చూస్తూంది. ఆ పేరు,
    
    ఎ. ప్రబంధ్,
    
    s/o అయినంపూడి ఆనందరావు.
    
    నా చేతులు వణకసాగాయి, చప్పున కుర్చీలోంచి లేచి నిల్చున్నాను. కృష్ణమూర్తి ప్రశ్నలాపి నావైపు చూశాడు. నేను పట్టించుకోలేదు. ఆ లిస్టు పట్టుకుని అలాగే బయటికి వచ్చాను. మానేజర్ ఒకరొకర్నే లోపలికి పంపుతున్నాడు.
    
    నా జీవితంలో నేనెప్పుడూ అంత ఉద్వేగం పొందలేదు. వెదక పోయిన తీగ కాలికి తగిలినట్టు అనిపించింది. "ఇతను.... ఇతని ఇంటర్వ్యూ అయిపోయిందా?"
    
    "అయిపోయింది సార్. ఇప్పుడే వెళ్ళిపోయాడు" మానేజర్ అతడి నెంబరు చూసి చెప్పాడు. కొద్దిగా నిరాశ ఆవరించినా పూర్తిగా నిస్పృహ చెందలేదు. అతడి అడ్రసు అప్లికేషన్ లో వుంది.
    
    నిముషం తరువాత కారులో ఉన్నాను.
    
    ఆ అడ్రసు పట్టుకుని ఇల్లు వెదకటం అరగంట పట్టింది. అయితే నేను అనుకున్నట్టు అది ఇల్లు కాదు. ఒక ఇంట్లో ఈ ప్రబంధ్ అనే అతను ముందు గదిలో వుంటున్నాడు.
    
    నేను వెళ్ళేసరికి అతడు బ్రీఫ్ కేసు పట్టుకొని మెట్లు దిగుతున్నాడు.
    
    అయినంపూడి ఆనందరావులు ఇద్దరు లేని పక్షంలో ఇతడు నా తమ్ముడు "ఎవరు కావాలి మీకు?"
    
    అతడి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, "ప్రమదా ఇండస్ట్రీస్ పార్టనర్ ని నేను" అన్నాను. అతడి మోహంలో వెంటనే మార్పొచ్చింది. "ఏం కావాలి సార్" అన్నాడు.
    
    "ఎక్కడికి ప్రయాణం?"
    
    "ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడే మీ ఆఫీసులో ఇంటర్వ్యూకొచ్చాను". "అవును తెలుసు".
    
    "ఇంటర్వ్యూ అవకపోతే రాత్రి ట్రెయిన్ కి వెళ్దామనుకున్నాను. తొందరగా అయిపోయింది. వెళ్తే ఈ ట్రెయిన్ కే వెళ్ళొచ్చు".
    
    "కార్లో వస్తే దింపుతాను".    

    అతడి కళ్ళల్లో పూర్తిగా అయోమయం పోలేదు. అలాగే వచ్చి కూర్చున్నాడు. కారు కదిలింది.
 "ఏ వూరు మీది?"
    
    చెప్పాడు.
    
    "మీ నాన్నగారేం చేస్తూంటారు? ఆనందరావు కదూ ఆయన పేరు".    

    "అవును మీకు తెలుసా?"
    
    తెలుసని చెప్పనా? మహాత్మాగాంధీ అన్నట్టు మనందరిలోనూ ప్రవహించేది ఒకే రక్తం, మన ముగ్గురిలోనూ.
    
    తెలీదు. అప్లికేషన్ లో చూశాను. ఏం చేస్తూవుంటారాయన?" మామూలుగా అడిగినట్లు అడిగాను కారు నెమ్మదిగా పోనిస్తూ.
    
    "తరళా ఇండస్ట్రీస్ ప్రొప్రయిటరు".
    
    ఆశ్చర్యంగా చూసి, "మరెందుకు మా కంపెనీలో ఉద్యోగం?" అన్నాను. అతడు వెంటనే సమాధానం చెప్పకుండా ఆగి, తరువాత అన్నాడు- "కొంచెం అనుభవం వస్తుందని అదీగాక, నా కాళ్ళమీద నిలబడదామని".    

    గుడ్ అయినంపూడి ఆనందరావు రక్తంలో ఇండివిడ్యువాలిటీని వారసత్వానికిచ్చే లక్షణం ఉందన్నమాట.
    
    "తరళా ఇండస్ట్రీస్- పేరు గమ్మత్తుగా వుంది".
    
    "అమ్మ పేరు తరళ, అన్ని ఇండస్ట్రీసూ తన పేరుమీదే వున్నాయి".
    
    "మీ తాతగారివా?" మళ్ళీ క్యాజువల్ గా అడిగాను.
    
    "అవును".
    
    సో... తల్లిని ఆనందరావు ఎందుకు పెళ్ళాడలేదో అర్దమైంది. మామూలు ఎరని తినేశాక, వీలైతే మరొక మంచి ఆహారంవైపు వెళ్ళటం చేపకి అలవాటే కదా.
    
    నేను మౌనంగా డ్రయివు చెయ్యటం చూసి "మీరు...." అని అర్ధోక్తిగా ఆగాడు.
    
    "మా పేపర్ మిల్లులో అసిస్టెంట్ మానేజర్ ఉద్యోగానికి కదా మీరు అప్లయ్ చేసింది".
    
    "అవును".
    
    "మానేజర్ ఉద్యోగం ఇస్తాను. చేస్తారా? మరో అయిదొందలు ఎక్కువ వస్తుంది".
    
    అతడి కళ్ళల్లో విస్మయం కొట్టొచ్చినట్లు కనబడింది. "నాకా...." అన్నాడు.
    
    "అవును, మీరు ఎల్లెల్ బీ కదా?"
    
    అతడు తలూపి, "అది చదవడం కోసమే ఈ వూళ్ళో వున్నాను. శలవుల్లో సరదాగా అప్లయ్ చేశాను ఉద్యోగానికి" అన్నాడు.
    
    "అలా అని ఉద్యోగం కూడా సరదాగా చేయరు కదా".
    
    "సారీ నా ఉద్దేశ్యం అదికాదు".
    
    "చాలా రిస్క్ జాబ్ అది. ఆ ప్రాంతం అంత మంచిదికాదు. అక్కడి స్థానికుల్తో, లేబర్ తో ప్రతి క్షణమూ ప్రమాదమే. ఏ మాత్రం కోపం వచ్చినా మూకుమ్మడిగా వచ్చి ప్రాణాలు తీస్తారు".
    
    "అయినా సరే, చేస్తాను".
    
    "అడిగిన ఉద్యోగం కంటే పెద్దదిస్తున్నాను కాబట్టి మూడు సంవత్సరాలు బాండ్ వ్రాయవలసి ఉంటుంది".    

    "అభ్యంతరం లేదు".
    
    "అది కనుక్కుందామనే వచ్చాను. ఎంత తొందరగా జాయిన్ అవ్వగలరు?"
    
    "మూడ్రోజుల్లో వచ్చేస్తాను".
    
