వెన్నెల్లో గోదారి పార్ట్ #7

 "నేను లేనప్పుడు నువ్వింత హాయిగా ఉండగలవా?"
    
    ఆమెకి అర్ధం కాలేదు. "నాకు ఎలా వుంటుందో తెలుసా? నువ్వు నా దగ్గిర తప్ప మరెవరి దగ్గిరా నవ్వకూడదని అనిపిస్తూంది".
    
    ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసి "తరళ దగ్గిర కూడానా?" అంది.
    
    "ఆడాళ్ళు - మొగాళ్ళు అన్న ప్రశ్నలేదు. నేనున్నప్పుడు హాయిగా వుండాలి. నేను దగ్గిర లేనప్పుడు ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తూ వుండాలి అంతే".
    
    ఆమె నవ్వాపుకుని "...జెలసీ" అంది.
    
    "అవును ప్రేమకు పరాకాష్ట అది".
    
    మీ కర్ధమైందనుకుంటాను. అలా వుండేది నాకు ఆమెపట్ల ఆరాధన! జీవితాంతం అలా ఉండవలసిన అవసరంలేదు. కానీ జీవితపు ఏదో ఒక స్థాయిలో ఇంత గాఢంగా ఉండకపోతే అది ప్రేమకాదని నా అభిప్రాయం. అయితే నేనెప్పుడూ బయటపడలేదు. అసలు నేను తననెంత గాఢంగా ప్రేమించానో ప్రమద్వరకే తెలీదని నా అనుమానం. పదమంజీరనాద మైకాలు, స్వరమధుర వివశత్వాలూ వర్ణించలేను గానీ నా ప్రేమ చెప్పటానికి పై సంఘటన చాలు. అటువంటి ప్రేమికురాల్ని వదిలిపెట్టి ఈ నిస్సారవంతమైన జీవితాన్ని ఇలా చివరివరకూ నా సమయాన్నంతా ఆస్తి వ్యవహారాలు చూడటం కోసమే గడిపేవాడిని. రావుగారి అల్లుడు రావుగారి కన్నా సమర్ధవంతంగా పన్లు నడుపుతున్నాడు అని ఊళ్ళోవాళ్ళు అనుకోవటం నాకు అప్పుడప్పుడు వినపడేది.
    
    ప్రమద్వర విషయాలేవీ తెలియలేదు నాకు.
    
    కాలం గడిచేకొద్దీ ఆమెని మర్చిపోగల్గుతానేమో అనుకున్నాను. కానీ అది అసాధ్యం అని తేలిపోయింది.
    
    పక్క మంచంమీద భార్య వుండేది. మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది. తరళకి ద్రోహం చేస్తున్నానా అనిపించేది. కానీ లోకమే నాకు ద్రోహం చేసిందన్న ఉక్రోషం కలిగేది.
    
    ప్రమద్వర నా కంటపడలేదు. ఆమె గురించి వివరాలు కూడా చాలాకాలం వరకూ తెలీదు. తెలిసిన మరుక్షణం నుంచీ నాకు ప్రతి రాత్రీ కాళరాత్రయింది.
    
                                      15
    
    "నా తమ్ముడు మనిషికాదు బాబూ రాక్షసుడు" అందామె కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ.
    
    ఆమెవైపు అసహ్యంగా చూశాను. స్వంత కూతుర్ని బలవంతంగా 'రేప్' చేయించిన ఈ వేశ్య ఇప్పుడు ఏడుస్తూంది.
    "ఏమిటి? ఏమైంది?" అని అడిగాడు.
    "వాడు దాన్ని కొడుతున్నాడు. రక్తం పీల్చేస్తున్నాడు".    
    "ఎందుకు?"
    
    "మిమ్మల్నడిగి డబ్బు తెమ్మని..."
    
