సంగీత స్వర సమ్మేళన, సమ్మోహన శిల్పి ఇళయరాజా పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన గురించి కొద్ది మాటలు.....
సంగీతంతో రాళ్ల అయినా కరిగిపోతూ ఉంటాయి అని అంటూ ఉంటారు.... ఇళయరాజా సంగీతం వింటుంటే నిజంగా ఇది నిజమేనేమో అనిపిస్తూంది. అంత గొప్పగా సంగీత ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి ఇళయరాజా అందించిన పాటలు. సంగీతానికి కొత్త వొరవడి తొక్కించిన గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా.
ఇళయరాజాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు జ్ఞానదేసికన్, అయితే స్కూల్‌లో చేర్చే సమయంలో ఆయన పేరును రాజయ్య మార్చారు. తరువాత సంగీత దర్శకుడిగా తన తొలి సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన తన పేరు ఇళయరాజాగా మార్చుకున్నారు. అప్పట్లో ఏఎమ్ రాజా అనే సంగీత దర్శకుడు ఉండటంతో పేరు ఒకేలా ఉందన్న ఉద్దేశంతో ఇళయరాజాగా పేరు మార్చుకున్నారు...
చిన్నతనంలోనే సంగీతం పట్ల ఆకర్సితుడైన ఇళయరాజా 14 ఏళ్ల వయసులో ఓ మ్యూజిక ట్రూప్‌లో జాయిన్ అయ్యాడు. మొదట్లో ఎక్కువగా జానపద సంగీతాన్ని ఇష్టపడేవాడు ఇళయరాజా. ఆ తరువాత తమిళ్‌లో ప్రముఖ రచయిత కన్నదాసన్ రచనలకు సంగీతమందించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇళయరాజా...
సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. 1970కి ముందు శ్రోతలు మధురమైన సంగీతాన్ని విన్నారు. 1970 ఎంటర్ అయిన తర్వాత సినిమా సంగీతం ధోరణి కొద్ది కొద్దిగా మారుతూ వచ్చింది. మధురం స్థానంలో కొంత మాస్ మసాలా కూడా తోడైంది. కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ పాటల ప్రాధాన్యత పెరిగింది. 1970 తర్వాత ఓ ఐదారు సంవత్సరాలు ఒకే తరహా పాటలు వినిపించాయి. ఆ టైమ్‌లోనే ఇళయరాజా అనే ఓ కొత్త సంగీత తరంగం సంగీత ప్రేమికుల వీనులకు తాకింది. తెలుగులో ‘భద్రకాళి’ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఇళయరాజా మెల్ల మెల్లగా తన విభిన్నమైన వాయిద్యాలతో కొత్త తరహా స్వరాలను సంగీతాభిమానులకు స్లో పాయిజన్‌లా ఎక్కించడం మొదలు పెట్టాడు.
మాస్ మసాలా సంగీతం నుంచి... వినసొంపైన సంగీతానికి తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకు వచ్చిన గొప్ప స్వరకర్త ఇళయరాజా. 40 సంవత్సరాల పాటు సంగీత అనుభవంగల ఇళయరాజా... ఎంతో గొప్ప సంగీత దర్శకుల జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు. ఈయన అందించిన పాటలు ఎన్నో మైలురాళ్లు గా నిలిచి పోయాయి. నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటి తరం ప్రేక్షకుల వరకు అందరినీ అలరిస్తూ ఉన్నాయి.
మాస్ పాటైనా, మెలోడీ సాంగ్ అయినా, సంగీత ప్రధానమైన పాటైనా ఇది ఇళయరాజా సాంగ్ అని సామాన్య శ్రోత కూడా గుర్తు పట్టేంత విభిన్నంగా అతని పాటలు వుండేవి. శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్‌ని లింక్ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సంగీతం అంటే ఇదీ, పాటలంటే ఇవీ అని అందరిచేతా అనిపించారు. 1980 దశకంలో ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకునేంతగా పాటలు వినేవారు. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలనూ మ్యూజికల్ హిట్స్ చేసిన ఘనత ఇళయరాజాది. అలాగే ఎ.ఆర్.రెహమాన్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు మణిరత్నం సినిమాలన్నింటికీ ఇళయరాజాయే మ్యూజిక్ చేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. కమల్‌హాసన్, కె.విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఇళయరాజా కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌గా చెప్పుకోవచ్చు.
కోలీవుడ్ టాప్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ల ఫేవరెట్ సంగీత దర్శకుడు ఇళయరాజా. మేస్ట్రో దాదాపు 1000 సినిమాలకు సంగీతమందించగా అందులో 200లకు పైగా సినిమాల్లో కమల్ హాసన్ లేదా రజనీకాంత్‌లలో ఒకరు హీరోలుగా నటించటం విశేషం....
ఇళయరాజా తన నలభై సంవత్సరాల వృత్తి జీవితంలో ఇప్పటివరకు ఐదు వేల పాటలకు స్వరాలు సమకూర్చారు... 1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా. సంగీతంలో ఇళయరాజా చేసిన సేవలకు గాను 2010లో పద్మభూషణ్.. 2018లో పద్మ విభూషణ్ అవార్డులను అందించి ప్రభుత్వాలు సత్కరించాయి. ఇక సంగీత దర్శకుడిగా ఆయన ఏకంగా 5 జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. శ్రీరామరాజ్యం రుద్రమదేవి ధోని లాంటి సినిమాలకు కూడా సంగీతదర్శకుడిగా పని చేసి నేటి తరం ప్రేక్షకులను కూడా ఆకర్షించారు ఇళయరాజా.

మొత్తంగా సంగీత దర్శకుడిగా ఐదు జాతీయ అవార్డులు అందుకుంటే.. అందులో తెలుగులో ఈయన సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాగర సంగమం’,‘రుద్రవీణ’ సినిమాలకు అవార్డు దక్కడం విశేషం. ఇక మిగిలిన రెండు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు జాతీయ అవార్డులు వచ్చాయి, తెలుగులో ‘గుండెల్లో గోదారి’, ‘శ్రీరామ రాజ్యం’, రుద్రమదేవి’ ‘ధోని’ ‘ఏటో వెళ్లిపోయింది మనసు’, ‘మనఊరి రామాయణం’ తర్వాత తర్వాత సంగీత దర్శకుడిగా గ్యాప్ వచ్చింది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇళయరాజా ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా, కుమార్తె భవతారణి అయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకులుగా మారారు.








No comments:
Post a Comment