    "గుడ్" కాఉర్ స్టేషన్ ముందు ఆగింది. అతడు దిగి "థాంక్స్" అన్నాడు తలూపాను. అతడు వెంటనే వెళ్ళలేదు- "ఇంటర్వ్యూ అవగానే ఇలా స్వయంగా వచ్చి అడిగారంటే- నాకు చాలా సంతోషంగా వుంది. రికమెండేషన్స్ తో నిండి పోయిన ఈ ఇంటర్వ్యూల్లో మీరిలా స్వయంగారావటం- నిజంగా నాలో అంత క్వాలిఫికేషన్ ఏముందో నాకే తెలియటం లేదు. వెళ్ళొస్తాను. మూడ్రోజుల్లో వచ్చి కలుసుకుంటాను".
    
    అతడు వెళ్ళినవైపే చూస్తూ మనసులో అనుకున్నాను. 'చాలా పెద్ద క్వాలిఫికేషన్ వుంది ప్రబంధ్ నీకు! అదేమిటో త్వరలోనే తెలుస్తుంది!'
    
                                     * * *
    
    ఆఫీసుకి రాగానే మానేజర్ తో, ఫ్లయిట్ కు టిక్కెట్టు కొనమని చెప్పాను. కృష్ణమూర్తితో మానేజర్ నియామకం గురించి వివరించాను. అతడు ఆశ్చర్యపడ్డా అభ్యంతరం చెప్పలేదు. 'అంత నచ్చాడా నీకా కుర్రాడు' అని మాత్రం అన్నాడు.
    
    "కుర్రాడు కాదు. నా వయసే వుంటుంది అతడికి" నవ్వాను.
    
    "కొంపతీసి బంధువా ఏమిటి?"
    
    "అలాంటిదే కాని అతడికి తెలీదు".
    
    "తెలుసంటే రికమెండేషన్ తెచ్చేవాడే".    

    ఈ లోపులో మానేజర్ వచ్చి టిక్కెట్టు ఓ.కే. అయినట్గ్టు చెప్పాడు. ఆ సాయంత్రం బయల్దేరి, గంటలో ఆ వూరు ప్రయాణం చేశాను. ఎయిర్ పోర్ట్ లో దిగ్గానే, డైరెక్టరీలో చూసి తరళా ఇండస్ట్రీస్ కి ఫోన్ చేశాను.
    
    "ఎవరు కావాలి" ఆపరేటర్ అడిగింది.
    
    "ఆనందరావు"
    
    "మీరెవరు?"
    
    "ఎ. సాయిచందర్".
    
    క్షణం తరువాత ఆనందరావు లైన్లోకి వచ్చాడు. అప్పటికే ఫోన్ పెట్టేశాను.
    
    ఎయిర్ పోర్ట్ నుంచి సరాసరి తరళా ఇండస్ట్రీస్ కి వెళ్ళాను. "ఆనందరావు గారున్నారా?" అని అడిగాను. "ఇప్పుడే వెళ్ళిపోయారండి" రిసెప్షనిస్టు అంది.   

    "ఎక్కడికి?"
    
    "ఇంటికి"
    
    "కొంచెం ఇంటి అడ్రసు ఇస్తారా?" అని అది తీసుకొని, ఇంటికి బయల్దేరాను.
    
    పెద్ద బంగ్లా అది గేటు కిటువైపు 'ఆనందరావు', అటువైపు స్థంభానికి 'తరళ' అన్న పేర్లు చౌకబారు టేస్టుని సూచిస్తున్నాయి. అతడి భార్య అనుకుంటా నలభై అయిదేళ్ళకు పైగా వుంటుంది. బైట తోటలో కూర్చుని టీ కలుపుతూంది.
    
    ఈ లోపులో అతడు లోపల్నుంచి తోటలోకి వచ్చాడు. లాల్చీ, పైజామాలో వున్నాడు. జుట్టు తెల్లగా వుంది. ఏ వ్యక్తి కోసం నేను వారం రోజులుగా- ఈ ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకోవాలని ఎంతగా తహ తహ లాడిపోయానో- ఆ వ్యక్తి.
    
    అయినంపూడి ఆనందరావులు ఇద్దరున్నారేమో అన్న అనుమానం నా మనసులో ఏ మూలో వుండేది. అతడిని చూడగానే పోయిందది.
    
    ఆ జుట్టుకి కాస్త రంగేసి మా ఇద్దర్నీ పక్క పక్కన నిలబడితే కవలలనుకుంటారు. అతడి కొడుకుని నేను, సందేహంలేదు.
    
    చాలాసేపు వాళ్ళనే చూస్తూ వుండిపోయాను. ఆమె ఏదో అంటూంది. అతడు నవ్వుతూ చెబుతున్నాడు. ఆ అమ్మాయి కూడా నవ్వుతూంది.
    
    మా ఇంటిలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యం కనపడదు. బరువు బాధ్యతలు, ఒక నిర్దుష్టమైన గమ్యం, మా తల్లీ కొడుకుల్ని ఇలాటి ఆనందాలకీ, సంతోషాలకీ దూరం చేశాయి. మా మొహాల్నుంచి చిరునవ్వుని శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు నాకు వందగజాల దూరంలో తన స్వంత సంసారంతో సుఖం అనుభవిస్తున్నాడు.
 నేను వెంటనే మా వూరు వెళ్ళిపోలేదు. అక్కడే నాలుగు రోజులు వున్నాను. ఒక్కక్షణం వృధా చేయలేదు. ఆనందరావు గురించి మొత్తం అన్ని వివరాలు సేకరించాను. నేను అనుకున్నది నిజమే. వివాహం కాకముందు అతడు చాలా బీదవాడు. పల్లెటూళ్ళో వుండేవాడు. తరళని వివాహం చేసుకున్నాక వ్యాపారం విస్తీర్ణం చేశాడు. అతడికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు కొడుకు ప్రబంధ్. కూతుళ్ళు ఇంకా చిన్న వాళ్ళు. ఆ ఇంట్లో తరళ చాలా డామినేటింగ్. కాస్త పిచ్చి కూడా వున్నట్టు అనుమానం. ఆమె ఏమంటే అది ఆ ఇంట్లో చెల్లాల్సిందే!
    
    ఇవీ నేను సేకరించిన విషయాలు!
    
    ముందు ఆ తరళనుంచి ప్రారంభించదల్చుకున్నాను. ఆ సంసారాన్ని విచ్చిన్నం చేయటం నా లక్ష్యం ఆ కుటుంబంలో ప్రతీ ఒక్కరూమనస్సులోనే కుమిలి కుమిలి చావాలి.
    
    నా యీ నిర్ణయం మీకు నామీద అసహ్యాన్నీ, కోపాన్నీ కలిగిస్తే క్షమించాలి. తినటానికి తిండిలేక, తండ్రి ఎవరో తెలియక- రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతూ, అర్ధరాత్రి ప్రక్కనుంచి అమ్మ నిశ్శబ్దపు రోదనలు వింటూ పెరిగిన ఒక యువకుడికి ఇంతకన్నా తక్కువ కోపం, కసి వుంటే, అతడిలో ఏదో లోపం వుందన్నమాట.
    