    కొరడాతో చెళ్ళున కొట్టినట్టయింది. జరుగుతున్న దేమిటో క్షణాల్లో అర్ధమైంది. యాభైవేలకు పైగా ఇచ్చి రావుగారు ఈ పెళ్ళి చేశారు. ఇప్పుడు ఆ రక్తపు రుచి మరిగిన పులి, మొత్తం ఆస్తినే కబళించెయ్యాలని చూస్తోంది. నా బలహీనతని సరియైనచోట పట్టుకుంది.
    "నా కూతురేమో ప్రాణం పోయినా మీ దగ్గిరకి వెళ్లనంటుంది. వాడేమో అయితే ప్రాణాలే తీస్తాను అనేట్టు కొడుతున్నాడు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. నాకేం చెయ్యాలో తోచటంలేదు బాబూ..."
    
    "ఈ  డబ్బంతా నాది కాదు, తరళది, తరళ డబ్బు వాడికెందుకు ఇవ్వాలి? అలా అడిగే హక్కు వాడికేముంది? అయినా... అయినా అసలు వాడికి నేను డబ్బు ఎందుకివ్వాలి? అప్పున్నానా?" ఆవేశంతో నా గొంతు జీరబోయింది.
    
    "అవన్నీ వాడు ఆలోచించడుబాబూ. 'ఆయన దగ్గిర చాలా డబ్బుంది. నువ్వెళ్ళి అడిగితే కాదనడు. ఒకప్పటి నీ ఫ్రెండు కదా! వెళ్ళి అడుక్కుని తీసుకురా' అంటాడు. వెళ్ళకపోతే చచ్చేట్టూ కొడుతున్నాడు. కన్న ప్రేమ వూరుకోక నీ దగ్గిరకి పరుగెత్తుకు వచ్చాను. ఏం చేస్తావో నీ ఇష్టం..."
    
    ఆలోచించాను. ఒకసారి ఇవ్వటం మొదలు పెడితే ఇక అది ఆగదు. అయినా ఎవరి డబ్బో .... ఇచ్చే హక్కు నాకేముంది? ఆ మాటే అన్నాను.
    
    "అలా అనకు బాబూ వాడు దాన్ని చంపేస్తాడు-"
    
    లాగికొట్టి-'కన్నెరికం చేస్తున్నప్పుడు నీ తల్లి ప్రేమ ఏమైంది' అని అడగాలన్న ఆలోచనని బలవంతంగా అణచుకున్నాను. ఈవిడతో తర్కం అనవసరం.
    
    తల అడ్డంగా వూపుతూ, "నేనివ్వను కావాలంటే పంచాయితీ పెట్టించి నీ కూతుర్ని వెనక్కి తెప్పిస్తాను. అంతేకానీ డబ్బు మాత్రం ఇవ్వను" అన్నాను.
    
    "దాన్ని కొడుతుంటే చూస్తూ నేనే భరించలేక పోతున్నాను బాబూ, ఇప్పుడు దాన్ని నువ్వు చూశావంటే గుర్తుకూడా పట్టలేవు. అసలే వట్టి మనిషి కూడా కాదది".

    షాక్ తగిలినట్టయింది. ప్రమద్వర గర్భవతి! కష్టంమీద తమాయించుకుని "ఎంత కావాలి?" అని అడిగాను.
    
    "ఓ రెండువేలిస్తే వాడు నోరుమూసుకుంటాడు బాబూ".
    
    తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. రెండువేలతో సరిపెట్టాడు.
    
    లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చాను. ఆవిడ వెళ్ళిపోయింది.
    
    ఆ తరువాత నుంచీ నాకు నరకం ప్రారంభం అయింది.
    
    పదిరోజుల తరువాత ఆమె మళ్ళీ వచ్చింది.. అదే పనిమీద ఈసారి మరో రెండు వేలు ఎక్కువ.
    
    నాకు పట్టలేనంత ఉక్రోషం.... కోపం.
    
    ఒక్క భైరవమూర్తి మీదే కాదు. మొత్తం ప్రపంచంమీద! నా అసమర్ధత మీద!!
    
    ప్రమద్వర ఎలా వుందో చూడాలన్న నా కోర్కె క్షణక్షణానికీ ఎక్కువ అవసాగింది. ఇంట్లో నెలలు నిండి తిరుగుతున్న తరళని చూసినప్పుడల్లా ప్రమద్వర గుర్తొచ్చేది.
    
    ప్రమద్వరని ఆ నరకం నుంచి ఎలా బైటపడెయ్యాలో నాకు అర్ధం కాలేదు.
    
    చివరికి ఒక ఆలోచన వచ్చింది.
    
    పోలీస్ రిపోర్టు!
    
    ఆ రోజే ఇన్ స్పెక్టర్ ని కలుసుకున్నాను. చాలా గౌరవంగా ఆహ్వానించాడు.
    
    ప్రమద్వరని ఆమె భర్త ఎలా బాధిస్తున్నదీ చెప్పాను. నా దగ్గిర డబ్బులకోసం ఆమె తల్లి వస్తున్న విషయమూ, మిగతా వివరాలేమీ చెప్పలేదు. నేను చెప్పినదంతా విన్నాడు ఇన్ స్పెక్టర్ చివరికి "ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం సార్. మనమేం చెయ్యగలం?" అన్నాడు.
    
    "నాలుగ్గోడల మధ్య ఒక రౌడీ ఒక ఆడదాన్ని రక్తం వచ్చేలా తంతూంటే మీరేం చెయ్యలేరా?"
    
    ఇన్ స్పెక్టర్ ఇబ్బందిగా చూశాడు. అసలింత ఓపిగ్గా వినటమే భాగ్యం. కేవలం ఆ వూర్లో నాకు వున్న పలుకుబడి అతడిని ఆ మాత్రం వినేలా చేసిందను కుంటాను.
నేను లేచి వెళ్ళొస్తానని చెప్పి బయటకు రాబోతుంటే, "ఒకలాగయితే మనం అతడిని బెదిరించవచ్చు సార్" అన్నాడు-నేను ఆగాను.
    
    "తన కూతుర్ని అల్లుడు కొట్టి బాధలు పెడుతున్నాడని ఆమె తల్లి గానీ ఒక రిపోర్టిచ్చినట్టయితే అతగాడ్ని పోలీస్ స్టేషనుకి తీసుకురావచ్చును. కేసేమీ పెట్టలేంగానీ, ఒకసారి పోలీస్ స్టేషనుకొస్తే ఇక లైఫ్ లో భార్య వంటిమీద చెయ్యి వేయకుండా చేసే బాధ్యత మాది..."
    
    ఈ ఆలోచన బాగానే వున్నట్టు తోచింది- తలూపి బయల్దేరాను.
    
    ఈసారి ప్రమద్వర తల్లి డబ్బుకోసం వచ్చినప్పుడు ఈ ఫిర్యాదు విషయంచెప్పవచ్చు - కానీ అంతవరకూ ఆగకుండా అక్కడికే స్వయంగా బయల్దేరాను. ప్రమద్వరని చూడగలనన్న ఆశ మనసులో మినుక్కుమినుక్కుమని వేలుగుతూంది. మనం ఎంతో అభిమానించే వాళ్ళు ఒకసారిగా మనల్ని "అవాయిడ్" చేస్తున్నారని తెలిసినపుడు వాళ్ళని కలుసుకోవాలన్న తాపత్రయం మరింత ఎక్కువ అవుతుంది. దూరమవటానికి కారణాలు తెలిసినా సరే! అలాంటిదే నా కోరిక కూడా.
    
    గుమ్మం ప్రక్కన నిలబడి లోపల్నుంచి ఆమె కనపడుతుందేమోనని చూశాను. ఆమె లేదుగానీ మాటలు వినిపించాయి. అత్తా అల్లుడు మాట్లాడుకుంటున్నారు.
    
    "ఇంకొకసారి వెళ్ళు ఈ సారి పదివేలు పట్రా".
    
    "మొన్నే కదా వెళ్ళొచ్చింది. మాటి మాటికీ వెళ్తే అంత బాగోదేమో తమ్ముడూ..."
    
    "ఫర్వాలేదులేవే దాన్ని ఈసారి మరింత గట్టిగా బాదానని చెప్పు లేదా చితగ్గొట్టానని అను దాంతో వాడు బెదిరిపోయో, జాలిపడో అడిగిన డబ్బు ఇవ్వక పోడు".
    