                                      * * *
    
    ప్రబంధ్ వెళ్ళి వరంగల్ దగ్గిర మిల్లులో జాయినయ్యాడు. అక్కడ గొడవలు మరీ ఎక్కువయ్యాయి. దిన దిన గండంలా వుంది పరిస్థితి. ఇంకొక టైమ్ లో అయితే ఆ వుద్యోగం వదిలేసి ఎవరైనా వెళ్ళిపోక తప్పదు. కానీ ప్రబంధ్ నుంచి ముందే అగ్రిమెంటు తీసుకున్నాను. ఆ విధంగా అతడిని ఇరికించి వేశాను. అతడు పంపించిన ఏ ప్రపోజలూ ఇక్కడ నుంచి వప్పుకోలేదు. కార్మికుల సమస్య రోజు రోజుకీ ఎక్కువై ఉద్రిక్తంగా వుంది. అక్కడ ఏ క్షణమైనా ఫ్యాక్టరీ కాల్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక రకంగా అదే మంచిదికూడా ఈ తలనొప్పులన్నీ పోయి, ఇన్సూరెన్సు వస్తుంది.
    
    ఆనందరాఉ కొడుకుని ఈ విపత్కర పరిస్థితుల మధ్య ప్రతిష్టాపించిన తరువాత, రెండో విక్టిమ్ కోసం చూశాను. ఆమె తరళ..
    
    దాని తాలూకు ప్లాన్ కూడా అనుకోకుండా వచ్చేసింది.
    
    వికలాంగుల సంక్షేమ కార్యక్రమానికి వెళ్ళాను ఒకరోజు. సహాయం కోసం నాటకం వేశారు.
    
    అప్పుడు చూశానా అమ్మాయిని! పేరు రాణి అట! పదహారు సంవత్సరాల కన్నా ఎక్కువ వుండదు వయసు. అద్భుతంగా నటించింది. మొత్తం థియేటర్ అంతా ముగ్ధులై చూశారు. అప్పుడే ఆ ప్లాన్ నాకు తోచింది.
    
    ఆ అమ్మాయి ఇల్లు కనుక్కుని మరుసటిరోజు వెళ్ళాను.
    
    మామూలు పరిచయాలయ్యాక అడిగాను. "ఎంతిస్తారు నీకు ఒక్కొక్క ప్రదర్శనకి?"
    
    "నాలుగొందల రూపాయలు..."
    
    "ఎన్నాళ్ళు చేయవలసి వుంటుంది రిహార్సల్సు...?"
    
    "వారం రోజులు".    

    "నాతో పాటు ఒక నాటకం ఆడితే నీకు పదివేల రూపాయలు ఇస్తాను".
    
    ఆ అమ్మాయి అనుమానంగా చూసింది. నేను నవ్వి "నాకేమీ దురుద్దేశ్యంలేదు. నాకు చెల్లెలుగా నటించాలంతే" అన్నాను.
    
    "నా కర్ధం కావటం లేదు".
    
    మొత్తం అంతా వివరించి చెప్పాను. అయితే అందులో నా తల్లికి జరిగిన అన్యాయం వగైరా విషయాలు చేర్చలేదు. కేవలం ఆనందరావు అనే వ్యక్తిని ఎలా మానసికంగా కంగారు పెట్టాలో,  ఆ విషయాలే చెప్పాను.
    
    ఆమె ఉత్సాహంగా వప్పుకుంది. ఎక్కువ ప్రశ్నలు కూడా వేయలేదు. నాకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ గా ఫీలయింది. "ఎప్పటినుంచి ప్రారంభిద్దాం?" అని అడిగింది.
    
    "రెండు మూడు రోజుల్లో... నీతో పాటు ఎవర్నైనా తీసుకొచ్చేట్టయితే తీసుకురా-"
    
    "అవసరం లేదు".
    
    ఆ అమ్మాయిలో నాకు నచ్చిన గుణం ఏమిటంటే- తనకి అవసరమైనవి తప్ప మిగతా వివరాలు ఒక్కటి కూడా అడగలేదు. తనకి వప్పచెప్పిన బాధ్యత నిర్వర్తిస్తుందని నాకెందుకో అనిపించింది.
    
    అయిదువేలు అడ్వాన్సు ఇచ్చాను.
    
    "ఒక బ్రోతల్ హౌస్ లో నిన్ను పట్టుకుంటారు. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. ఆ పోలీస్ స్టేషన్ లో వున్న ఇన్ స్పెక్టర్ నాకు బాగా స్నేహితుడు. నువ్వు ఈ ఆనందరావు ఫోటో చూపిస్తే చాలు, ఆ వార్త ఆనందరావుకి చేరుతుంది. తనకి తెలియని ఈ కూతురెవరా అని కంగారు పడతాడు. ఈ విషయం అతడి భార్యకి తెలిసే ఏర్పాటు నేను చేస్తాను".
    
    "ఒకవేళ నన్ను చూడటానికి పోలీస్ స్టేషన్ కి వస్తే?"
    
    "నీకు నచ్చిన కథ ఏదో ఒకటి చెప్పు. నీ తల్లి పేరు మాత్రం ప్రమద్వర అని చెప్పు. ఆ పేరు చెప్పగానే అతడి మొహంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మాత్రం గమనించు. ఆ పేరు చెప్పినా కూడా అతడు పట్టించుకోకపోతే ఇక ఆ సంగతి వదిలెయ్యి. నిన్ను నేను వెంటనే విడిపిస్తాను".
    
    "రైడింగ్ కేసులో పట్టుబడి పోలీస్ స్టేషన్ లో వుండటం చాలా రిస్కు". "నీకు రెండొందల గజాల దూరంలో రాత్రంతా నేను వుంటాను. నువ్వేమాత్రం భయపడకు ఆనందరావు అడిగిన ప్రశ్నలన్నిటికీ మాత్రం తడుముకోకుండా జవాబు చెప్పు".
    
    నేను వెళ్ళబోతూంటే ఆ అమ్మాయి అడిగింది- "మీరేమీ అనుకోనంటే ఒక ప్రశ్న - ప్రమద్వర ఎవరు?"
    
    "నా తల్లి".
    
                                          7
    
    తరువాత మేము అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. ఆనందరావు ప్రమద్వర ఎవరో తనకు తెలియనట్లుగా నటిస్తాడనుకున్నాను కానీ, అతడు రాణిని తనతోపాటు తీసుకువెళ్ళటం ఆశ్చర్యమనిపించింది.
    
    అతడిని పోలీస్ స్టేషన్ నుంచి ఫాలో అయ్యాను.
    
    రాణిని హోటల్ కి తీసుకెళ్ళి గది బుక్ చేశాడు. ఖరీదైన హోటల్ నా ఆశ్చర్యం ఎక్కువైంది. అనుమానం కూడా పెరిగింది. ఈ సాక్ష్యాన్ని మాయం చేయటానికి ప్రయత్నిస్తున్నాడా ఆనందరావు?
    
    అతడు రాణితో కలిసి రూమ్ చేరుకునే సమయానికి నేను వరండాలో ఎదురు చూస్తున్నాను. ఆమెని దిగ పెట్టి అతడు వెళ్ళి పోగానే గదిలోకి వెళ్ళాను. నన్ను చూసి నవ్వింది.
"ఏమంటున్నాడు" అడిగాను.
    
    "మీ అన్నయ్య ఎక్కడున్నాడు? అని పదే పదే అడిగాడు" అంది.
    
    "ఏం చెప్పావు?"
    
    "నాకు అన్నయ్యలు ఎవరూ లేరని అన్నాను".
    
    "కంగారు పడ్డాడా?"
    
    "ఆఁ చాలా".
    
    అంటే- నాతల్లికి మొగపిల్లవాడు పుట్టిన సంగతి కూడా అతడికి తెలుసన్నమాట. నా ఆలోచన్లు గ్రహించినట్లు రాణి అంది- "అతడికి మీ పేరు కూడా తెలుసు".
    
    ఉలిక్కిపడి- "నాపేరు తెలుసా?" అన్నాను.
    
    "అవును గోపీచంద్ ఎక్కడ అని అడిగాడు".
    
    అంటే-మోసం చేశాక కూడా కొంతకాలంపాటు నా తల్లి గురించి అతడు వాకబు చేస్తూనే వున్నాడన్నమాట. నేనేదో అనబోయాను. అంతలో తలుపు చప్పుడయింది. ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. నేను చప్పున టాయ్ లెట్ లోకి వెళ్ళాను. రాణి వెళ్ళి తలుపు తీసింది.
    
    లోపలికి వచ్చింది ఆనందరావు భార్య!
    
    తలుపు సందులోంచి చూస్తున్న నేను ఆశ్చర్యపోయాను. అంత అర్ధరాత్రి భర్తని ఫాలో చేస్తూ తరళ అలా హోటల్ లోకి ప్రవేశిస్తుందని నేను అనుకోలేదు.
    
    ఇది మేము వూహించని మలుపు.
        
    "ఎ... ఎవరు కావాలి?" రాణి భయం నటిస్తూ అంది.
    
    "నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను" అంది ఆనందరావు భార్య నాకు నవ్వొచ్చింది రాణీ కూడా నవ్వుకుంటూ ఉండి ఉండాలి.
    
    "నీ పేరేమిటి?" తరళ అడుగుతుంది.
    
    "శ్రీదేవి".
    
    "మీ అమ్మపేరు?"
    
    "ఇందిర".
    
    ....
    
    ....
    
    "మీ నాన్నగారేం చేస్తూ వుంటారు?"
    
    "తరళా ఫెర్టిలైజర్సులో ఇన్ స్పెక్టరు".    
    "మీ అమ్మగారు?"
    
    "స్కూల్లో టీచరు"
    
    "మరి నువ్వీ వూరు ఎలా వచ్చావు? బ్రోతల్ కంపెనీలో ఎలా చేరావు?"
    
    రాణి ఏడవటం ప్రారంభించింది. చాలా అద్భుతంగా నటిస్తూంది.
    
    రాణి ఒక్కొక్క మాట బుల్లెట్లా పేలుతూంది.
    
    ఆ తరువాత రాణి చెప్పిన కథ నాకే ఎంతో ఇంటరెస్టింగ్ గా అనిపించింది. నెలకి నాలుగు రోజులు మాత్రమే తమతో వుంటున్నాడని అంది. తల్లి ఈ ఎడబాటు భరించలేక కిర్సనాయిలు పోసుకుని కాల్చుకోవాలను కుంటోందని చెప్పింది.
    
    తరళ అంటూంది- "ఇక నువ్వు పడుకో మీ నాన్నగారు ప్రొద్దున్నే వస్తారు. అంతేకాదు, ఈ ఇన్ స్పెక్షన్లు కూడా ఇక వుండవు. మీతోనే వుంటారు" అనేసి వెళ్ళిపోయింది.
    
    ఆమె గది బయట వెళ్ళగానే నేను లోపల్నుంచి వచ్చి "అద్భుతం" అన్నాను. "నేను వూహించిన దానికన్నా గొప్ప కథ అల్లావు. ఇక ఆనందరావుకి నరకం ప్రారంభమైనట్టే..."
    
    రాణి నవ్వింది.
    
    "ఇప్పుడే వస్తాను ఆవిడకి ఆఖరి షాక్ ఇచ్చి" అని క్రిందకి బయల్దేరి, ఆమె మెట్లుదిగే సమయానికి జీపుతో ఆమె ముందుకి వచ్చాను. నేను వూహించినట్లే ఆమె మొహంలో విస్మయం కనబడింది.
    
    "బాబూ-మీ నాన్నగారి పేరేమిటి?"
    
    ....
    
    "నా పేరు గోపీచంద్. అమ్మ పేరు భాగ్యేశ్వరి. మా అమ్మ అమెరికాలో వుంటుంది. చిన్నప్పుడే నాన్నగారు పోయారు".
    
    "ఆయన పేరు?"
    
    "అయినంపూడి ఆనందరావు".
    
    జీపు స్టార్ట్ చేశాను.
    
    వత్తి వెలిగింది. బాంబు పేలాలి. ఇంటికి వెళ్ళాక పేలుతుంది. తనతో కలిసి భర్తకి ముగ్గురు భార్యలున్నారని తెలిస్తే ఏ స్త్రీ వూరుకుంటుంది? తరళ లాటిది అసలు వూరుకోదు.
    
    ఈ రాత్రి వాళ్ళ జీవితాల్లో తుఫాను మొదలైంది. ఇక అది ఆ సంసార వృక్షాన్ని నిలువునా పెరికించిగానీ వదలదు. నిరాశ్రయుడైన ఆనందరావు దగ్గరికి అప్పుడు వెళ్ళాలి. నేను అడగదల్చుకున్నది ఒకే ప్రశ్న... నా తల్లి తరపున.
    
    కానీ ఇప్పుడే కాదు.
    
    ఇంకా అతడిని బిగించాలి.
    
    చదరంగంలో రెండో ఎత్తు ప్రారంభించాను.
    
   ప్రమద్వర చెప్పిన కథ
    

    ఎడారిలో ప్రయాణం చేసి చేసి అలసిపోయిన యాత్రికుడి నుదుటిమీద చెమట చారల్లా వృద్దాప్యం నా చర్మపు ముడతల్ని విస్తృతం చేస్తూంది. జీవన పోరాటంలో అలసిపోయిన మనిషిని కబళించటానికి నెమ్మది నెమ్మదిగా మృత్యువు ముందుకు రావటం తెలిసిపోతూ వుంది. డాక్టర్లు చెప్పనవసరం లేదు, నాకే తెలుస్తూంది.
    
    ఈ వెన్నెల రాత్రి నా కథంతా మీకు చెప్పాలని వుంది. ఈ కథంతా తెలిస్తే తరళ నన్ను క్షమించదు. ఆమెకు నేను ద్రోహం చేశానా అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. లేదు లేదని సమాధాన పర్చుకుంటాను. తప్పెవరిదయినా, విషయం తెలిస్తే మాత్రం తరళ నన్ను క్షమించదు.
    
    తానేం సాధించానని జీవితపు చివరి రోజుల్లో మనిషి తీరిగ్గా ఆలోచించు కోవటానికే 'వృద్దాప్యం' అనేదాన్ని దేముడు బహుశా సృష్టించి వుంటాడు. నాకు అసంతృప్తి ఏమీలేదు. గోపీచంద్ ని మనిషిగా తీర్చిదిద్దటం అనే సంతృప్తి చాలు. ప్రబంధ్ కన్నా ఒక మెట్టు పైనే గోపీని నిలబెట్టగలిగాను. పాతిక సంవత్సరాలు పట్టింది నేను అన్నమాట నెరవేర్చటానికి. అయినా ఈ విషయాలన్నీ తరళకి తెలుసా? ఆనందరావు చెప్పి వుంటాడా?
    
    అన్నట్టు ఈ రాత్రికి మీకు నా కథంతా చెపుతానన్నాను కదూ. ఎక్కణ్ణుంచి మొదలు పెట్టను?
    