    నేను వింటున్నది నిజమేనా అన్న అనుమానం కలిగింది. ప్రమద్వర తల్లి తమ్ముడితో కలిసి ఇంత నాటకం ఆడుతుందని వూహించలేదు. డబ్బు ఎంత పనైనా చేయిస్తుందనటానికి ఈవిడే ప్రత్యక్ష సాక్షి.
    
    అట్నుంచి అటే తిరిగి వచ్చేశాను. మనసంతా వికలమైంది.
    
    ఇది జరిగిన మరుసటిరోజు ఆవిడ మా ఇంటికి మళ్ళీ వచ్చింది. తలుపులు వేసి "ఈ సారి ఎంతకావాలి?" అని అడిగాను.
    
    "పదివేలు బాబూ".
    
    ఫాంటుకి వున్న బెల్టు తీసి చేతికి చుట్టుకుంటూ, "దొంగముండా! బుద్దిపోనిచ్చుకున్నావు కాదు. తమ్ముడితో కలిసి ఎంత ఎత్తువేశావె" అంటూ కొట్టబోయాను. అనుకోని పరిణామానికి బిత్తరపోయినా, వెంటనే కాళ్ళ మీద పడింది అది- అప్పటికే రెండు దెబ్బలు దానిమీద పడ్డాయి. అది ఏడుస్తూ "క్షమించు బాబూ, డబ్బు తీసుకురాకపోతే వాడు చంపేస్తాడు" అంది.
    
    "మీ ఎత్తులు నాకు తెలుసు"
    
    "వాడు నిజంగానే దాన్ని చావబాదుతాడు. తల్లి ప్రాణం వూరుకోక వాడితో కలిసినట్టు వున్నాను. నన్ను నమ్ము బాబూ" అని కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుంది. అది నిజమో, రంకో నా కర్ధం కాలేదు. ఏది ఏమైనా "నేనిక చచ్చినా పైసా ఇవ్వను" అని బయటకు గెంటి తలుపేసేసేను. వెనుదిరిగేసరికి తరళ వుంది.
    
    ఆవిడ వారానికి ఒకసారీ ఇంటికి రావటం తరళకి అనుమానాన్ని తెప్పించి వుంటుంది. "మాటిమాటికీ ఆవిడ ఎందుకొస్తూంది?" అని అడిగింది.
    
    "నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నా నుంచి వసూలు చేసుకోవటానికి" మనసులో అనుకున్నాను.
    
    నా కందరిమీద కసిగా వుంది. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళే. నేనొక్కన్నే స్వార్ధపరుడిని పైకి కనిపించే నిజం ఇది. పైకి కనిపించేవన్నీ నిజాలు కావు. నా తరఫునుంచి చెప్పుకోవటానికి వాదనేమీ లేకపోవచ్చు. వాదన లేకపోయినంత మాత్రాన మనిషి చెడ్డవాడు కాదు. తప్పుచేసినవాడి వాదన అందరూ నమ్మేలా బలంగా వుండవచ్చు. ఆత్మహత్య చేసుకుని నా మామగారు, గాఢంగా ప్రేమించిన నా భార్య- ఈ ప్రజల సానుభూతి సంపాదించారు. ఎటూ నలిగిపోతున్నది నేనొక్కన్నే. ప్రమద్వర కోసం నా హృదయం ఎంత తల్లడిల్లిపోతున్నదీ ఎవరికీ అర్ధంకాదు. ఈ ప్రేమ నా బలహీనత కాదు. దౌర్భాగ్యం.
    
    ఆ దౌర్భాగ్యం అక్కడితో ఆగలేదు. మరుసటిరోజు సాయంత్రం తెలిసింది ణ అమతల తాలూకు పరిణామం.
    
    ప్రమద్వర ఆస్పత్రిలో వుంది! వంటింట్లో కాలుజారి పడింది... తలకు పెద్ద గాయమై...
    
    అసలు నిజం అది కాదని నాకు తెలుసు.
    
    తనేం చేయగలడో భైరవమూర్తి చేసి చూపించాడు. నాకు శాంపిల్ గా ఈ వార్త పంపించాడు.
    
    పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశంతో ఊగిపోయాను.
    
    ఆ సాయంత్రమే ఆమె తల్లి మళ్ళీ వచ్చింది. ఆస్పత్రిలో వున్న కూతురిని రక్షించుకోవటానికి డబ్బు కావాలని అర్దింపు.
    
    ఆ అర్దింపు వెనుక ఒక సన్నటి చిరునవ్వు వుందా? ఏమో "నిన్ను మేము గెలిచాము" అన్న విజయం తఃలూకు నవ్వు వుండి వుండవచ్చు. నేను నిస్సహాయుడిని అయిపోయాను. ఆమెకు డబ్బిచ్చి పంపించాను.
    
    ఆ రోజు మొట్టమొదటిసారిగా తాగాను.
    
    ఈ బాధల్ని, అన్నివైపుల్నించి వస్తూన్న వత్తిడుల్నించీ పారిపోవటం కోసం తాగుడు అలవాటు చేసుకున్నాను. మొట్టమొదటిసారి తాగి వచ్చిన నన్ను చూసి తరళ భయపడింది. ఆ భయం నాకు చాలా బావున్నట్టు అనిపించింది. ఆ భయాన్ని చూస్తున్న కొద్దీ మనసు ఆనందంతో నిండిపోసాగింది. అప్పటివరకూ నన్ను క్షోభ పెట్టిన వారందరిమీద నేను కక్ష తీర్చుకుంటున్నట్టు తోచింది. మరింత తాగాను.
    
    తాగుడు ఇంత ఆనందం ఇస్తుందనుకోలేదు. అదొక్కటే కాదు కారణం ప్రతి మనిషిలోనూ ఒక సాడిస్ట్ దాగి వుంటాడనుకుంటాను.
    
    ఈ తాగుడు, నాకన్నా నాలోని సాడిస్ట్ ని ఎక్కువ సంతృప్తి పరచసాగింది. నాకు రెండు రకాలైన ఆనందాలు, ప్రమద్వరని మర్చిపోవటం, తరళని బాధపెట్టటం.
    
    వ్యాపారం పట్టించుకోవటం మానేశాను.
    
    తరచు పట్నంలో మకాం పెట్టసాగాను. రాత్రింబవళ్ళు ఒకటే ధ్యాస. పట్నంలో అయితే నేనెక్కడున్నానో భైరవమూర్తికి గానీ, వాడి అక్కకిగానీ తెలీదు. నేను ఎక్కువగా అక్కడే గడపటానికి అదో కారణం.
    
    మొదట్లో తెలియక పోయినా, కొద్దిరోజుల్లో ఆ పల్లెలో ఈ వార్త గుప్పుమంది. ముక్కూమొహం తెలియని వాళ్ళంతా నాకు సలహాలూ, మందలింపులూ ఇవ్వటం ప్రారంభించారు. బహుశా వీరెవ్వరూ జీవితకాలంలో ఒక్కసారైనా ప్రేమించి వుండరు. నేను పట్నంలోనే గడపటానికి అది రెండో కారణం.
    
    నాకు అన్నిటికన్నా ఆశ్చర్యంగా అనిపించింది తరళవిషయం!
    
    ఆమె కావాలనుకుంటే నాకు డబ్బు అందనివ్వకుండా చెయ్యవచ్చు. (నేను వుద్యోగం మానేసి చాలా కాలమయింది) ఆస్తి వ్యవహారాలు తనే చూసుకుంటూండవచ్చు కనీసం, వారం వారం ఇంత డబ్బు ఎవరికిస్తున్నారని నిలదీయవచ్చు కానీ అదేమీ చెయ్యలేదు.
    
    అలా చెయ్యకపోవటం నాలో మరింత బాధనిపించింది. మీకు అర్ధమైందనుకుంటాను. ఇంకెలా చెప్పాలో నాకు తెలియటంలేదు.
    
    ఆ రోజు నేను మరింత తాగాను. నేను దగ్ధమవ్వాలి, ఈ ఆస్తి దగ్ధమవ్వాలి. ఈ పల్లె దగ్ధమవ్వాలి. భైరవమూర్తి పైసాదొరక్క విలవిల్లాడి పోవాలి.
ఆ రాత్రి నాకు బాగా జ్ఞాపకం.
    