    వెన్నెల పిండారబోసినట్టుంది. వెన్నెల్లో మీరెప్పుడైనా గోదావరిని చూశారా? గోదావరే అవసరంలేదు గంభీరంగా పారే ఏ నదినైనా చూడండి. తళతళలాడే కెరటాలు, మిలమిల మెరిసే నీరు, దూరంగా సాగిపోతున్న నావ....ఎంత అందంగా వుంటాయో అందుకే మా పల్లె అంటే నా కిష్టం పక్కనే గోదావరి వంగిన కొబ్బరి చెట్లు, అందమైన తోటలు, ఆనందరావు...
    
    ఆనంద్ తో నా పరిచయం గమ్మత్తుగా జరిగింది. మా పల్లెలో కిరాణాకొట్లు నాలుగైదుకన్నా ఎక్కువ లేవు. అందులో ఒక షాపువాడు మాత్రమే లాటరీ టిక్కెట్లు తెప్పించి అమ్మేవాడు. ఒకరోజు ఎందుకో నాకు టిక్కెట్టు కొనాలనిపించింది. అదే సమయానికి ఆనంద్ కూడా ఒక టిక్కెట్ ఇమ్మని అడిగాడు. ఆ రోజే ఆఖరు తేది. షాపువాడు ఒక్కటే టిక్కెట్టు వుందన్నాడు. ఎవరు తీసుకోవాలి అన్న మీమాంస వచ్చింది. ఇద్దరం చెరో అర్ధరూపాయి వేసి తీసుకున్నాం.

మాది చాలా చిన్న పల్లె. ఆ వూర్లో దాదాపు అందరూ నాకు తెలుసు. ఆనంద్ అప్పటికే పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే తనని చూడలేదు. తరువాత తెలిసింది మా నారాయణమ్మ కొడుకని.
    
    సరే టిక్కెట్టు ఎవరి దగ్గరుండాలి? అన్న ప్రశ్న వచ్చింది. నా దగ్గరే వుంచమన్నాడు. నేనెవర్నో అడిగి తెలుసుకున్నాడు. వచ్చేస్తుంటే వెనకనుంచి, "లాటరీలో డబ్బు వస్తే నన్ను మోసం చేయకూడదు సుమా" అని అరిచాడు, నాకు నవ్వూ కోపమూ వచ్చాయి.
    
    మరుసటిరోజు పేపర్లో చూస్తే మేము కొన్న టిక్కెట్టుకి లక్షరూపాయలు బహుమతి వచ్చినట్టు పడింది. చాలా సేపటి వరకూ నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఆనందం పట్టలేక అమ్మకి ఈ విషయం చెప్పాను. అమ్మ మావయ్యకి ఆ విషయం చెప్పింది. నేను చేసిన తప్పు అదే మావయ్య నా దగ్గిర నుంచి టిక్కెట్ లాక్కొన్నాడు. మరుసటిరోజే హైదరాబాదు వెళ్ళాడు- డబ్బు తీసుకురావటానికి మాకు లక్ష రూపాయలు వచ్చిన సంగతి ఊరంతా గుప్పుమంది. అందరూ అకస్మాత్తుగా మమ్మల్ని గౌరవంగా చూడటం ప్రారంభించారు.
    
    అప్పటివరకూ మాకు పల్లెలో గౌరవం లేదు. కారణం మా అమ్మ వేశ్య ప్రెసిడెంట్ గారి దగ్గిర్నుంచి కరణంగారి వరకూ అందరికీ మా యిల్లు ఒకప్పుడు విడిది. నాకు వూహ తెలిశాక కూడా వాళ్ళు వస్తూ వుండేవాళ్ళు నన్ను కూడా ఆ వృత్తిలోకి దింపాలని అమ్మకి బాగా కోరికగా వుండేది. కానీ నేను తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆ ఆలోచనలకి తాత్కాలికంగా శలవు చెప్పింది.
    
    నాకు ఏడుపొక్కటే తరువాయి.
    
    అమ్మకి బ్రతిమలాడుతున్నట్టు చెప్పాను- నేనూ అతడూ సగం సగం డబ్బులు వేసుకొని ఆ టిక్కెట్ కొన్నట్టు!- అందులో సగభాగం అతడికి ఇవ్వాలన్నట్టు!! అమ్మ మింగేసేలా చూసింది. "నీకేమైనా మతిపోయిందేమిటి? ఎవడో ముక్కూ మొహం తెలియని మనిషికి అప్పనంగా యాభైవేలు ఇస్తావా?" అని కసిరింది.
    
    "వాడి అర్ధరూపాయి గురించి ఎవరితోనైనా చెప్పినట్టు తెలియనీ- రౌడీల్తో వాడిని కొట్టివ్వకపోతే నాకు మారు పేరుపెట్టు" అని సవాలుచేసి మరీ వెళ్ళాడు మావయ్య.
    
    నాకేం చెయ్యాలో తోచలేదు. షాపు దగ్గిర టిక్కెట్టు కొంటూన్నప్పుడు అతడు నవ్వుతూ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అతడిని వెళ్ళి కలుసుకున్నాను. జరిగింది చెప్పి "మీరు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను. తప్పు నాదే. మీరెంతో నమ్మకంతో టిక్కెట్టు నా దగ్గిర వుంచితే నేనిలా చేశాను...." అన్నాను తలదించుకుని.
    
    "అర్ధరూపాయివ్వండి" అన్నాడు.
    
    అతడేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు.
    
    "నా అర్ధరూపాయి నాకిచ్చెయ్యండి ఋణం తీరిపోతుంది-" అన్నాడు అదే చిరునవ్వుతో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా తల్లి... మావయ్య.... ఇతడి ముందు ఎంత అల్పులో అర్ధమైంది. పరిస్థితి అతడు గమనించి నట్టున్నాడు. "దీని గురించి అసలు ఆలోచించవద్దు. మర్చిపోండి" అన్నాడు. అంత మంచితనాన్ని భరించలేకపోయాను.
    
    ఆ రాత్రి అమ్మతో గొడవ పెట్టుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా యాభైవేలు అతడికివ్వాలని రాద్దాంతం చేశాను. అమ్మ నామీద విరుచుకుపడింది. ఆమె అన్న మాటలు యధాతధంగా ఇవి- యాభైవేలు ఇచ్చేబదులు కన్నెరికం చేయించుకోరాదటే. అటు ఫలం దక్కుతుంది- ఇటు మాకు బాధా తప్పుతుంది! వయసులో వచ్చే రాబడి అంతా పోగొడ్తున్నావు గదే... కనీసం వాడితోనన్నా మొదలెట్టు".
    
    ఆ రాత్రి అమ్మ నిద్రపోయాక, నాలుగు బట్టలు సర్దుకుని అతడి దగ్గరకు వెళ్ళాను. ఇన్నేళ్ళ తరువాత తల్చుకుంటే అపుడంత ధైర్యం ఎలా వచ్చిందా అనిపిస్తుందిగానీ, ఆ రాత్రి నాకేమీ భయం వేయలేదు. ఒక మురికికూపం నుంచి బయట పడుతున్నాను అన్న సంతృప్తి మాత్రం కలిగింది.
    