    పాతిక సంవత్సరాల క్రితం తాలూకు ఆ రాత్రి నా స్మృతుల్లో ఇంకా సజీవంగా వుంది. ఆ రోజు మాట్లాడిన ప్రతి మాట పొల్లుపోకుండా నాకు గుర్తుంది. నేనెందుకు ఆ రోజు అలా మాట్లాడాను? అలా మాట్లాడకపోయి వుంటే ఈ రోజు నా కథ ఇలా మలుపు తిరిగి వుండేదా?
    
    ....ఏమైందో తరువాత చెపుతాను.
    
    ఆ రాత్రి వర్షం ధారాపాతంగా కురుస్తూంది. ఆకాశాన్ని చీలుస్తున్నట్టు మెరుపులు. అవుట్ హౌస్ లో కూర్చుని తాగుతున్నాను. సమయం ఎనిమిదిన్నర దాటింది. ఈ వర్షంవల్ల పల్లెంతా రెండుగంటల క్రితమే నిద్రలోకి జారుకున్నట్టుంది.
    
    అప్పుడొచ్చింది ప్రమద్వర. నెమ్మదిగా నీడలో.... తల మీదుగా పైట కప్పుకుని.
    
    మసక చీకట్లో ముందు గుర్తుపట్టలేదు. ఆమె దగ్గిరగా వచ్చింది. "ప్ర.....మ....ద్వ... రా" ఉద్వేగంగా, సంభ్రమాశ్చర్యాలు నిండిన కంఠంతో అన్నాను. ఆమెను చూడాలన్న నా కోరిక ఈ రాత్రి ఈ విధంగా తీరుతుంది. అనుకోలేదు.
    
    కానీ ఎందుకో నా కప్పుడు అంత సంతోషంగా అనిపించలేదు. దయచేసి నన్ను అర్ధం చేసుకోండి. నా మనసంతా ఒకవిధమైన విరక్తితోనూ, కసితోనూ నిండివుంది. నేను ప్రమద్వరని ప్రేమించటం కన్నా ప్రమద్వరని ప్రేమిస్తూ భంగపోయానన్న భావాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను అనుకుంటాను. ఆ స్థితి అలాటిది. అందుకే ఆమె రాక నా కానందాన్ని కలిగించలేదు అన్నది తేలిపోయింది.
    
    "నన్ను తాగొద్దనీ- ఇలా ఆరోగ్యం పాడుచేసుకోవద్దని చెప్పటానికే వచ్చావు కదూ" ఆమె మాట్లాడలేదు.
    
    "నువ్వెందుకు వచ్చావో నాకెలా తెలిసిందీ అని అడగవే?"
    
    "ఎలా తెలిసింది?"
    
    "చాలా కాలం క్రితం శరత్ ఇలాటి సంఘటనే వ్రాసేడు...." నవ్వేను కసిగా. "నీకు సంతోషంగా వుందా? మనం కూడా అలా చరిత్రలో నిలబడబోతున్నాం-"
    
    ఆమె దానికీ సమాధానం చెప్పలేదు. నాకు మరింత క్రోధం కలిగించింది.
    
    "ఇదంతా నీ మూలానే... నీ మూలానే జరిగింది. నేనేం పిరికివాడిని కాదు. ప్రపంచాన్ని ఎదిరించయినా నిన్ను చేసుకుంటాను అన్నాను. ఏదో వేదాంతం చెప్పావు. విధవరాలిగా బ్రతకటంకన్నా కన్యగా బ్రతకటం కోరుకుంటున్నా నన్నావు - పైగా ఇదంతా నా కోసం అన్నావు. చివరికి ఇంకెవడినో చేసుకున్నావు. నీ సెంటిమెంటుతో మనిద్దరి జీవితాలూ పాడుచేశావు. ఇప్పుడు మరొక సలహా ఇవ్వటానికి వచ్చావు. క్షమించు- నీ సలహా నా కనవసరం. నేనీ తాగుడు మానను".
    
    "నేను అది చెప్పటానికి రాలేదు ఆనంద్"
    
    "మరి?"
    
    "భైరవమూర్తికి డబ్బు ఇవ్వవద్దని చెప్పటానికి వచ్చాను".
    
    ఈసారి వెంటనే నేను మాట్లాడలేదు.. కొంచెం ఆగి అన్నాను. "నువ్వు చెప్పబోయే మిగతావి కూడా నాకు తెలుసు. 'మా ఆయనే నన్ను రక్తం వచ్చేలా కొట్టినా నువ్వు రాయిలా వుండిపో. అది మా దంపతుల మధ్య విషయం అంటావు' నేను అలా వుండలేను అంటాను. 'తరళ ఆస్తి ఇది దీన్ని ఇచ్చే హక్కు నీకేముంది' అంటావు, అంతేగా! చూడు ప్రమద్వరా, దీన్ని చెప్పే హక్కు నీకులేదు. మొత్తం అన్ని నైతిక విలువల్నీ వదిలేసుకున్న వాడిని. ఒకప్పుడు ప్రమద్వర అనే అమ్మాయిని ప్రేమించాను. నిన్ను కాదు. నువ్వు వేరు. ఆ అమ్మాయి కోసం నేనేమయినా చేస్తాను. దాన్ని కాదనే హక్కు నీకులేదు. నీవేకాదు, నన్నెవరూ ఆపలేరు.
    
    ఆమె కళ్ళనిండా నీళ్ళతో- "ఇలా అయితే నీకేమీ మిగలదు. ఆనంద్! ఆరోగ్యం కూడా నాశనమవుతుంది" అంది.
    
    "అవనీ అదే నాకు కావల్సింది".
    
    ఆమె అరచేత్తో నుదుటిని కొట్టుకుంటూ, 'భగవంతుడా! నేనేం చేసేది?" అని గొణుక్కోవటం వినిపించింది.
    
    "ఆ  భగవంతుడు నాకేమీ సలహా ఇవ్వలేదు ప్రమద్వరా! గతంలో మనకి అతఃదిచ్చిన ఏ సలహా కూడా బావోలేదు".  

    ఆమె ఒక నిర్ణయానికి వచ్చినదాన్లా "నేనిక్కడినుంచి వెళ్ళిపోతాను" అంది.
    
    "ఎక్కడికి?'
    
    "ఎక్కడికో తెలీదు. నేను వెళ్ళిపోతే మీకు భైరవమూర్తి బెడద ఉండదు!"
    
    కుర్చీలోంచి లేచి బిగ్గరగా "బెదిరిస్తున్నావా?" అని అరిచాను. "... అందరూ నన్ను బెదిరించేవాళ్ళే! నువ్వూ - మీ ఆయనా- నా మామగారూ-నాభార్య..." నా గొంతు జీరగా పలికింది. "ఇదిగో! ప్రమాణం చేసి చెపుతున్నాను. నన్ను రక్షించడంక్సోం నువ్వు నిలువనీడ వదిలేసి వెళ్ళిపోతే- మరుక్షణం నా శవమే మిగిలినట్టుగా అనుకో"
    
    ఆమె నవ్వటానికి ప్రయత్నించింది.
    
    "ఒక ఆడది ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకలేదా ఆనంద్".    
    
    నేను మాట్లడలేదు.
    
    "పోనీ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో నువ్వే చెప్పు నా గురించి జీవితాంతం నా భర్తకి డబ్బు ఇస్తావా?"
    
    "వాడిని పోలీసులకు పట్టిస్తాను".    

    ఆమె నవ్వి-"అప్పుడూ నేను ఒంటరిదాన్నే అవుతాను కదా" అంది.
    
    "నేనూ నీతో వచ్చేస్తాను ప్రమద్వరా! ఇద్దరం వెళ్ళిపోదాం".    

    ఆకాశం మెరుపులో ఆమె నా వైపు నిరాసక్త స్థాయీ భావపు శుష్కమైన నవ్వుతో చూడటం కనపడింది. అంతలో ఆమె అన్నది- "ఈ మాట పెళ్ళయిన మొదటిరోజున కూడా అన్నావు కానీ అప్పటి ఆవేశం ఇప్పుడులేదు. ఉండాలని నేను కోరుకోవటం లేదుకూడా భార్యను వదిలి రావటం అంత సులభమైన పని అనుకున్నావా! గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పు అందులోనూ ఒక వివాహిత స్త్రీ కోసం..."
    