    "పడవలో పట్నం వెళ్ళిపోతున్నాను ఆనందబాబూ! మరోసారి మిమ్మల్ని క్షమించమని అడగటానికి వచ్చాను. ఆ ఇరుకు మనుష్యుల మధ్య నేనుండలేను" అన్నాను.
    
    అతడు ఆశ్చర్యపోయాడు మొదట, తరువాత నచ్చచెప్పాడు. పాతిక సంవత్సరాల క్రితం అతడు అన్న మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. బంధుత్వాన్ని ఎప్పుడూ డబ్బుతో పరీక్ష పెట్టకండి ప్రమద్వరా! ఈ డబ్బు అనేది చాలా పాపిష్టిది. నీలి లిట్మస్ ను కూడా ఎర్రగా మారుస్తుంది. ఆత్మీయతని అడుక్కి తోసేస్తుంది అది. కొన్ని కొన్ని ఆత్మీయతల్ని పరీక్షల ప్రవాహానికి ఎదురు నిలపకపోతేనే మంచిది".
    
    "మీకు తెలీదు. ఆ ఇంట్లో నేను నేనుగా మిగలను".
    
    "రేపు పట్నం వెళ్ళినా మీరు మీరుగా మిగలరు". అన్నాడు అతడు మందలిస్తున్నట్టు "ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి".
    
    రాత్రయితే ఆవేశంలో అలా వెళ్ళిపోయాను గానీ, తెల్లవారేక నా ధైర్యాన్ని తల్చుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అతడన్న మాటల్లో నిజం అర్ధమైంది అతడే గానీ వారించకపోయి వుంటే ఈ పాటికి ఎక్కడ వుండేదాన్నో..... పట్నంలో ....ఏ ఇం....ట్లో...నో! నేనూ, నా కుటుంబ సభ్యులు కలిసి అతడిపట్ల చేసిన మోసానికి మాత్రం నా మనసు సిగ్గుపడుతూనే వుంది. రెండు రోజుల తఃరువాత మావయ్య మొహం వేలాడేసుకుని దిగాడు. పేపర్లో నెంబరు తప్పుపడింది. లాటరీ మాకు రాలేదు.
    
    పల్లె పల్లెంతా ఘొల్లుమంది.    

    నాకు మాత్రం ఎందుకో చెప్పలేనంత సంతోషం వేసింది.
    
    డబ్బు రానందుకు బాధకన్నా, నేను ఆనంద్ కి ఋణపడి లేనన్న సంగతి నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది. మా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పినందుకు దేముడికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాను.
    
    ఏదైతేనేం, ఆనంద్ బాబుతో అలా జరిగింది. నా మొదటి పరిచయం ఆ తరువాత మేము ఎక్కువసార్లు కలుసుకోలేదు. కానీ ప్రతి సాయంత్రమూ అతడు వ్యాహ్యాళికి మా ఇంటిముందు నుంచి వెళ్ళేవాడు. ఆ సమయానికి నేను చూసేదాన్ని నేను చూస్తున్నానని అతడికి తెలుసని నాకు తెలుసు. నిశ్శబ్దం మా ఇద్దరిమధ్యా రాయబారాన్ని నడిపేది. నేను అందమైనదాన్ని కాను. నా కళ్ళు మాట్లాడవు. అందుకే నిశ్శబ్దాన్ని ఆశ్రయించాను.
    
    ఆ నిశ్శబ్దాన్ని బ్రద్దలు కొట్టింది తరళ.
    
                                      *  *  *
    
    తరళ జి.పి.రావుగారి అమ్మాయి. మేమిద్దరం కలసి చదువుకున్నాం. తరళ నాలా కాదు, చాలా తేలిగ్గా తీసుకునేది ఏ విషయాన్నైనా పల్లెలో ఎవర్నీ లెక్కచేసేది కాదు. పల్లె కూడా తనంటే భయపడేది. పల్లెలో అందరి దగ్గరా ఎంత డబ్బుందో రావుగారి దగ్గర అంతుంది మరి.    
    తరళకి డబ్బున్నవాళ్ళు అమ్మాయిని అన్న గర్వం ఏమాత్రం లేదు. డబ్బే కాదు, తనకి దేముడు అందం కూడా ఇచ్చాడు. సన్నజాజి తీవెలా వుండేది. పోతే అల్లరెక్కువ. అందమైన అమ్మాయి అల్లరెంత చేసినా బాగానే వుంటుంది.
గోదావరిలో ఇద్దరం కాగితంతో పడవలు చేసి వదిలేవాళ్ళం. ఎవరి పడవ ఎక్కువదూరం వెళ్తే వాళ్ళు గెలిచినట్టు. నా పడవ ఎలా వుందో చూసే నెపంమీద తీఉస్కుని వేలితో రంధ్రం పెట్టేది. నాకు బాగా నవ్వొచ్చేది - నా దగ్గిర తను పశ్చాత్తాప్పడేటప్పుడు ఒక రోజు ప్రొద్దున్నే మా ఇంటికొచ్చింది తరళ. తను మా ఇంటికి రావటం నా కిష్టం వుండేది కాదు. ఈ పల్లెలో అమ్మ కెలాటి పేరుందో నాకు తెలుసు. మమ్మల్ని చూసి అందరూ ఎలా నవ్వుకుంటారో నేను గమనిస్తూనే వుంటాను. అలాటి ఇంటికి తరళ రావటం అంత బావోదు. కానీ చెప్పినా తను వినదు.
    
    "నిన్న రాత్రి ఒక గమ్మత్తు జరిగిందే" అంది వస్తూనే.
    
    "ఏమిటి" అని అడిగాను.
    
    "సాయంత్రం అయిదింటికి ఒకతను వచ్చాడు నాన్నగార్ని కలుసుకోవాలని ఏదో ఎరువుల ఏజెన్సీ అట. 'మీ డాడీకి వెయ్యి ఎకరాలున్నాయి. మా కంపెనీ ఎరువులు వాడి చూడండి' అన్నాడు. అతడు మాట్లాడే విధానాన్ని చూసి భలే నవ్వొచ్చిందిలే-"
    
    ఎరువుల కంపెనీ అనగానే నాకు అనుమానం వచ్చింది. ఈ వూరికి కొత్తగా వచ్చింది ఆనందరావే. తరళకి తెలియని కొత్తవాడు అతడు. పైగా అతడే ఆ కంపెనీకి వూళ్ళో ఏజంటు.
    
    "తరువాతేమైంది" అన్నాను ఆత్రంగా. "కొంచెం ఏడిపిద్దామనిపించింది? 'ఎప్పటికిచ్చారు నాన్నగారు అప్పాయింట్మెంట్' అన్నాను. అయిదింటికి అన్నాడు. లోపలికి వెళ్ళి నాన్నగారితో మాట్లాడినట్లు నటించి బయటకొచ్చి 'సాయంత్రం అయిదు కాదట. నాకదే అనుమానం వచ్చింది. నాన్నగారు సాధారణంగా ప్రొద్దున్నపూట అప్పాయింట్ మెంట్ ఇస్తూ వుంటారు. మీకు ఇచ్చింది, రేప్రొద్దున్న అయిదింటికి-' అన్నాను".
    
    "అతని పేరు?"
    
    "ఆనందరావు" నవ్వాపుకుంటూ అంది.
    
    "...పాపం మరుసటిరోజు చలిలో ప్రొద్దున్న అయిదింటికొచ్చాడు. నాన్న సంగతి తెలుసుగా తొమ్మిధైతేగానీ నిద్ర లేవరు".
    
    "ఏమన్నాడు అతడు?"
    
    "నిన్న సాయంత్రం రమ్మంటే ఇవ్వాళ ప్రొద్దున్న వస్తావా?" అని నాన్న అడుగుతూంటే పాపం తలదించుకున్నాడు. కుర్రాడు భలే స్మార్ట్ గా వున్నాడ్లే- నాకే జాలేసింది".
    
    నేను లాటరీ టిక్కెట్టు విషయం చెప్పాను. అతడు యాభైవేలు ఎంత మామూలుగా వదులుకున్నదీ, నేను అతడి దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడిందీ-అంతా వివరించాను. తరళ మొహంలో నవ్వు మాయమైంది. నేను చెప్పినదంతా విని "అతడిని చూడాలి పద" అంది. నేను తెల్లబోయి- "అతడి దగ్గరికా-" అన్నాను.
    
    "అవును ఏం?"
    
    "మన పల్లెసంగతి మర్చిపోయావా? గోరంత విషయాన్ని కొండంత చేస్తారు".
    
    "ఏడిచారు" నిర్లక్ష్యంగా అంది. తను ఏదన్నా అనుకున్నదీ అంటే ఆలస్యం చేయదు. ఇద్దరం అతడి దగ్గరికి వెళ్ళాం. ఒక చిన్న ఇంట్లో వుంటున్నాడు అతడు. నాకైతే అంత ధైర్యం ఉండేది కాదు. తరళ ముందు క్షమాపణలు చెప్పుకుంది. కేవలం అది సంభాషణ ప్రారంభించటానికి మాత్రమే ఆ తరువాత ఇక దాని ప్రసక్తి లేదు. పల్లంలో ప్రవహించే గోదావరిలా గలగలా మాట్లాడుతూంది.
    
    అతడు కూడా ఆసక్తిగా వింటున్నాడు.
    
    వాళ్ళిద్దర్నీ చూస్తుంటే నాకు ముచ్చటగా అనిపించింది. నేను బాధపడుతున్నానా! లేదని మనస్ఫూర్తిగా అనలేనేమో, కానీ నాకేం అర్హత వుంది. వేశ్య కూతురిగా పుట్టినా, అందం లేదు. అంతవరకూ ఎందుకు? తరళేగానీ ఈ రోజు ఇలా తీసుకురాకపోయివుంటే ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచినా అతడితో మాట్లాడే ధైర్యం చేయలేకపోదునేమో! తరళ కాబట్టి అంత కలివిడిగా మాట్లాడగల్గుతోంది. డబ్బుకూడా ధైర్యాన్నిస్తుంది. ఈ పల్లెలో తనేం చేసినా గుసగుస లాడుకోవటమే తప్ప పైకి అనే ధైర్యం ఎవరికీ లేదు.
    
    వాళ్ళిద్దరివైపూ చూశాను.
    
    అప్పుడే మంచి స్నేహితులైపోయినట్లు మాట్లాడేసుకుంటున్నారు. తరళ అంతే. ఏదైనా అనుకున్నదీ అంటే ఆలస్యం చేయదు. బయటకొచ్చాక అంది. "నేను ప్రేమలో పడిపోయానే" అని. "అప్పుడే?"    
    "ఆహా! లవ్ ఎట్ ఫస్ట్ సైట్".
    
    నేను మాట్లాడలేదు. తను తల్చుకున్నది సాధించి తీరుతుంది అని తెలుసు. నడుస్తున్నదల్లా ఆగి, "కొంపదీసి నువ్వుగానీ ప్రేమిస్తున్నావా అతగాన్ని" అంది. నేను నవ్వాపుకుని "లేదు ఆ మాటకొస్తే నేను అతడిని కలుసుకోవటం కేవలం మూడోసారి మాత్రమే. అదైనా నువ్వున్నావు కాబట్టి" అన్నాను.
    
    "భవిష్యత్తులో ఎవర్నైనా ప్రేమించదల్చుకుంటే నా దగ్గిర కాస్త ధైర్యాన్ని అరువు తీసుకో-"
    
    "తప్పకుండా".
    
    ఆ తరువాత ఆనంద్ ని కలుసుకునే విషయం తరళ రహస్యంగా వుంచలేదు. మా ఇంటికొచ్చి నన్ను రమ్మనేది. అమ్మకి తరళంటే భయం. భక్తి అసలు తరళ మా ఇంటికి రావటమే అదృష్టంగా భావించేది. నేను వెళ్ళనంటే బలవంతం చేసి పంపించేది. గోదావరి ఒడ్డున ఆనంద్ ఎదురుచూస్తూ వుండేవాడు. ముగ్గురం చిన్న పడవలో కాలువ అవతలి పక్కకి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం పూట అక్కడ తోటలో గడిపేవాళ్ళం.
    
    నాకు మనసులో భయంగా వుండేది. రావుగారికి ఇదంతా తెలిస్తే ఏం గొడవ అవుతుందో అని.
    
    కొన్ని రోజుల తర్వాత ఆ ప్రమాదం వచ్చిపడింది. రావుగారి వైపునుంచి కాదు, ఆనంద్ వైపునుంచి.
    
            
                                          8
    
     ఒకరోజు నేనూ ఆనంద్ తరళా మామూలుగానే ఎప్పటిలాగే గోదారి ఒడ్డున కూర్చున్నాం. తరళ దూరంగా వెళ్ళి కలువ పాయలో చేపలు పడుతూంది. ఒక చిన్న తువ్వాలు నీళ్ళల్లో వేసి చిన్న చిన్న చేపల్ని తీసి సీసాలో వేయటం, ఇంటికి తీసుకువెళ్ళి కుండీలో వదలటం తనకి సరదా.
    
    తరళ లేకుండా మేమిద్దరమే వున్నప్పుడు మా మధ్య ఎక్కువ సంభాషణ జరగదు. మౌనంగా కూర్చున్నాం ఆనంద్ సిగరెట్ తాగుతున్నాడు.
    
    "ఎందుకు అన్ని సిగరెట్లు తాగుతారు? మానెయ్యకూడదూ" అన్నాను. "మన పెళ్ళయిన మొదటిరోజు నుంచీ మానేస్తాను. సరేనా..."
    
    నేను దిగ్భ్రమతో తలెత్తాను. ఇటువంటి టాపిక్ అతడు తీసుకు వస్తాడని వూహించలేదు. తరళ ఇంకా చేపలు పడుతూనే వుంది. "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధంకావటంలేదు ఆనంద్...."
    
    అతడు నవ్వేడు. "మరీ తెలియనట్టు మాట్లాడకు. నేనే మంటున్నానో నీకు తెలుసు. నేనింత కష్టపడి ఈ తరళ బోరుభరించటం- ఇదంతా నీ కోసమే".
అప్రయత్నంగా నా దృష్టి తరళ మీద పడింది. నా అభిప్రాయం గ్రహించినట్టుగా "తరళ చాలా చిన్న పిల్ల. అల్లరి చేయటం తప్ప ఏమీ ఫీలింగ్స్ తెలియవు తనకి. ఇంట్లో బాగా స్వేచ్చ ఇచ్చారు. ఈ పల్లెలో ఈ మాత్రం సోషల్ గా వుండేవాడు ఎవరూ లేకపోవటంతో ఈ పరిచయాన్నే ప్రేమ అనుకొంటూంది. కొంతకాలం పోతే మామూలుగా అయిపోతుంది" అన్నాడు.
    