    నేను మౌనంగా వుండిపోయాను. ఆమె చెప్పిన దానిలో వాస్తవం నన్ను పరిహసిస్తూంది ఆమె భవిష్యత్తు వాస్తవంగా భయపెడుతూంది. ఆమె చెప్పిన దానికి సమాధానంగా అన్నాను- "నన్నిలా వదిలిపెట్టు ప్రమద్వరా! మన గమ్యాన్ని శాసించేవాళ్ళం మనం కాదు ఎలా జరుగుతుందో అలా జరగనీ-"
    
    "మరి ఈ తాగుడు వదిలిపెడతావా?"
    
    "అది మాత్రం అడక్కు..." అని ఆగాను. "నీకు తెలీదు ప్రమద్వరా ప్రతి రాత్రీ నాకొక నరకం. నీ గురించీ ఆలోచిస్తాను. ఆ రోజుల్లో భైరవమూర్తి చేతుల్లో నిన్ను ఊహించుకుని నిద్ర ఉండటం లేదు. ఇదంతా వినేవాళ్ళకి నవ్వుగా కనపడవచ్చు. కానీ నన్ను అర్ధం చేసుకునే వాళ్ళకి అర్ధమవుతుంది ఆ బాధ".    
    ఆమె చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆగి ఆగి కురిసే వర్షం చినుకుల శబ్దంతప్ప మరేమీ వినపడటంలేదు. అప్పుడప్పుడూ దూరంగా ఉరుముతోంది.
    
    ఆమె అలా ఎంతసేపు ఉందో తెలీదు. ఏమి ఆలోచిస్తూందో తెలీదు. కాళ్ళు స్టూలుమీద పెట్టి ఈజీచైర్లో వాలి ఆమెనే చూస్తున్నాను. అస్థిపంజరంలా ఉందామె. కేవలం మాతృత్వఛాయే ఆమెని స్త్రీగా గుర్తింపచేస్తూంది! ఆమె రక్త మాంసాల్ని పీల్చి పిప్పిచేశాడు భైరవమూర్తి నేను నా ఆలోచన్లలో వుండగా...
    
    ఆమె నెమ్మదిగా ముందుకి వంగి, నన్ను ఒకసారి స్పృశించి వెనుదిరిగింది.
    
    అప్పుడే భూమినంతా వెలుగులో నింపేసేలా ఒక్కసారి ఆకాశం మెరిసింది.
    
    ఆ మెరుపులో ఆమె మొహం కదలాడిన భావం నా కళ్ళలో చిత్తరువులా నిలిచిపోయింది. కంటి చివర నీటిచుక్క భవిష్యత్ చరిత్రని చెప్పింది. ఆమె ఏమి నిశ్చయించుకున్నదో తెలిపే భావం అది.
    
    అది తెలిసేసరికి ఛివాలున కుర్చీలోంచి లేచాను.
    
    అప్పటికే ఆమె గుమ్మం దాటుతూంది.
    
    "ఆగు" అని అరిచాను. ఆమె ఆగలేదు.
    
    చీకట్లోనే అరిచాను. "నన్ను రక్షించటం కోసం ఎవరికీ తెలియని చోటికి నువ్వెళ్ళిపోదామనుకుంటే... నీ కడుపులో బిడ్డ మీద ఒట్టేసి చెపుతున్నాను... నేను నేనుగా మిగలను గుర్తుంచుకో".
    
    ఆమె ఆగింది.
    
    వెనుదిరిగి చూసింది.
    
    నవ్విందా? ఏమో...
    
    నా మాటలు ఆమె నిర్ణయాన్ని మార్చుకునేలా చేసినయ్. పూర్తిగా కాదు. కాస్త.
    
    ఫలితమే గోపీచంద్.
    
            

                                                                ---* * *---

No comments:

Post a Comment