    "నా గురించి కూడా మీకేమీ తెలీదే-"
    
    "తెలియనవసరం లేదు" నవ్వేడు, "ఎవరో కవి అన్నట్టు లవ్ హాజ్ నో రీజన్ అండ్ నో సీజన్".
    
    నా గుండెల్లో ఏదో బెదురు, ఏదో తెలియని భయం.
    
    నేను ఆనంద్ ని ప్రేమిస్తున్నానా? అంతకన్నా ముఖ్యంగా మాఇంట్లోంచి బయటపడాలన్న స్వార్ధం ఎక్కువుందేమో... ఆనంద్ వ్యక్తిత్వం చిన్న సంఘటనతో బైట పడగా చూసి, మనుష్యుల్లో కూడా ఇంత గొప్ప వాళ్ళుంటారా అని ఆశ్చర్యపోయాను. తరువాత అది అభిమానంగా మారింది. ముందు చెప్పినట్లు, తరళ గానీ ప్రవేశించకపోయినట్టయితే అది మూగగా వుండి పోయేది. అతడిని కలుసుకునే ధైర్యం నాకు జీవితంలో ఎప్పటికీ రాకపోయేది. కానీ ఇప్పుడు?
    
    - ఆనంద్ తన ప్రేమని వెల్లడి చేయగానే ఇక నా మనసు నా స్వాధీనంలో లేకుండా పోయింది.
    
    కొన్ని రోజులు గడిచాయి.
    
    ఆనంద్ కవిత్వం బాగా వ్రాసేవాడు. రాత్రంతా కూర్చుని పేజీలకి పేజీలు  వ్రాసేవాడు. అవి మరుసటిరోజు నాకు అందించేవాడు. తరళ ఎగతాళి పట్టించేది. మనమే స్వంతంగా ఒక పత్రిక పెట్టి వీటన్నిటినీ ప్రచురిద్దామనే అనేది. ఆ కవితలన్నీ నా  కోసమే అని ఎలా చెప్పను?
    
    రోజు రోజుకీ నా పని ఇబ్బందిగా మారింది. ఇద్దరికీ తెలియక పోతే అది వేరే సంగతి. కానీ ఆనంద్ ని తరళ ప్రేమిస్తూందని తెలిసి ఇలా తెలియనట్టు నటించటం నాకు చేతకాలేదు. ఆనంద్ తో ఆ విషయమే చెప్పాను. "ఇది అన్యాయం ఆనంద్. తరళకి డబ్బుంది, అందముంది. నీకు తాను సరియైన జోడి..."
    
    "ఏమిటి నువ్వు చెప్పబోతున్నది!"
    
    "తను నీ కోసమే ఇలా వస్తూంది. తనని చేసుకోవటం నీకు అన్ని విధాలా న్యాయం, లాభకరం..."
    
    "నువ్వు మమ్మల్నిద్దర్నీ కలిపి అస్తమిస్తున్న సూర్యుడివైపు వెళ్ళిపోదామనుకుంటున్నావా?"
    
    "నీకు నవ్వులాటగా వున్నట్టుంది-"
    
    "నువ్వు చెప్పేదే హాస్యాస్పదంగా వుంది. కాస్త విచారంగా కూడా వుంది. డబ్బు, అందంకోసం ప్రేమ ట్రాఫిక్ మార్చుకోను. నన్ను అర్ధం చేసుకున్నది ఇంతే అనుకుంటే అందుకే విచారంగా వుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను. నువ్వు ప్రేమించాకపోతే అది వేరే సంగతి. ఇప్పుడిక తరళ కాదుకదా వాళ్ళ నాన్నగారొచ్చి అడిగినా నేను వప్పుకోను".
    
    "కానీ ఆ విషయం తనకి చెప్తే మంచిది కదా-"
    
    "ఏమని? 'నువ్వు నన్ను మాటిమాటికి ఇలా గోదావరి వడ్డుకి తీసుకువస్తున్నది నన్ను ప్రేమించటానికా? అలా అయితే వద్దు. నేను నిన్ను ప్రేమించలేను-' అని చెప్పమంటావా? లాగి పెట్టి కొడుతుంది. 'అసలు నిన్ను ప్రేమించానని ఎవరు చెప్పారోయ్? అన్నీ నీలో నువ్వే వూహించేసుకుంటున్నావ్' అంటుంది. అప్పుడేం చెయ్యను?"
    
    ఆనంద్ చెప్పింది నిజమే. తరళ తన ప్రేమ గురించి ఆనంద్ దగ్గిర ఎప్పుడూ బయట పడలేదు. నా దగ్గిరే చెప్పుకునేది. ఒకసారి నేనే అన్నాను. "చూడు తరళా! అసలు నీ మీద తనకేం అభిప్రాయం వుందో తెలుసుకోలేకపోతే మరీ నీది వన్ సైడెడ్ ప్రేమ అయిపోతుంది".
    
    తరళ నావైపు చిత్రంగా చూసి "నీకు నిజంగా మతిపోయింది" అంది. "ఏం?" అతడి ప్రతీ చూపులో, ప్రతీ కదలికలో నా మీద ప్రేమ తెలియటం లేదూ? ఇంకా వేరేగా చెప్పాలా? వియ్ ఆర్ ఇన్ డీప్ లవ్".
    
    నాకు నిజంగానే మతిపోయింది. నవ్వాలో, ఏడ్వాలో తెలియలేదు. నా భావాల్ని తను వేరుగా అర్ధంచేసుకుంది. "ఏం అనుమానంగా వుందా? అసలు ఇంటరెస్టంటూ లేకపోతే ఇలా ప్రతీ సాయంత్రం ఎందుకు మనతో వస్తాడు. నీకు తెలుసో తెలీదో - మాట్లాడేటపుడు ఆ కళ్ళలో మెరుపుంది చూశావూ- అది చాలోయ్ ప్రేమని పట్టించెయ్యటానికి-"
    
    ఆ మెరుపు నా గురించి అని ఎలా చెప్పటం? ఆనంద్ చెప్పినట్లు నాకు చిత్రమైన కలలు వచ్చేవి. వాళ్ళిద్దరికీ పెళ్ళిచేసి నేను సూన్యంలోకి నడిచిపోయినట్లు ణ ఆకళ్ళు తనకి అమర్చమని చెప్పి చచ్చిపోయినట్లు వగైరా నాకు నవ్వూ వచ్చేది, దుఃఖమూ కలిగేది. తరళతో ఒక్కమాట చెప్పితే అసలు ఈ గొడవంతావుండదు. కానీ నేనెలా చెప్పటం? ఆనంద్ చెప్పాలి.
    
    "తనకి కాస్త అహం కూడా వుంది ప్రమద్వరా! తనని చూసి ఎవరైనా ప్రేమించేస్తారని- అది తగ్గాలి. నేను చచ్చినా చెప్పను. కావాలంటే నువ్వు చెప్పు, మనిద్దరం పెళ్ళి చేసుకున్నామని నాకు అభ్యంతరం లేదు".

No comments:

Post a Comment